కార్మికుల హక్కులకు ముప్పు
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త కార్మిక కోడ్‌లు కార్మికుల హక్కులు, పత్రికా స్వేచ్ఛతో పాటు దేశ రాజ్యాంగంలోని సమాఖ్య నిర్మాణానికి తీవ్ర ముప్పుగా పరిణమించాయని ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ (ఏఐటియుసి) ప్రధాన కార్యదర్శి శ్రీమతి అమర్జీత్ కౌర్ అన్నారు.
నీలం రాజశేఖర్ రెడ్డి రీసెర్చ్ సెంటర్ (ఎన్‌ఆర్‌ఆర్‌ఆర్‌సి) ఆధ్వర్యంలో హైదరాబాద్ కొండాపూర్ సి.ఆర్. ఫౌండేషన్ లోని ఇంద్రజిత్ గుప్తా హాల్‌లో నిర్వహించిన “భారతదేశంలోని కొత్త కార్మిక చట్టాలు, వాటి ప్రభావాలు” అంశంపై జరిగిన సదస్సులో ఆమె మాట్లాడారు. కొత్త కార్మిక కోడ్‌లు కార్మిక వ్యతిరేకమైనవిగా ఉన్నాయని, కార్మిక సంక్షేమం కన్నా కార్పొరేట్ ప్రయోజనాలకే అనుకూలంగా వాటిని రూపొందించారని ఆమె విమర్శించారు. దశాబ్దాల పోరాట ఫలితంగా సాధించిన 8 గంటల పని విధానాన్ని రద్దు చేసి, యజమానుల ఇష్టానుసారంగా పని గంటలు పెంచుకునే వెసులుబాటు కల్పించడం కార్మికులను మళ్లీ బానిసత్వంలోకి నెట్టడమేనని అమర్ కౌర్ విమర్శించారు. ‘వేతనం’ అనే పదానికి కొత్త నిర్వచనం ఇవ్వడం ద్వారా అలవెన్సులు తగ్గిపోతాయని, దీని ప్రభావం పిఎఫ్, గ్రాట్యుటీ, రిటైర్ ప్రయోజనాలపై తీవ్రంగా పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. అనేక నిబంధనతో కార్మిక యూనియన్లను నిర్వీర్యం చేస్తున్నారని ఆమె విమర్శించారు. దశాబ్దాల పోరాట ఫలితంగా సాధించిన చట్టాలను కార్పొరేట్ ప్రయోజనాల కోసం కుదించారన్నారు. ఇఎస్ పిఎఫ్ వంటి సామాజిక భద్రతా పథకాల పరిధిని తగ్గించడంతో కార్మికుల భవిష్యత్తు అంధకారమవుతుందన్నారు.
సదస్సులో ఎఐటియుసి జాతీయ ప్రధాన కార్యదర్శి అమర్జీత్ కౌర్, తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ కె. శ్రీనివాస రెడ్డి, ఐఎఫ్ జాతీయ ఉపాధ్యక్షులు పి. ప్రసాద్, ఎఐటియుసి సీనియర్ నాయకులు బి.వి.విజయలక్ష్మి, సి.ఆర్.ఫౌండేషన్ ప్రధాన కార్యదర్శి పల్లా వెంకట్ రెడ్డి, ఎఐటియుసి అధ్యక్షులు ఎం.డి. యూసుఫ్, ఎఐబిఈఎ జాతీయ కార్యదర్శి రాంబాబు, సి.ఆర్.ఫౌండేషన్ కోశాధికారి చెన్నకేశవరావు పాల్గొనగా నీలం రాజశేఖర్ రెడ్డి రిసెర్చ్ సెంటర్ డైరక్టర్ డాక్టర్ సురేష్ బాబు అధ్యక్షత వహించారు. లేబర్ తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయకుండా రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని సదస్సు ఏకగ్రీవంగా తీర్మానించింది.
సదస్సు అమర్ కౌర్ మాట్లాడుతూ దశాబ్దాల పోరాటాల ఫలితంగా సాధించిన ప్రధాన కార్మిక చట్టాలను రద్దు చేసి,వాటిని కేవలం నాలుగు కోడ్ మార్చడం సంస్కరణ కాదని, ఇది కార్మిక హక్కులపై ప్రత్యక్ష దాడి అని దుయ్యబట్టారు.ఈఎస్ పిఎఫ్ వంటి సామాజిక భద్రతా పథకాల పరిధి తగ్గిపోవడంతో కార్మికుల భవిష్యత్తు ప్రమాదంలో పడుతుందని అమర్ కౌర్ హెచ్చరించారు. గిగ్ వర్కర్లు, ప్లాట్ వర్కర్లకు భద్రత ఉంటుందన్న ప్రభుత్వ హామీలు కేవలం మాటలకే పరిమితమయ్యాయని, చట్టబద్ధమైన హక్కులు మాత్రం లేవని విమర్శించారు. కార్మికులు తమ న్యాయమైన డిమాండ్ కోసం సమ్మె చేసే హక్కును కూడా కొత్త కోడ్ కాలరాస్తున్నాయని, అనేక నిబంధనలు పెట్టి యూనియన్లను నిర్వీర్యం చేస్తున్నారని దుయ్యబట్టారు. ‘ప్రజాస్వామ్య హక్కులు – కార్మిక హక్కులు’ ఒకదానితో మరొకటి ముడిపడి ఉన్నాయని, వీటిని కాపాడుకునేందుకు కార్మిక వర్గం రాజకీయాలకు అతీతంగా ఏకం కావాలని పిలుపునిచ్చారు. పారిశ్రామిక కార్మికులతో పాటు ఐటి, మీడియా, అసంఘటిత రంగాల వారు కూడా ఈ చట్టాల వల్ల నష్టపోతారని, అందుకే అందరూ ఏకమై దేశవ్యాప్త పోరాటాలు సన్నద్ధం కావాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు ఈ కోడ్ అమలు చేయకుండా ఒత్తిడి తీసుకురావాలని సూచించారు.
