ముద్ర, హైదరాబాద్ :
మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం (ఎంజీఎన్‌రేగా)ను నిర్వీర్యానికి కేంద్రం చేస్తున్న కుట్రలకు నిరసనగా హైదరాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ ‘ఎంజీఎన్‌రేగా బచావో సంగ్రామ్ యాత్ర’కు శ్రీకారం చుట్టింది. శనివారం మూడు రోజుల పాటు సాగే ఈ పాదయాత్రను శనివారం ప్రారంభించింది. తొలిరోజు చార్మినార్ నుంచి పురానాపుల్ వరకు, యాకుత్‌పురాలోని సింగరేణి కాలనీ నుంచి సంతోష్‌నగర్ ఎక్స్‌రోడ్స్ వరకు పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్, సీనియర్ నాయకులు వి. హనుమంతరావు మాట్లాడుతూ ఎంజీఎన్‌రేగా యొక్క మూల ఆత్మను దెబ్బతీసే మార్పులను ప్రతిఘటించేందుకు భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన దేశవ్యాప్త ఉద్యమంలో భాగంగానే ఈ యాత్ర ప్రారంభించినట్లు చెప్పారు. గ్రామీణ భారతానికి ‘జీవనాధారం’గా ఎంజీఎన్‌రేగా ను పేర్కొన్న కాంగ్రెస్ నాయకులు.. పథకం మద్దతుగా తీర్మానం చేశారు. రెండు దశాబ్దాల్లో ఈ పథకం ద్వారా రూ.180 కోట్లకు పైగా మానవ-రోజుల ఉపాధి, దాదాపు రూ.10 కోట్ల ప్రజా ఆస్తులు సృష్టించబడ్డాయని చెప్పారు. స్థానిక ప్రణాళికల ద్వారా గ్రామ పంచాయతీలను శక్తివంతం చేసిందని తెలిపారు. “కోవిడ్-19 మహమ్మారి సమయంలో ఎంజీఎన్‌రేగా గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ఆధారస్తంభంగా నిలిచిందనీ ఇప్పుడు అది ముప్పులో ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ యాత్రలో పార్టీ కేడర్లు, కార్యకర్తలు, పౌరులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ప్లకార్డులు, నినాదాలు, ప్రసంగాల ద్వారా ఎంజీఎన్‌రేగా అసలు నిర్మాణాన్ని కొనసాగించాల్సిన అవసరాన్ని హైలైట్ చేస్తూ, గ్రామీణ ఉపాధి కార్యక్రమాల కేంద్రీకరణ, ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. హైదరాబాద్ డీసీసీ అధ్యక్షుడు సయ్యద్ ఖాలిద్ సైఫుల్లా నేతృత్వంలో సాగుతున్న ఈ యాత్రను వివిధ నియోజకవర్గాల కాంగ్రెస్ అసెంబ్లీ ఇన్‌చార్జీలు— రాజేష్ కుమార్ పులిపాటి (బహదూర్‌పురా), బి. నాగేశ్ (చంద్రాయణగుట్ట), మొహమ్మద్ ముజీబుల్లా షరీఫ్ (చార్మినార్), షేక్ అక్బర్ (మలక్‌పేట్), మరియు కె. రవి రాజ్ (యాకుత్‌పురా)—సక్రియంగా సమన్వయం చేస్తున్నారు. మూడు రోజుల పాటు ఈ ర్యాలీ నగరంలోని చార్మినార్, యాకుత్‌పురా, బహదూర్‌పురా, చంద్రాయణగుట్ట, మలక్‌పేట్ అనే ఐదు ప్రధాన అసెంబ్లీ నియోజకవర్గాల మీదుగా సాగి 26న ముగుస్తుంది. ఈ నిరసనలో హైదరాబాద్ మార్కెట్ కమిటీ వైస్‌చైర్మన్ కోట్ల శ్రీనివాస్, పీసీసీ కార్యదర్శి మాజీ భీమ్ అర్జున్ రెడ్డి, కె. రవిరాజ్, మామిడి కృష్ణ కుమార్, అల్లం భాస్కర్, మల్లికార్జున్, అబ్దుల్ ఖదీర్, యూసుఫ్ దానిష్, మహమ్మద్ అబ్దుల్ ఘనీ, మొహమ్మద్ ముస్తఫా, సయ్యద్ దిలావర్ హుస్సేన్, అరుణ్ ఠాకూర్, శంకర్ నాయక్, శ్రీనివాస్ వాల్మీకి, రంగ శ్రీకాంత్ గౌడ్, అలేవాలు, ఇందివేలు శేషు యాదవ్ పాల్గొన్నారు.