అంగన్ వాడీల సెల్ ఫోన్ల అంశంపై సీరియస్
ముద్ర, తెలంగాణ బ్యూరో :
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు మంత్రి సీతక్క లీగల్ నోటీసులు పంపించారు. తనపై బీఆర్ఎస్ నేతలు చేస్తున్న అవినీతి ఆరోపణలను మంత్రి సీతక్క తీవ్రంగా తిప్పికొట్టారు. బీఆర్ఎస్ నేతలు చేస్తున్న నిరాధార ఆరోపణలకు కేసీఆర్ బాధ్యత వహించాలని పేర్కొన్నారు. సోషల్ మీడియాలో తనపై అవినీతి ఆరోపణలు చేస్తూ పెట్టిన పోస్ట్‌లను తొలగించి క్షమాపణ చెప్పాలని మంత్రి సీతక్క డిమాండ్ చేశారు. తెలంగాణలో అంగన్వాడీ టీచర్లకు కొనుగోలు చేసిన సెల్‌ఫోన్ల అంశం అధికార విపక్షాల మధ్య తీవ్ర మాటల యుద్ధానికి కారణం అవుతోంది. రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క లక్ష్యంగా బీఆర్ఎస్ నేతలు మీడియా, సోషల్ మీడియాలో తీవ్ర అవినీతి ఆరోపణలు గుప్పిస్తున్నారు. దీనిపై ఇప్పటికే తీవ్రంగా స్పందించిన మంత్రి సీతక్క.. చెప్పు తెగుతుంది అంటూ తీవ్ర హెచ్చరికలు చేశారు. అయినప్పటికీ బీఆర్ఎస్ నేతలు వెనక్కి తగ్గకపోవడంతో మరోసారి మంత్రి సీతక్క స్పందించారు. ఈ నేపథ్యంలోనే బీఆర్‌ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు మంత్రి సీతక్క.. తాజాగా లీగల్ నోటీసులు జారీ చేశారు. అంగన్వాడీ టీచర్లకు మొబైల్ ఫోన్లు కొనుగోలు చేసిన అంశంపై బీఆర్‌ఎస్ పార్టీ సోషల్ మీడియాలో ఎలాంటి ఆధారాలు లేకుండా ఆరోపణలు చేస్తున్నారని ఆ లీగల్ నోటీసుల్లో పేర్కొన్నారు. అవినీతి ఆరోపణలు చేస్తూ.. తన ప్రతిష్ఠను దెబ్బతీస్తున్నారని మంత్రి తెలిపారు.
ఇక ఆ సెల్‌ఫోన్ల కొనుగోలు వ్యవహారంతో తనకు ఎలాంటి సంబంధం లేదని సీతక్క స్పష్టం చేశారు. ఈ దుష్ప్రచారానికి బాధ్యత కేసీఆర్‌దేనని తేల్చి చెప్పారు. 48 గంటల్లో తనపై చేసిన పోస్టులను సోషల్ మీడియా నుంచి తొలగించి కేసీఆర్ క్షమాపణ చెప్పాలని మంత్రి సీతక్క డిమాండ్ చేశారు. లేని పక్షంలో న్యాయపరంగా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ఇటీవలె ములుగులో జరిగిన కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో మంత్రి సీతక్క ఈ వ్యవహారంపై తీవ్రంగా స్పందించారు. అంగన్వాడీ టీచర్లకు ఒక్కో ఫోన్‌ను రూ.11,650కు కొనుగోలు చేశారని.. అయితే రూ.14 వేలకు కొన్నట్లు బీఆర్ఎస్ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తాను ఎక్కడా అవినీతి చేయలేదని మంత్రి సీతక్క స్పష్టం చేశారు.
ఆరోపణలు కంటిన్యూ
మంత్రి సీతక్క శాఖలో రూ.30 కోట్ల కుంభకోణం జరిగిందని బీఆర్‌ఎస్ అధికార ప్రతినిధి మన్నె క్రిశాంక్ సంచలన ఆరోపణలు గుప్పించారు. కేంద్ర ప్రభుత్వం అంగన్వాడీ టీచర్లకు 38,130 స్మార్ట్ ఫోన్లు ఇచ్చేందుకు రూ.54.19 కోట్లతో టెండర్లు పిలిచారని తెలిపారు. శాంసంగ్ ఏ06 4జీ మోడల్ ఫోన్లను పంపిణీ చేయాలని నిర్ణయిస్తే.. టెండర్‌లో 5జీ ఫోన్లు అని పేర్కొన్నట్లు ఆరోపించారు. ఆ ఫోన్ ధర రూ.6 వేలేనని.. ప్రభుత్వం మాత్రం రూ.14,215లతో ఒప్పందాలు కుదుర్చుకుందని పేర్కొన్నారు.