మీడియా స్వేచ్ఛకు ముప్పు: శ్రీనివాస్ రెడ్డి
తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ కె. శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ గతంలో జర్నలిస్టులకు రక్షణగా ఉన్న ‘వర్కింగ్ జర్నలిస్ట్ యాక్ట్’ను రద్దు చేసి, దానిని ఇతర కార్మిక చట్టాలతో కలిపి ‘ఆక్యుపేషనల్ సేఫ్టీ, హెల్త్ అండ్ వర్కింగ్ కండిషన్స్ కోడ్ చేర్చడం వల్ల జర్నలిస్టుల ప్రత్యేక గుర్తింపు, రక్షణ పోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. వేజ్ బోర్డుల వ్యవస్థ దెబ్బతింటే యాజమాన్యాల దయాదాక్షిణ్యాలపై జర్నలిస్టులు ఆధారపడాల్సి వస్తుందని, ఉద్యోగ భద్రత లేకుండా మీడియా స్వేచ్ఛ నిలబడబోదని ఆయన స్పష్టం చేశారు. జర్నలిస్టులకు ఉద్యోగ భద్రత లేకపోతే, వారు స్వేచ్ఛగా వార్తలు రాయలేరని, ఇది ప్రజాస్వామ్యానికే ముప్పు అని అన్నారు. 1952లో ఏర్పాటు చేసిన విచారణ కమిషన్ సిఫారసుల మేరకు స్వాతంత్య్రం తర్వాత రెండు చట్టాలు ఆమోదించారని, అవి జర్నలిజం ప్రమాణాలను మెరుగుపరచడానికి ఉద్దేశించిబడిందని, 1955లో వర్కింగ్ జర్నలిస్ట్స్ చట్టం, 1958లో మూడు చట్టాలు ఆమోదించి, భారత ప్రెస్ కౌన్సిల్, వార్తా పత్రికల నమోదు, జర్నలిస్టుల వేతన సవరణ కోసం వేతన బోర్డు ఏర్పాటుకు దారితీశాయని తెలిపారు. ఈ రెండు చట్టాలు జర్నలిస్టుల సంక్షేమం, ప్రెస్ స్వేచ్ఛకు కీలకమైనవని, కానీ కొత్త కార్మిక కోడ్ 29 చట్టాలతో పాటు వీటిని కూడా రద్దు చేశారని తెలిపారు. ఈ కొత్త చట్టాలు ప్రధానంగా కార్పొరేట్ సంస్థలకు, యజమానులకు అనుకూలంగా ఉన్నాయని, తద్వారా పని గంటలు పెరగడం, ఉద్యోగ భద్రత తగ్గడం వంటి సమస్యలు ఎదురవుతాయన్నారు. ఈ లేబర్ కోడ్ తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయవద్దని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అన్ని కార్మిక సంఘాలకు విజ్ఞప్తి చేయాలని శ్రీనివాస రెడ్డి సూచించారు.కేవలం పారిశ్రామిక కార్మికులతో పాటు జర్నలిస్టులు, మీడియా రంగంలో పనిచేసే వారు కూడా ఈ చట్టాల వల్ల ప్రభావితమవుతారని, అందరూ ఐక్యంగా పోరాడాలని సూచించారు. కార్మికులు, జర్నలిస్టులు, మేధావులు అందరూ కలిసి ఈ లేబర్ కోడ్లను వ్యతిరేకించాలన్నారు.
యజమానులకు అపరిమిత అధికారాలు – పి. ప్రసాద్
ఐఎఫ్ జాతీయ ఉపాధ్యక్షులు పి.ప్రసాద్ మాట్లాడుతూ 1926లో ఆమోదించిన ట్రేడ్ యూనియన్ల చట్టం కొత్త కోడ్ సమాధి చేయబడుతోందన్నారు. కొత్త కోడ్ పొందుపర్చిన 60 రోజుల ముందస్తు నోటీసు వంటి నిబంధనలు కార్మికుల నిరసన గళాన్ని అణచివేయడమేనని అన్నారు. కొత్త లేబర్ కోడ్ యజమానులకు అపరిమిత అధికారాలను కల్పిస్తూ ‘హైర్ అండ్ ఫైర్’ విధానాన్ని చట్టబద్ధం చేస్తున్నాయని విమర్శించారు. గిగ్ వర్కర్లు, అసంఘటిత రంగ కార్మికులకు సామాజిక భద్రత కల్పిస్తామన్న ప్రకటనలకు స్పష్టమైన నిధులు, అమలు విధానం లేకపోవడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని చెప్పారు. కార్మికులు తమ సమస్యల పరిష్కారానికి ఉపయోగపడే ట్రేడ్ యూనియన్ల ఏర్పాటు, సమ్మె లాంటి ప్రాథమిక హక్కులపై తీవ్రమైన ఆంక్షలు విధించిందని మండిపడ్డారు. యూనియన్లు లేని కార్మిక వర్గం నిస్సహాయంగా మారుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.