Take a fresh look at your lifestyle.

జిల్లా ప్రజల, రైతుల సంక్షేమం కోసం 1000కోట్ల ఖర్చు సిద్దిపేట జిల్లా కలెక్టర్ హైమావతి

 

ముద్ర ప్రతినిధి, సిద్దిపేట :

రాష్ట్ర ప్రభుత్వం జిల్లా ప్రజల రైతుల అభివృద్ధి, సంక్షేమం కోసం 6 గ్యారంటీల అమలు కోసం 1000 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేసిందని జిల్లా కలెక్టర్ కే.హైమావతి తెలిపారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా గురువారం జిల్లావ్యాప్తంగా అన్ని మండలాలలో మండల స్థాయి సభ నిర్వహించారు. అందులో భాగంగా కొమరవెల్లి మండల కేంద్రంలోని రైతు వేదికలో నిర్వహించిన కొమరవెల్లి మండల స్థాయి సభలో జిల్లా కలెక్టర్ కే.హైమావతి ముఖ్యఅతిథిగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా సంబంధిత శాఖల మండల అధికారులు ఆయా శాఖల ద్వారా చేపట్టిన ప్రజా అభివృద్ధి మరియు సంక్షేమ కార్యక్రమాల వివరాలు వివరించారు.


ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలను ప్రభుత్వ కార్యక్రమాల్లో భాగస్వాములను చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు 99 రోజులపాటు ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యాచరణ కార్యక్రమాన్ని అమలు చేయడం జరుగుతుందని దానిలో భాగంగా ఈ నెల 2వ తేదీన జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామ పంచాయతీలలో గ్రామసభలు నిర్వహించామన్నారు. జిల్లాలోని అన్ని మండల కేంద్రాల్లో మండల స్థాయి సభను నిర్వహిస్తున్నామని అన్నారు. మే మాసంలో నియోజకవర్గ స్థాయి జిల్లాస్థాయి సమావేశం నిర్వహిస్తామని అన్నారు. 99 రోజుల కార్యచరణలో భాగంగా ప్రతివారం ఒక డిపార్ట్మెంట్ థీమ్ ను తీసుకొని జూన్ 11వ తేదీ వరకు నిర్వహిస్తున్నామని మొదటివారం ప్రభుత్వ కార్యాలయాలలో పెండింగ్ ఫైళ్ క్లియరెన్స్, పరిశుభ్రత కార్యక్రమాన్ని నిర్వహించామని, తర్వాత హెల్త్ వీక్, ఇప్పుడు అరైవ్ అలైవ్ కార్యక్రమం ద్వారా రోడ్డు ప్రమాదాల నివారణ కోసం రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. ప్రజల సురక్షిత ప్రయాణం కోసం వాహనదారులు తప్పకుండా రహదారి భద్రత నియమాలు పాటించాలని సూచించారు. సంక్షేమ కార్యక్రమాలు, డ్రగ్స్ నియంత్రన, రైతు సంక్షేమం, విద్యా కార్యక్రమాలు, క్రీడలు యువజన సంక్షేమం, మహిళా సంక్షేమం, పర్యావరణ పరిరక్షణ అంశాలపై నిర్ణీత ప్రణాళిక ప్రకారం 99 రోజులలో నిర్వహిస్తామని తెలిపారు. రైతులు పంట మార్పిడి విధానం, సేంద్రియ వ్యవసాయం చేసి పాటించి అధిక దిగుబడిని సాధించడంతోపాటు భూమి సారం పెరిగేలా చూడాలని అన్నారు. జిల్లాలో కొత్తగా 25 వేల రేషన్ కార్డులను మంజూరు చేయడంతో పాత రేషన్ కార్డులలో 37 వేల మంది సభ్యులను చేర్చి ప్రతినెల 6580 మెట్రిక్ టన్నుల సన్న బియ్యం రేషన్ కార్డుల ద్వారా ఉచితంగా పంపిణీ చేస్తున్నామని, జిల్లాలో 11241 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయగా 9954 ఇండ్ల గ్రౌండింగ్ జరిగిందని 204 కోట్ల రూపాయల బిల్లులను చెల్లించడం జరిగిందని కొత్తగా ప్రతి నియోజకవర్గానికి మరొక 3500 ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేయడం జరుగుతుందని తెలిపారు. గ్యాస్ సబ్సిడీ కోసం 22 కోట్ల 83 లక్షల రూపాయలు సబ్జరీ అందించడం జరిగిందని, గృహజ్యోతి పథకం ద్వారా 200 యూనిట్ల వరకు వినియోగించుకున్న లబ్ధిదారులకు 152 కోట్ల రూపాయల విలువైన ఉచిత విద్యుత్ అందించడం జరిగిందనీ, రైతు భరోసా పథకం ద్వారా మూడు లక్షల పదకొండు వేల మంది రైతుల ఖాతాలలో 392 కోట్ల రూపాయలను తాజాగా జమ చేయడం జరిగిందని, 330 కోట్ల రూపాయలు మహిళల ఉచిత బస్సు ప్రయాణం కు చెల్లించడం జరిగిందని, పేద ప్రజల అభివృద్ధి, రైతుల సంక్షేమ, అభివృద్ధి కోసం 1 వెయ్యి కోట్ల రూపాయలు ఆరు గ్యారెంటీ ల ద్వారా జిల్లాలో ప్రభుత్వం ఖర్చు చేయడం తెలిపారు. పేద విద్యార్థులకు కార్పొరేట్ విద్యను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ పబ్లిక్ స్కూల్ వ్యవస్థను ప్రవేశపెట్టిందని దానిలో భాగంగా మర్కుక్ మండలంలో ఈ విద్యా సంవత్సరం నుండి తెలంగాణ పబ్లిక్ స్కూల్ తరగతులు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. కొండపాక మండల కేంద్రంలో 200 కోట్ల రూపాయలతో 16 ఎకరాల్లో తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని తెలిపారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గాలలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని హుస్నాబాద్ నియోజకవర్గంలోని కోహెడ మండలం తంగళ్ళపల్లి గ్రామంలో ఇప్పటికే యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయని అన్నారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జూన్ 2న ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని అమలు చేయనున్నదని ఈ పథకం ద్వారా ఐదు లక్షల రూపాయల జీవిత బీమా ప్రతి కుటుంబానికి లభిస్తుందని తెలిపారు. పిల్లలు ఆరోగ్యంగా ఎదిగేందుకు ఈ విద్యా సంవత్సరం నుండి ఇంటర్మీడియట్ కాలేజీలలో కూడా ఉచిత మధ్యాహ్న భోజనం పథకాన్ని అమలు చేయనున్నదని అదేవిధంగా ప్రైమరీ స్కూల్స్, హై స్కూల్స్ తో పాటు ఇంటర్మీడియట్ వరకు విద్యార్థులకు ఉదయం అల్పాహారం కార్యక్రమాన్ని కూడా ప్రభుత్వం చేపట్టనున్నదని తెలిపారు.
ప్రజల అభివృద్ధి సంక్షేమం కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను పేద ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సూచించారు. ఈ సందర్భంగా పోలీస్ శాఖ వారి ద్వారా రహదారి భద్రత పై మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ ద్వారా పౌష్టికాహారం తీసుకోవడంపై ప్రతిజ్ఞ చేయించారు. చివరిగా మహిళా శిశు సంక్షేమ శాఖ వారు ఏర్పాటు చేసిన పౌష్టికాహారం ఎగ్జిబిషన్ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి, తాసిల్దార్, ఎంపీడీవో, సర్పంచ్, ఇతర ప్రజాప్రతినిధులు మండల స్థాయి అధికారులు సర్పంచులు మహిళలు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.