ఆయిల్ ఫామ్ రైతులకు ఉగాది కానుక
నర్మెటలో ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ
ఈ నెల 22న 70లక్షల మంది రైతుల ఖాతాల్లో రైతు భరోసా
మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
ముద్ర, తెలంగాణ బ్యూరో :
ఉగాది కానుకగా రేపు సిద్ధిపేట జిల్లా నర్మెటలో ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీని సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించబోతున్నట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. ఈ ఫ్యాక్టరీని యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేశామని చెప్పారు. నర్మటలో 3 రోజుల పాటు వ్యవసాయ ప్రదర్శన కూడా నిర్వహిస్తున్నట్లు వివరించారు. ఈ ప్రదర్శనకు మంత్రులు, ప్రజా ప్రతినిధులందరి నీ ఆహ్వానించామని చెప్పారు. బుధవారం అసెంబ్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా రైతు భరోసాపై కీలక ప్రకటన చేశారు. ఈనెల 22న రైతు భరోసా నిధులను సీఎం విడుదల చేస్తారని వెల్లడించారు. 22న 70 లక్షల మంది రైతుల ఖాతాల్లో రైతుభరోసా నిధులు జమ చేయబోతున్నామని తెలిపారు. ఎన్ని ఆర్థిక సమస్యలు ఉన్నప్పటికీ రైతు సంక్షేమ కార్యక్రమాలు ఆగవద్దని సీఎం చెప్పినట్లు తెలిపారు. ఈ ప్రభుత్వానికి రైతాంగమే ప్రాధాన్యత అని చెప్పారు. ఎన్నికల్లో రాహుల్ గాంధీ హామీ ఇచ్చినట్లు రుణమాఫీ చేస్తామని చెప్పినట్లు చేసి చూపించామన్నారు. మొక్క జొన్న కొనుగోళ్లపై ధర్నాలు చేయడం తేలికైన పని కానీ ధర్నాలు చేస్తున్నవారే కేంద్రంలో ఉన్నారని వారు కొనుగోలు చేయడం లేదన్నారు. కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయకపోయినా తెలంగాణ ప్రభుత్వం మొక్కజొన్న కొనుగోళ్లను బుధవారం నుంచి ప్రారంభించిందని చెప్పారు.