Take a fresh look at your lifestyle.

నాలుగు వారాల్లో పూర్తిస్ధాయి డీజీపీని నియమించండి యూపీఎస్సీ, రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఆదేశాలు

ముద్ర, తెలంగాణ బ్యూరో :

వచ్చే నాలుగు వారాల్లోగా రాష్ట్ర డీజీపీ నియామక ప్రక్రియ పూర్తి చేయాలని యూపీఎస్సీ, తెలంగాణ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. గత ఏప్రిల్‍లో తెలంగాణ ప్రభుత్వం పంపించిన ప్రతిపాదనలను పరిగణలోకి తీసుకోవాలని యూపీఎస్సీని ఆదేశించింది. గతేడాది డీజీపీగా బి.శివధర్ రెడ్డి నియామకం విషయంలో హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్‍పై సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ ధర్మాసనం గురువారం విచారణ జరిపింది. ఈ పిటీషన్ లో హైకోర్టు తీర్పును సమర్థించింది. ఈ క్రమంలో నాలుగు వారాల్లో పూర్తి స్థాయి డీజీపీ నియామక ప్రక్రియ పూర్తి చేయాలని యూపీఎస్సీకి, తెలంగాణ ప్రభుత్వానికి ఆదేశించింది. ఈ సందర్భంగా సీజేఐ సూర్యకాంత్ వ్యాఖ్యానిస్తూ ఈ విషయాన్ని సింగిల్ జడ్జి బెంచ్ ముందు ఎందుకు లిస్ట్ చేశారు? ఆయన ఆదేశంలో తప్పేమీ లేదు. కానీ సాధారణంగా ఇలాంటి అంశాలను సీనియర్ జడ్జి విచారించాలని మేము ఆశిస్తామని అన్నారు. ఇదీలావుంటే… శివధర్‌ రెడ్డికి డీజీపీగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ గతేడాది సెప్టెంబరు 26న రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసింది. అయితే ఈ నియామకం చెల్లదని, సదరు జీవోను కొట్టేయాలంటూ హైదరాబాద్‌కు చెందిన టీ ధనగోపాలరావు గతేడాది అక్టోబరు 10న హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ‘ప్రకాశ్‌సింగ్‌ వర్సెస్‌ యూనియన్‌ ఆఫ్‌ ఇండియా’ కేసులో డీజీపీల నియామకంపై సుప్రీంకోర్టు స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసిందని.. దాని ప్రకారం డీజీపీని తాత్కాలిక పద్ధతిలో నియమించడానికి వీల్లేదని పిటిషనర్ పేర్కొన్నారు. విచారణ జరిపిన హైకోర్టు డీజీపీగా శివధర్‌ రెడ్డి నియామకానికి సంబంధించిన జీవో కొట్టివేతకు నిరాకరించింది. కానీ డీజీపీ ఎంపిక ప్రక్రియను కొనసాగించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ ఆదేశాలను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీంతో సుప్రీం కోర్టు గురువారం కీలక ఉత్తర్వులు జారీ చేసింది.

Leave A Reply

Your email address will not be published.