మూసి అభివృద్ధిలో భాగస్వాములను చేయండి
పునరావాస ప్రతిపాదనలను పరిశీలించండి
ముద్ర, తెలంగాణ బ్యూరో :
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న మూసి పునర్జీవనం పథకంలో ఇండ్లు, వ్యాపారాలు కోల్పోతోన్న తమకు న్యాయం చేయాలని మధు పార్క్ ఏ బ్లాక్ నిర్వాసితులు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కు విజ్ఞప్తి చేశారు. అందుకు మూడు ప్రతిపాదనలను పరిశీలన కోసం సమర్పించారు. సోమవారం మధ్యాహ్నం మధు పార్క్ రిడ్జ్ ఏ బ్లాక్ నిర్వాసితులు హైదరాబాదులోని ప్రజాభవన్ లో డిప్యూటీ సీఎంను కలిశారు. మూసి పునర్జీవనం అభివృద్ధి పనులను స్వాగతిస్తున్నామని చెప్పారు. అభివృద్ధి పనులపై తమకు ఎటువంటి అభ్యంతరం లేదన్న నిర్వాసితులు అందులో తమను భాగస్వాములను చేయాలని కోరారు.
నిర్వాసితుల ప్రతిపాదనలపై డిప్యూటీ సీఎం స్పందిస్తూ మూడు ప్రతిపాదనలను మానవీయ కోణంలో ఆలోచించి న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు. మధు పార్క్ రిడ్జ్ ఏ బ్లాక్ నిర్వాసితులు ఇచ్చిన ప్రతిపాదనలను పరిశీలించి మూసి క్యాబినెట్ సబ్ కమిటీకి నివేదిక ఇవ్వాలని మూసి రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండి నరసింహారెడ్డి, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి లను డిప్యూటీ సీఎం ఆదేశించారు. డిప్యూటీ సీఎంకు విజ్ఞాపన పత్రం సమర్పించిన వారిలో మధు పార్క్ రిడ్జ్ ఏ బ్లాక్ ప్రెసిడెంట్ డాక్టర్. కె శ్రీశైలం, సెక్రెటరీ డాక్టర్ కరీముల్లా, సలహాదారు సంజయ్ శుక్ల, లీగల్ అడ్వైజర్ ప్రతాపరెడ్డి, జేఏసీ బి.యన్.రెడ్డి, ఉపాధ్యక్షుడు రాంబాబు తదితరులు పాల్గొన్నారు.