పైలట్ రోహిత్‌రెడ్డి కస్టడీకి కోర్టు అనుమతి
ఆయన సోదరుడు,ఢిల్లీ వ్యాపారవేత్త నమిత్ శర్మ కస్టడికీ గ్రీన్ సిగ్నల్
ముద్ర, తెలంగాణ బ్యూరో :
రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మొయినాబాద్ ఫాంహౌస్ డ్రగ్స్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్‌రెడ్డి, ఆయన సోదరుడు రితేష్‌రెడ్డి,ఢిల్లీకి చెందిన వ్యాపారవేత్త నమిత్ శర్మలను పోలీస్ కస్టడీకి అనుమతిస్తూ కోర్టు సోమవారం తీర్పు ఇచ్చింది. నిందితులను మూడు రోజుల పాటు పోలీస్ కస్టడీకి అప్పగిస్తూ న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. ఈ ముగ్గురిని విచారించడం ద్వారా డ్రగ్స్ నెట్‌వర్క్ మూలాలను, సరఫరాదారుల వివరాలను రాబట్టాలని పోలీసులు భావిస్తున్నారు. కాగా ఈ నెల 14న మొయినాబాద్‌లోని రోహిత్‌రెడ్డి ఫాంహౌస్‌పై ఈగల్ టీమ్ నిర్వహించిన దాడుల్లో డ్రగ్స్‌తో పాటు ఆయుధాలు కూడా లభ్యమయ్యాయి. సోదాల సమయంలో నమిత్ శర్మ పోలీసులపైకి కాల్పులు జరపడం కలకలం రేపింది. ప్రస్తుతం చంచల్‌గూడ జైలులో రిమాండ్‌లో ఉన్న వీరిని పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకుని, విచారణ నిమిత్తం రహస్య ప్రాంతానికి తరలించే అవకాశం ఉంది. డ్రగ్స్ పార్టీ వెనుక ఉన్న అసలు సూత్రధారులు ఎవరు? ఇంకా ఎవరెవరికి ఇందులో ప్రమేయం ఉందనే కోణంలో ‘సిట్’ అధికారులు తమ దర్యాప్తును వేగవంతం చేయనున్నారు