Take a fresh look at your lifestyle.

ప్రజలకు ఇచ్చిన హామీల అమలుకు జవాబుదారీతనంతో పని చేయాలి: మంత్రి శ్రీధర్ బాబు

ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చేందుకు జవాబుదారీతనంతో పనుచేస్తున్నాం

99 రోజుల ప్రజా పాలన్- ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు అందని వారిని గుర్తించి లబ్ది చేకూర్చుతాం

ఈ దిశగా పటిష్ఠమైన కార్యాచరణతో ప్రజా సమస్యలను పరిష్కరించాలి

ఉమ్మడి రంగారెడ్డి జిల్లా అధికారులకు రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖా మంత్రి డి.శ్రీధర్ బాబు దిశానిర్దేశం

సమావేశంలో పాల్గొని అధికారులకు సూచనలిచ్చిన అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్

(ముద్ర, ఉమ్మడిరంగారెడ్డి జిల్లా ప్రతినిధి): ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే క్రమంలో జవాబుదారీ తనంతో ప్రభుత్వం పని చేస్తుందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ, రంగారెడ్డి జిల్లా ఇంచార్జ్ మంత్రి డి.శ్రీధర్ బాబు అన్నారు. శుక్రవారం రంగారెడ్డి కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు సంబంధించిన వివిధ శాఖల అధికారులకు ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమం పై అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది.
ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. 99 రోజుల పాటు చేపడుతున్న ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో ప్రభుత్వ సంక్షేమ అందని వారిని గుర్తించాలని సూచించారు. వీరిపై నిర్లక్షం వహించకుండా ప్రభుత్వ పరంగా అమలు కాని అంశాలపై ప్రత్యేక దృష్టి సారించి అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. రాష్ట ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ప్రజా పాలన – ప్రగతి ప్రణాళికలో ప్రజల సమస్యలను పరిష్కరించే దిశగా పని చేయాలని శ్రీధర్ బాబు దిశానిర్దేశం చేశారు.

అధికారులు సమిష్టిగా లక్ష్యం దిశగా పనిచేయాలి : అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్

ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక ఎంతగానో ఉపయోగపడుతుందని అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు. ఈ కార్యక్రమం ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి, అధికారులకు మంచి పేరు వస్తుందని చెప్పారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో లక్ష్యం దిశగా పని చేయాలని సూచించారు.
ప్రజా ప్రతినిధులు, అధికారులు జవాబుదారి తనంతో పని చేస్తే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక 90 రోజుల కార్యక్రమం విజయవంతం అవుతుందని స్పీకర్ ప్రసాద్ కుమార్ ఆకాంక్షించారు. శాసనమండలి చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి మాట్లాడుతూ 99 రోజుల పాటు చేపట్టే ప్రజా పాలన – ప్రగతి ప్రణాళికలో 10 అంశాలకు సంబంధించిన సమస్యలను పరిష్కరించేందుకుప్రజల వద్దకే అధికారులు వస్తున్నారన్నారు. ఇప్పటికీ రేషన్ కార్డులు, ఇల్లు లేని నిరుపేదలందరికీ ఇండ్లను కేటాయించేందుకు అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని మహేందర్ రెడ్డి సూచించారు.

ప్రభుత్వ 6 హామీల అమలుకు చర్యలు: కలెక్టర్ నారాయణరెడ్డి

రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన 6 హామీలను నెరవేర్చే దిశగా పని చేస్తామని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి పేర్కొన్నారు. జిల్లాలోని 8 నియోజకవర్గాలకు నోడల్ అధికారులను నియమించామన్నారు. ఎప్పటికప్పుడు జిల్లా స్థాయిలో అధికారులను సమన్వయం చేసుకోవడం జరుగుతుందని తెలిపారు. అన్ని ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పనిచేస్తూ ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు.ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలకు సంబంధించి ఎప్పటికప్పుడు చెల్లింపులు అయ్యే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. గ్రామ పంచాయతీల్లో నీటి కొరత లేకుండా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ నారాయణరెడ్డి తెలిపారు.
ఈ సమావేశంలో శాసన సభ్యులు టి.రామ్మోహన్ రెడ్డి, బి.మనోహర్ రెడ్డి, టి.ప్రకాష్ గౌడ్, కాలే యాదయ్య, వీర్లపల్లి శంకరయ్య, రాష్ట్ర వ్యవసాయ కమిషన్ చైర్మన్ ఎం. కోదండ రెడ్డిలతో పాటు వివిధ కార్పోరేషన్ల చైర్మన్లు, ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు, మేడ్చెల్ జిల్లా కలెక్టర్ మను చౌదరి, వికారాబాద్ జిల్లా కలెక్టర్ దీపక్ తివారి, మల్కాజిగిరి, సైబరాబాద్ మున్సిపల్ కమిషనర్, ఉమ్మడి జిల్లా వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజా పాలన – ప్రగతి నివేదిక ప్రత్యేక కార్యక్రమం ప్రధాన అంశాలపై చర్చించి అధికారులకు అవగాహన కల్పించడం జరిగింది.

Leave A Reply

Your email address will not be published.