Take a fresh look at your lifestyle.

నవోదయ విద్యాలయం ఏర్పాటు అయ్యేదెప్పుడో!

బోథ్, ముద్ర:

ప్రతిభ ఉండి కుటుంబ ఆర్థిక స్థితి సరిగ్గా లేని గ్రామీణ ప్రాంతా విద్యార్థులకు జవహర్ నవోదయ విద్యాలయాలు ఓ వరం. 6 వ తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు నాణ్యమైన విద్యతో పాటు విద్యార్థుల అభిరుచికి అనుగుణంగా క్రీడలు, చిత్ర లేఖనం, సంగీతం, యోగ, కరాటే వంటి అంశాల్లో ఈ విద్యా కేంద్రాల్లో ప్రత్యేక శిక్షణ ఇస్తారు. చిన్నతనం నుండే క్రమశిక్షణ, దేశభక్తి, సేవాభావం అలవాటు పడేలా స్కౌట్స్, ఎన్సీసీ లను నిర్వహిస్తూ విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దుతారు. దేశంలోనే ప్రతిష్ఠాత్మక విద్యా సంస్థలలో ప్రవేశాలు పొందేందుకు నిర్వయించే జేఈఈ, నీట్ పరీక్షలకు సైతం ఇక్కడ అత్యుత్తమ శిక్షణను అందిస్తారు.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు ఉన్నత విద్యా సంస్థల కేటాయింపులో మొండి చేయి
రాష్ట్రంలోనే అత్యంత వెనుకబడిన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను విద్యా కేంద్రాల ఏర్పాటును కేంద్రం విస్మరించింది. 2025 – 26 లలో కొత్తగా ప్రకటించిన 7 ఏడు నవోదయ విద్యా కేంద్రాల్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా లేకపోవడం పట్ల ఈ ప్రాంత విద్యావంతుల్లో తీవ్ర నిరసన వ్యక్తం అవుతుంది. దేశంలోనే అత్యంత ప్రాముఖ్యత కల్గిన చదువుల తల్లి సరస్వతి దేవి ఈ ప్రాంతంలోనే కొలువై ఉన్నప్పటికీ సరైన విద్యా వనరులు లేక జిల్లా వాసులు నాణ్యమైన చదువుల కోసం అష్టకష్టాల మధ్య జిల్లాను దాటి వెళ్తున్నారు. మరికొంతమంది ఆర్థిక భారం, దూరభారం వలన మధ్యలోనే చదువులకు స్వస్తి పలుకుతున్నారు. తెలంగాణలో ఉన్న పాత పది జిల్లాల్లో యూనివర్సిటీ లేని ఏకైక జిల్లాగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నిలిచింది. గిరిజన యూనివర్సిటీ, మైనింగ్ యూనివర్సిటీ లలో ఏదో ఒకటి కచ్చితంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు కేటాయిస్తారని ప్రచారం జరిగింది. సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదిలాబాద్ జిల్లా పర్యటనలో భాగంగా జిల్లా కేంద్రంలో జరిగిన ఓ సభలో త్వరలోనే ఆదిలాబాద్ జిల్లా లో యూనివర్సిటీనీ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. కానీ నేటికి జిల్లాలో యూనివర్సిటీ ఏర్పాటుపై స్పష్టత లేదు. ఇక్కడ ఏర్పాటు చేస్తారనుకున్న గిరిజన యూనివర్సిటీనీ ఉమ్మడి వరంగల్ లో, మైనింగ్ యూనివర్సిటీ నీ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఏర్పాటు చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుండి నలుగురు ఎమ్మెల్యేలు, పార్లమెంట్ ఎన్నికలలో ఎంపీ గా బీజేపీ అభ్యర్థులు గెలిచినప్పటికీ కేంద్ర ప్రభుత్వం విద్యాలయాల ఏర్పాటులో జిల్లాను విస్మరించడంపై అన్ని వర్గాలనుండి సర్వత్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.
ఆదిలాబాద్ జిల్లాలో ఏర్పాటు కల సాకరమయ్యేనా?
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ప్రస్తుతం కాగజ్ నగర్ లో ఏకైక నవోదయ విద్యాలయం కొనసాగుతున్న విషయం తెలిసిందే. జిల్లాలో మరో నవోదయ విద్యాలయ ఏర్పాటు కొరకు ఆదిలాబాద్ జిల్లాలో మొదటగా భీంపూర్ మండలంలో స్థల పరిశీలన జరుపగా అనంతరం గుడిహత్నూర్ మండలం మున్నూరు శివారులో 30 ఎకరాల ప్రభుత్వ భూమిని జవహర్ నవోదయ విద్యాలయ భవన నిర్మాణానికి కేటాయిస్తూ పాఠశాల విద్యా కార్యదర్శికి గత ఏడాది జిల్లా కలెక్టర్ లేఖను సైతం రాసారు. మున్నూరు గ్రామం జాతీయ రహదారి (NH-44) కి మూడు కిలో మీటర్ల దూరంలో ఉండటం, అవసరమైన భూమి ఒకే చోట లభించడం, భవిష్యత్తులో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, ఇతర సిబ్బంది రాకపోకలకు అనువుగా ఉంటుందని ఈ ప్రాంతాన్ని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఇకైనైన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక చొరవ చూపి జిల్లాలో నవోదయ విద్యాలయం త్వరితగతిన ఏర్పాటు చేసి ఈ ప్రాంత విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందుబాటులోకి తేవాలని ఈ ప్రాంత వాసులు కోరుతున్నారు.

Leave A Reply

Your email address will not be published.