Take a fresh look at your lifestyle.

కరీంనగర్‌లో ఫీజు రీయంబర్స్మెంట్ బకాయిలపై విద్యార్థి సంఘాల ఆందోళన

 

ముద్ర, కరీంనగర్:

రాష్ట్ర ప్రభుత్వం సుమారు రూ.8 వేల కోట్ల ఫీజు రీయంబర్స్మెంట్ బకాయిలను చెల్లించకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని బిఆర్ఎస్వి నాయకులు ఆరోపించారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని వెంటనే బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ కరీంనగర్ జిల్లా కలెక్టర్‌కు వినతి పత్రం సమర్పించారు.

ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన కరీంనగర్ మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్, బిఆర్ఎస్వి జిల్లా కోఆర్డినేటర్ పొన్నం అనిల్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ, తెలంగాణలో ప్రస్తుత ప్రభుత్వం విద్యా వ్యవస్థను నిర్లక్ష్యం చేస్తోందని విమర్శించారు. ఇప్పటివరకు పూర్తి స్థాయి విద్యాశాఖ మంత్రి లేకపోవడం వల్ల విద్యా రంగంలో సమీక్షలు జరగడం లేదని, విద్యార్థులు ఈ ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారని అన్నారు.

ఫీజు రీయంబర్స్మెంట్ బకాయిల చెల్లింపుపై వినతి పత్రంతో ప్రారంభమైన బిఆర్ఎస్వి ఉద్యమం, బకాయిలు పూర్తిగా విడుదల అయ్యే వరకు కొనసాగుతుందని స్పష్టం చేశారు. రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రి నివాసాన్ని ముట్టడించే కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో జిల్లా కోఆర్డినేటర్ ధ్యావ మధుసూదన్ రెడ్డి, శాతవాహన యూనివర్సిటీ ఇంచార్జ్ చుక్క శ్రీనివాస్, నగర అధ్యక్షుడు బొంకురి మోహన్, ఎస్ఆర్ఆర్ కళాశాల అధ్యక్షుడు నాయిని అన్వేష్, సీనియర్ నాయకులు అరె రవి గౌడ్, గంగాధర చందు, వడ్లకొండ పరుశరాములు, శ్రీకాంత్, విక్రమ్, ఓంకార్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.