ఎక్స్ అఫీషియో సభ్యులకు ‘ఓటు’ మెలిక
ఆ పట్టణంలో ఓటు హక్కు ఉంటేనే ఓటు చెల్లుబాటు
తమకు నచ్చిన మున్సిపాలిటీని ఎంచుకునే సంస్కృతికి ఈసీ స్వస్తి
హైకోర్టు ఆదేశాలతో కీలక నిర్ణయం
అనేక చోట్ల మున్సిపల్ పీఠాల సమీకరణాలు మారే అవకాశం
మేయర్, మున్సిపల్ చైర్మన్ల ఎన్నికకు నోటిఫికేషన్ రిలీజ్
ముద్ర, తెలంగాణ బ్యూరో :
మున్సిపాలిటీ, కార్పొరేషన్‌లో ఎక్స్ అఫీషియో సభ్యులుగా ఓటు వేయాలంటే.. సదరు ప్రజాప్రతినిది కచ్చితంగా ఆ పురపాలిక పరిధిలో ఓటరు అయి ఉండాల్సిందేనని రాష్ట్ర ఎన్నికల సంఘం తేల్చి చెప్పింది. ఈనెల 16న కార్పొరేషన్లలో మేయర్లు, డిప్యూటీ మేయర్లు, మున్సిపాలిటీల్లో ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ఎన్నిక జరగనున్న ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం శనివారం మార్గదర్శకాలు జారీ చేసింది. మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో హంగ్ ఏర్పడిన పురపాలికల్లో మేయర్, ఛైర్మన్ ఎన్నికల్లో అత్యంత కీలకమైన ఎక్స్ అఫీషియో సభ్యుల ఓటు హక్కుపై మార్గదర్శకాలను విడుదల చేసింది. ఎంపీలు, ఎమ్మెల్సీలు ఎక్స్ అఫీషియో సభ్యుడిగా ఓటు వేయాలంటే ఆ మున్సిపాలిటీలోని ఓటర్ జాబితాలో వారి పేరు ఉండాలని ఈసీ స్పష్టం చేసింది. ఒకవేళ మున్సిపల్ పరిధిలో ఓటరుగా నమోదు కాకపోతే.. వారు ఎక్స్ అఫీషియో సభ్యులుగా ఓటేయటానికి, కొనసాగడానికి అనర్హులని తేల్చి చెప్పింది. నిబంధనలకు విరుద్ధంగా అర్హత లేకుండా ఓట్లు వేస్తే అవి చెల్లవని స్పష్టం చేసింది. ఈ మేరకు రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎన్నికల అధికారులకు రాష్ట్ర ఎన్నికల సంఘం సర్క్యూలర్ జారీ చేసింది. గతంలో రాజ్యసభ ఎంపీలు, ఎమ్మెల్సీలు రాష్ట్రంలోని తమకు నచ్చిన మున్సిపాలిటీని ఎంచుకుని ఎక్స్ అఫీషియో సభ్యులుగా మేయర్, ఛైర్మన్ ఎన్నిక కోసం ఓటు వేసే అవకాశం ఉండేది. ఆ సమయంలో ఈ అంశంపై వివాదం కొనసాగింది. దీన్ని విచారించిన రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం.. స్థానికంగా ఓటు లేకుండా ఇతర మున్సిపాలిటీల్లో ఓటు వేయటం నిబంధనలకు విరుద్ధమని వెల్లడించింది. హైకోర్టు ఆదేశాల నేపథ్యంలోనే తాజాగా ఎస్‌ఈసీ నిర్ణయం తీసుకుంది. ఇదీలావుంటే.. హంగ్ ఏర్పడిన మున్సిపాలిటీల్లో ఎక్స్ అఫీషియో ఓట్లు కీలకంగా మారాయి. ఎస్‌ఈసీ కొత్త నిబంధనలతో.. స్థానికంగా ఓటు లేని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు తమ ఓటును వినియోగించుకోలేని పరిస్థితి నెలకొన్నది. దీంతో అనేక చోట్ల మున్సిపల్ పీఠాల సమీకరణాలు మారే అవకాశాలున్నాయి. మరోవైపు మేయర్, మున్సిపల్ చైర్మన్ల ఎన్నికకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారికంగా నోటిఫికేషన్ విడుదల చేసింది ఎస్ఈసీ. ఈనెల 16న ఆయా మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో మధ్యాహ్నం 12.30కి ప్రత్యేక సమావేశం నిర్వహించి తొలుత వార్డు సభ్యులు, కార్పొరేటర్లతో ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. ఆ తర్వాత మేయర్, డిప్యూటీ మేయర్లు, చైర్మన్లు, వైస్ చైర్మన్ల ఎన్నిక జరగనుంది.