Take a fresh look at your lifestyle.

మూడు వారాల్లో ముగించండి ఇబ్రహీంపట్నం మున్సిపల్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ఎన్నికపై హైకోర్టు తీర్పు

 

ముద్ర, తెలంగాణ బ్యూరో :

పెండింగ్ లో ఉన్నఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికపై హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. రాబోయే మూడు వారాల్లోపు ఈ ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్‌, రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ను ఆదేశించింది. కౌన్సిలర్లు ఎవరి ఒత్తిడికి లోనవ్వకుండా స్వచ్ఛందంగా తమ మద్దతును తెలుపుకునేలా చర్యలు తీసుకోవాలని కోర్టు స్పష్టం చేసింది. చైర్మన్ ఎన్నికపై తుది నిర్ణయం తీసుకునే అధికారం ఎన్నికల రిటర్నింగ్ అధికారిదేనని కోర్టు తేల్చి చెప్పింది. ప్రస్తుతం ఉన్న సందిగ్ధతను తొలగించి ఎన్నికల ప్రక్రియను మూడు వారాల్లోగా పూర్తి చేసి, నూతన పాలకవర్గాన్ని ప్రకటించాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ఎన్నికపై హైకోర్టు మంగళవారం విచారణ జరిపింది. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీల్లో పాలకవర్గాలు కొలువుదీరిన నేపథ్యంలో.. ఇబ్రహీంపట్నంలోనూ ఆ మేరకు చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. ఎన్నిక విషయంలో ఇంకా ఆలస్యం జరిగితే దాని ప్రభావం అభవృద్ధిపై పడుతుందని కోర్టు అభిప్రాయపడింది. ఇదిలావుంటే.. గత నెలలో మున్సిపల్ చైర్మన్ ఎన్నిక సమయంలో 19వ వార్డు బీఆర్ఎస్ కౌన్సిలర్ ఆకుల యాదగిరి కనిపించకుండా పోవడం కలకలం రేపింది. దీంతో తన తండ్రిని ప్రత్యర్థి పార్టీ నేతలు కిడ్నాప్ చేశారంటూ యాదగిరి కుమారుడు హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక ప్రక్రియపై స్టే విధించింది. అయితే, స్టే ఉత్తర్వులు వచ్చే సమయానికే ఎన్నిక ముగిసిందని, బీఆర్ఎస్ అభ్యర్థి సుదర్శన్ రెడ్డి మెజారిటీ సాధించారని ఆయన తరపు న్యాయవాదులు వాదించారు. ఇరు పక్షాల వాదనలు విన్న ధర్మాసనం ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికను మూడు వారాల్లోపు పూర్తి చేయాలని తుది తీర్పును వెలువరించింది.

Leave A Reply

Your email address will not be published.