బోథ్, ముద్ర:
ఆదిలాబాద్ లో సీసీఐ ని తిరిగి ప్రారంభించాలని తెలంగాణ అధ్యయన సమాలోచన కేంద్రం ( టాస్క్) డిమాండ్ చేసింది. గురువారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో వారు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా టాస్క్ రాష్ట్ర అధ్యక్షుడు డా. ఎర్రోజు శ్రీనివాస్ మాట్లాడుతూ తెలంగాణలోని అత్యంత వెనుకబడిన, గిరిజన ప్రాంతమైన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పారిశ్రామిక రంగానికి గుండెకాయ లాంటి ‘సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా’ (సిసిఐ) యూనిట్‌ను తుక్కు (స్క్రాప్) కింద అమ్మేయాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తీవ్ర దిగ్భ్రాంతిని కలిగిస్తోందని అన్నారు. సుమారు 50 కోట్ల స్వల్ప విలువగల యంత్ర సామగ్రి వేలానికి కేంద్ర భారీ పరిశ్రమల శాఖ టెండర్లు పిలవడం అంటే ఈ ప్రాంత ఆర్థిక, సామాజిక భవిష్యత్తును శాశ్వతంగా సమాధి చేయడమేనని అన్నారు. ఎన్నికలొచ్చినప్పుడల్లా ‘సిసిఐ పునరుద్ధరణ’ను ప్రధాన అస్త్రంగా వాడుకుని ఓట్లు దండుకున్న రాజకీయ శక్తులు, నేడు చేతులెత్తేయడం క్షమించరాని నేరమని, అపారమైన సహజవనరుల లభ్యతను, పారిశ్రామిక సంపద అభివృద్ధికి గల అవకాశాలను గాలికి వదిలేసి, వేలాది కుటుంబాల ఉపాధి ఆశలను కేవలం ఇనుప ముక్కల ధరతో(తుక్కు) తూచడం పాలకుల సంకుచిత ఆర్థిక విధానాలకు నిదర్శనమని ఎద్దేవా చేశారు.
విశాఖ ఉక్కుకు నిధుల ఊపిరిపోసి నిలబెట్టిన కేంద్ర పెద్దలకు, ఆదిలాబాద్ సిసిఐ ప్లాంట్ విషయంలో మాత్రం కేవలం 50 కోట్ల స్క్రాప్ విలువ ఎందుకు కనిపిస్తోందో సమాధానం చెప్పాలన్నారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్‌ను ఆదుకున్నట్లే.. అదే తరహా చిత్తశుద్ధితో ఆదిలాబాద్ సిసిఐ ప్లాంట్‌కు కూడా ప్యాకేజీ ప్రకటించాలనీ డిమాండ్ చేశారు. కేవలం 2,000 కోట్ల పెట్టుబడి పెడితే మళ్లీ బతికే అపార ఖనిజ సంపద కలిగిన ప్లాంట్‌ను తెగనమ్మడం తెలంగాణ పట్ల కేంద్రానికి ఉన్న వివక్షకు పరాకాష్ట అని అన్నారు. వెనుకబడిన ప్రాంతాన్ని ఆదుకునేందుకు 2,000 కోట్ల పెట్టుబడి పెట్టడం పెద్ద భారం ఏమీ కాదని, లాభనష్టాల బేరీజుతోనే ప్రభుత్వాలు నడవాలనుకుంటే, ప్రజల సంక్షేమానికి అర్థమే లేకుండా పోతుందన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంలో కేంద్రంపై ఒత్తిడి పెంచాలంటే కేవలం లేఖలకే పరిమితం కాకూడదనీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిశ్రమల మంత్రి శ్రీధర్ బాబులు చిత్తశుద్ధితో పూర్తి స్థాయిలో పోరాడి ఈ తుక్కు టెండర్లను తక్షణమే నిలిపివేయించాలనీ కోరారు. కేంద్రం ఒకవేళ వెనక్కి తగ్గని పక్షంలో, రాష్ట్ర ప్రభుత్వమే రంగంలోకి దిగాలి. పరిశ్రమను పునఃప్రారంభించే ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాలన్నారు. విశాఖ ఉక్కు తరహాలోనే ఆదిలాబాద్ సిసిఐకి కూడా ఆర్థిక ప్యాకేజీ ప్రకటించి పునరుద్ధరించాలి. తద్వారా వెనుకబడిన ఆదిలాబాద్ జిల్లా యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెంచి తెలంగాణకు న్యాయం చేయాలనీ లేనిపక్షంలో ఉపాధి కోల్పోయిన అడవి బిడ్డలు మరోసారి తీవ్రమైన ఉద్యమానికి సిద్దమౌతున్నారు.
ఈ కార్యక్రమంలో టాస్క్ కో కన్వీనర్
రవీందర్, ప్రకాష్, గోడం గణేష్,
రంగన్న, శ్రీనివాస్, విలాస్, వెంకట్ నారాయణ, విజగిరి నారాయణ,
సిర్ర దేవేందర్,ఎడ్ల ఆశన్న
నరాల రమణయ్య
తుడుందెబ్బ నాయకులు వెట్టి మనోజ్, అర్క శేషారావు, సలాం అరుణ్, ఆత్రం గణపతి, తొడసం ప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు.