పెండింగ్ లో ఉన్న 15వ ఆర్థిక సంఘం నిధులు విడుదల
తొలి విడతగా రూ.259.36 కోట్లు రిలీజ్
ముద్ర, తెలంగాణ బ్యూరో :
రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలకు కేంద్ర ప్రభుత్వం తీపి కబుతు చెప్పింది. గత కొంతకాలంగా నిలిచిపోయిన 15వ ఆర్థిక సంఘం నిధులు విడుదల చేస్తూ కేంద్ర ఆర్థిక శాఖ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు తొలి విడతగా రూ.259.36 కోట్లు కేటాయించింది. రాష్ట్రంలో గ్రామ పంచాయతీల గడువు ముగిసినప్పటికీ ఎన్నికల నిర్వహణలో జాప్యం జరగడంతో కేంద్రం నిధులను పూర్తిగా నిలిపివేసింది. అయితే ఇటీవల పంచాయతీ ఎన్నికలు విజయవంతంగా పూర్తి కావడంతో నిధుల విడుదలకు ఉన్న సాంకేతిక అడ్డంకులు తొలగిపోయాయి. ఈ నిధుల సాధనలో రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క… పంచాయతీ రాజ్ శాఖ ఉన్నతాధికారులతో కలిసి కేంద్ర ప్రభుత్వంతో నిత్యం సంప్రదింపులు జరిపించారు. మరోవైపు ఎన్నికల ప్రక్రియను పూర్తి కావడంతో ఈ నిధులు విడుదలయ్యాయి. రాష్ట్రానికి కేంద్రం ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు సుమారు రూ.3 వేల కోట్ల వరకు నిధులు అందాల్సి ఉంది. ఈ క్రమంలోనే విడతల వారీగా నిధుల విడుదల భాగంగా రూ.259.36 కోట్లు విడుదలయ్యాయి. తాజాగా విడదులైన నిధులతో గ్రామాల్లో పారిశుధ్యం, తాగునీరు, వీధి దీపాలు ఇతర అత్యవసర అభివృద్ధి పనులకు వినియోగించనున్నారు.