Take a fresh look at your lifestyle.

ప్రధాన పార్టీలకు సినిమా చూపిస్తాం-మీడియాతో జాగృతి అధ్యక్షురాలు కవిత

మున్సిపల్ ఎన్నికల్లో ట్రైలరే చూపించాం
బీఆర్ఎస్, బీజేపీ పొత్తుకు మున్సిపల్ ఎన్నికలు తొలిమెట్టు
కాంగ్రెస్ తప్పులను ఎత్తిచూపడంలో బీఆర్ఎస్ అట్టర్ ఫ్లాప్
పుర ఫలితాలను బీఆర్ఎస్ సమీక్షించుకోవాలి
90 నుంచి 16 స్ధానాలకు పడిపోవడం దారుణం
సీపీఐ అడగకుండానే బీఆర్ఎస్ మద్దతు ప్రకటించడమేంటీ..?
కరీంనగర్ కార్పొరేషన్ తప్ప అన్ని చోట్లా బీజేపీ అష్టకష్టాలు
మీడియాతో జాగృతి అధ్యక్షురాలు కవిత

ముద్ర, తెలంగాణ బ్యూరో :

రానున్న రోజులు.. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలోని ప్రధాన పార్టీలకు సినిమా చూపిస్తామని జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సవాల్ చేశారు. ఈ నెల 11న విడుదలైన మున్సిపల్ ఎన్నికల్లో ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీకి మద్దతు తెలిపి ఊహించని ఫలితాలతో ట్రైలర్ మాత్రమే చూపించామని చెప్పారు. పుర ఎన్నికల్లో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్, జాగృతికి చెందిన 40 మంది అభ్యర్థులను ప్రజలు గెలిపించారన్న ఆమె… తమ లాంటి కొత్త తరహా రాజకీయాల చేసే వారిని ప్రజలు ఆదరించేందుకు సిద్ధంగా ఉన్నారని వెల్లడించారు, శనివారం హైదరాబాద్ లోని జూబ్లీహీల్స్ లోని జాగృతి ప్రధాన కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. ప్రజలకిచ్చిన హామీలను కాంగ్రెస్ ఎక్కడ కూడా నిలబెట్టుకోకుండానే మున్సిపల్ ఎన్నికల్లో ఎక్కువ స్థానాలు గెలుచుకోవడం ఆశ్చర్యానికి గురి చేసిందన్నారు. ఎన్నికల ప్రచారంలో ప్రజలు మాకు గుడి కట్టారంటూ చెప్పుకున్న బీఆర్ఎస్… చాలా చోట్ల మూడు, నాలుగు స్థానాలకు పడిపోయిందని చెప్పారు. ఇటు తెలంగాణకు రూపాయి ఇవ్వని బీజేపీ కరీంనగర్ మేయర్ స్థానం తప్ప అన్ని చోట్ల అష్టకష్టాలు పడిందని వ్యాఖ్యానించారు. తాము పార్టీ పెడతామని ప్రకటించగానే బీఆర్ఎస్ నేతలు కారు కూతలు కూస్తున్నారని కవిత ఆరోపించారు. కాంగ్రెస్ తప్పులను ఎత్తిచూపడంలో బీఆర్ఎస్ అట్టర్ ఫ్లాప్ అయ్యిందని విమర్శించారు. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికలు బీఆర్ఎస్, బీజేపీ పొత్తుకు తొలిమెట్టు అన్నారు. ఈ ఎన్నికల్లో ఆయా పార్టీలు రహస్య ఒప్పందంతో పోటీ చేశాయని ఆరోపించారు. కాంగ్రెస్ అపొజిషన్ లో ఉన్నప్పుడు వచ్చిన ఫలితాలతో బీఆర్ఎస్ ఈ ఎన్నికల ఫలితాలను పోల్చుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. గతంలో 90 శాతం మున్సిపాలిటీల్లో గెలిస్తే ఇప్పుడు 16 స్థానాలకే పరిమితం అయిన విషయాన్ని గ్రహించాలని సూచించారు. రాష్ట్రంలో ప్రజల ప్రేమను ఎందుకు కోల్పోయారో సమీక్షించుకోవాలని బీఆర్ఎస్ నాయకులకు సూచించారు. కొత్తగూడెం కార్సొరేషన్ మేయర్ ఎన్నిక విషయంలో సీపీఐ అడగకుండానే బీఆర్ఎస్ మద్దతు ప్రకటించడం దారుణమన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ విషయంలో ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి సాంబశివరావు కేసీఆర్ పై చేసిన ఆరోపణలను ఆమోదిస్తున్నారా? అని బీఆర్ఎస్ నేతలను ప్రశ్నించారు. అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ తో మిలాఖత్ అయిన సీపీఐ కి మద్దతివ్వటమంటే నయవంచనే అన్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ అప్రమత్తంగా లేకపోవడంతోనే ప్రజలు కాంగ్రెస్ కు ఓటు వేశారని ఆరోపించారు. ఉద్యమకారులను మంచి చేయాలని మాట్లాడిన తన గురించి ఇష్టమొచ్చినట్లు గా మాట్లాడుతున్నారని కవిత ఆరోపించారు. ఈ అహంకారం తగ్గించుకొని ప్రజల మధ్యలో ఉండకపోతే ఇలాంటి ఫలితాలే వస్తాయని చురకలంటించారు. మరో పదిన్నరేళ్లు నేనే ముఖ్యమంత్రిగా ఉంటా నాకు ఆరు నెలలు బోనస్ కూడా వస్తది అని చెప్పుకుంటున్న రేవంత్ రెడ్డి… ముందు రైతులకు ఇచ్చే బోనస్ గురించి మాట్లాడాలని కవిత డిమాండ్ చేశారు. ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసేలా కేంద్రం వచ్చే బడ్జెట్ లో నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు.

న్యూ ప్లేయర్ ను ప్రజలు ఆదరించారు.
తాము త్వరలోనే రాజకీయ పార్టీగా మారబోతున్నామని చెప్పి ఎన్నికల్లో పోటీ చేశామన్న కవిత… సమయం తక్కువగా ఉన్నప్పటికీ కార్యకర్తల ఒత్తిడి మేరకు ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ తో కలిసి పోటీ చేసినట్లు వివరించారు. అయినా ప్రజలు తమను 40 స్థానాల్లో గెలిపించారని చెప్పారు. అధికారికంగా 33 స్థానాలు అయినప్పటికీ కొంతమందికి భీ ఫామ్ ఇవ్వటంలో ఇబ్బంది అయ్యిందనీ అలా మరో ఏడు స్థానాల్లో తాము మద్దతు తెలిపిన అభ్యర్థులే గెలిచారన్నారు. జోగులాంబ గద్వాల జిల్లా వడ్డెపల్లి మున్సిపాలిటీలో తమకు క్లియర్ మాన్ డేట్ ను ప్రజలు కట్టబెట్టారని చెప్పారు. కానీ కాంగ్రెస్ నేతలు తమ ప్రలోభాలతో వారిని లాక్కునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఛైర్మన్ ఎన్నిక వరకు ఏమీ జరుగుతుందో తెలియని పరిస్థితి ఉందన్నారు. అందుకే దాని గురించి మాట్లాడటం లేదని వ్యాఖ్యానించారు. అలాగే నారాయణ్ పేట మున్పిపాలిటీలోనూ తమకు వైస్ ఛైర్మన్ పదవి ఆఫర్ చేస్తున్నట్లు కవిత వెల్లడించారు. దీనిపై నిర్ణయం స్ధానిక నాయకులకే అప్పగించామని చెప్పారు.

Leave A Reply

Your email address will not be published.