గోపాల్రావుపేట , ముద్ర : కరీంనగర్ జిల్లా రామడుగు మండలం, గోపాల్రావుపేటలో శ్రీ శ్రీ శ్రీ హరిమౌనస్వామి (రోటీగూడెం) దివ్య సాన్నిధ్యంలో శ్రీ వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు,సప్తమ విశంతి వార్షికోత్సవ గీతాహవన యజ్ఞం అత్యంత భక్తిశ్రద్ధలతో, కన్నుల పండువగా కొనసాగుతున్నాయి. 14 ఏళ్ల కుంభమేళా సందర్భాన్ని పురస్కరించుకుని చేపట్టిన ఈ ఆధ్యాత్మిక వేడుకల్లో భాగంగా, 108 అష్టోత్తర శతకుండలముల గీతాహవన యజ్ఞం నిర్వహించడం విశేషం.
కళ్యాణ మహోత్సవం: మార్చి 5వ తేదీ గురువారం, మధ్యాహ్నం 12:55 గంటలకు హస్తా నక్షత్ర, కన్యా లగ్న సుముహూర్తంలో శ్రీ అలువేలుమంగ పద్మావతి సహిత శ్రీ వేంకటేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. అంతకుముందు ఉదయం 1000 మంది స్త్రీ మూర్తులతో నిర్వహించిన కుంకుమ పూజ కార్యక్రమం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది.
మార్చి 1వ తేదీ నుండి ప్రారంభమైన ఈ ఉత్సవాల్లో ప్రతిరోజూ సుప్రభాత సేవ, పంచామృత అభిషేకం, సామూహిక శ్రీవిష్ణు సహస్ర నామ పారాయణం, మరియు ద్రావిడ ప్రబంధ పారాయణాలు భక్తిపూర్వకంగా నిర్వహించారు. మార్చి 6వ తేదీన 108 సహస్ర కలశాల అభిషేకం, పూర్ణాహుతి, సప్త తిరుమంజనం, చక్రస్నానం మరియు 18 కుండలముల గీతాహవన యజ్ఞం జరిగాయి. సాయంత్రం స్వామివారికి నాగవెల్లి, ఏకాంత సేవ నిర్వహించారు.
ఈ ఆధ్యాత్మిక మహోత్సవాల్లో భాగంగా, రేపు (మార్చి 7, శనివారం) ఉదయం 9:00 గంటలకు స్వామివారి రథోత్సవం నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు చుట్టుపక్కల గ్రామాల నుండి భక్తులు భారీగా తరలివస్తున్నారు.