ఫోర్ వీలర్ ఉన్నా.. ఇల్లు ఇవ్వండి ఇప్పుడున్న నిబంధనలు మార్చి అర్హులుగా గుర్తించండి ప్రభుత్వానికి మండలి ఛైర్మన్ గుత్తా సూచనలు
ముద్ర, తెలంగాణ బ్యూరో :
నాలుగు చక్రాల వాహనాలు ఉన్న వారిని ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారుల నుంచి అనర్హులుగా ప్రకటించడం సరికాదని శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి పేర్కొన్నారు. నిబంధనలు మార్చేసి.. ఫోర్ వీలర్ వాహనం ఉన్న వారికి కూడా ఇందిరమ్మ ఇళ్లను కేటాయించాలని సూచించారు. రెండో విడత నుంచైనా నిబంధనలను మార్చుతారని ఆశిస్తున్నట్లు తెలిపారు. బుధవారం మండలిలో ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు గుత్తా సమాధానం ఇచ్చారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి ఈ కీలక సూచన చేశారు. ఇందిరమ్మ ఇళ్లను.. ఫోర్ వీలర్ ఉన్నవారికి కూడా కేటాయించాలని పేర్కొన్నారు. కాంగ్రెస్ సర్కార్.. రాష్ట్రంలోని నిరుపేదలకు గూడు కల్పించాలని ప్రతిష్ఠాత్మకంగా ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని చేపట్టిందని.. అది నిజమైన అర్హులకు అందాలని తెలిపారు. ఫోర్ వీలర్ వాహనాలు ఉన్న వారిని ఇందిరమ్మ ఇండ్ల పథకానికి అనర్హులుగా ప్రకటించారని తెలిపారు.. అయితే జీవనోపాధి కోసం లోన్లు తీసుకుని ఈఎమ్ఐలు చెల్లిస్తూ.. క్యాబ్‌లు, టాటా ఏస్ వంటి గూడ్స్ వాహనాలను నడుపుతూ బతుకుతున్నారని.. అలాంటి వాళ్లలో ఇళ్లు లేని వారు కూడా చాలా మంది ఉన్నారని మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వానికి కీలక సూచన చేశారు.ఇలాంటి గూడ్స్ వాహనాలు కలిగిన వారికి ఇప్పటికే ఇందిరమ్మ ఇళ్లు మంజూరై బేస్‍మెంట్ల వరకు నిర్మాణాలు చేపట్టారని.. అలాంటి వారికి ప్రభుత్వం అనుమతి ఇవ్వడం లేదని మండలి ఛైర్మన్ పేర్కొన్నారు. సగం వరకు ఇళ్లు నిర్మించిన తర్వాత.. వారికి ఇప్పుడు ఏమి తోచట్లేదని తెలిపారు. అందుకే ఈ ఇందిరమ్మ ఇళ్ల పథకం నిబంధనల్లో కచ్చితంగా మార్పులు చేయాలని పేర్కొన్నారు. ఇప్పటివరకు జరిగిన తొలి విడత పక్కన పెడితే.. ఈ రెండో విడతలోనైనా ఎల్-2, ఎల్-3 జాబితాలో ఉన్న వారిని ఎల్-1లోకి తీసుకువచ్చేలా ఏర్పాట్లు చేయాలని సూచించారు.