Take a fresh look at your lifestyle.

ఆఫర్ హరీశ్ కేనా..? అయితే చెక్.. లేదంటూ క్లోజ్ సిద్ధిపేట వ్యాఖ్యల్లో రేవంత్ మర్మం..?

అటు బీఆర్ఎస్ లో కూడా హరీశ్ కు కష్టకాలం
కేటీఆర్ తో పోసగడం లేదనే ప్రచారం
ఇదే సమయంలో సీఎం ఆఫర్..?

ముద్ర, తెలంగాణ బ్యూరో :
మళ్లీ వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని, సిద్దిపేటలో గెలిచే కాంగ్రెస్ అభ్యర్థికి మంత్రి పదవి ఇస్తామని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. మాజీ మంత్రి హరీశ్ కు చెక్ పెట్టడంలో భాగంగా ఈ వ్యాఖ్యలు చేసినట్లు సంకేతాలు ఇచ్చినా.. ఈ వ్యాఖ్యల ముసుగులో హరీశ్ రావుకు ఆఫర్ ఇచ్చినట్లుగా మరో టాక్. ఎందుకంటే ఇప్పటికే బీఆర్ఎస్ లో అంతర్యుద్ధం నడుస్తూనే ఉంది. కేటీఆర్ టీం.. హరీశ్ రావు వర్గాన్ని దూరం పెడుతూనే ఉంది. అటు కవిత కూడా హరీశ్ ను టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తూనే ఉన్నారు. ఇలాంటి సమయంలో హరీశ్ రావును అక్కున చేర్చుకునేందుకు రేవంత్ రెడ్డి స్కెచ్ వేసినట్లుగా భావిస్తున్నారు. నిజానికి, ఇటీవల హరీశ్ రావు కూడా దూకుడు తగ్గించారు.

సిద్దిపేటకు సీఎం ఆఫర్..?
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తన పర్యటన సందర్భంగా సిద్దిపేటకు మంత్రి పదవి ఆఫర్ చేశారు. వచ్చే ఎన్నికల్లో సిద్దిపేట నుంచి గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యేను మంత్రిని చేస్తామన్నారు. ఈ బాధ్యతను పెద్దలు దామోదర్ రాజనరసింహ, వివేక్ వెంకట స్వామి తీసుకుంటారని నేను ఈ వేదిక మీద నుంచి రేవంత్ మాటిచ్చారు. 2029 ఎన్నికలలో సిద్దిపేటలో గెలిచే కాంగ్రెస్ ఎమ్మెల్యేను వారు మంత్రిని చేస్తారని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 2014, 2018 సంవత్సరాల్లో కూడా మేము పోటీ పడ్డాం. ఆనాడు ప్రజలు మీకు (బీఆర్ఎస్ పార్టీకి) అధికారం ఇచ్చారు. కానీ 2023లో మీరు మేము పోటీ పడ్డప్పుడు ప్రజలు అధికారం మాకు ఇచ్చారు. అలాగే 2029లో కూడా ప్రజలు మాకే అవకాశం ఇస్తారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని సిద్దిపేట జిల్లాలోని నర్మెట్టలో జరిగిన భారీ బహిరంగసభలో రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే హరీష్ రావును వచ్చే ఎన్నికల్లో ఓడించేందుకు కాంగ్రెస్ నేతలు ఇప్పటినుంచే వ్యూహాలు రచిస్తున్నారు అనడానికి రేవంత్ మంత్రి పదవి ఆఫరే అందుకు నిదర్శనం.

సిద్దిపేటలో ఒక్క ఛాన్స్ ఇవ్వండి.. సీఎం రేవంత్ రెడ్డి
‘సిద్దిపేట ప్రాంతంలో 1984 నుంచి 2029 వరకు ఒకే కుటుంబం అధికారంలో ఉంది. కనుక ఈసారి ఇతరులకు కూడా ఒక అవకాశం ఇవ్వాలని నేను కోరుతున్నాను. నాయకత్వంలో మార్పు చేసి చూడండి. మీకు ఎంత మంచి జరుగుతుందో లేదో మీకే తెలుస్తుంది. ఈ ప్రాంత ప్రజలు చైతన్యవంతులు. కనుక వచ్చే ఎన్నికల్లో విచక్షణతో ఆలోచన చేయాలని కోరుతున్నాను.. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే బాధ్యతను మా ప్రభుత్వం తీసుకుంటుంది. మల్లన్న సాగర్ సమస్య లేదా ఇతర సాగునీటి ప్రాజెక్టుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాం. గతంలో మల్లన్న సాగర్ సమయంలో ఏటిగడ్డ కిష్టాపూర్లో నేను 48 గంటల పాటు దీక్ష చేశాను. ఆనాడు రైతుల పక్షాన నిలబడటానికి దామోదర్ రాజనరసింహ, రఘునందన్ రావు కూడా వచ్చారని’ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గుర్తుచేసుకున్నారు.
అంతేకాదు.. సిద్ధిపేట నియోజకవర్గ పరిధిలో విద్యా, వైద్య, మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట వేస్తూ రేవంత్ రెడ్డి పలు కీలక భవనాలను ప్రారంభించారు. ఇందులో ప్రధానంగా రూ. 141.34 కోట్లతో సిద్ధిపేట మున్సిపాలిటీలో చేపట్టిన నీటి సరఫరా మరియు భూగర్భ డ్రైనేజీ ప్రాజెక్టులు ఉన్నాయి. అలాగే ఎన్సాన్‌పల్లిలో రూ. 78 కోట్లతో నిర్మించిన జిల్లా జైలు భవనం, రూ. 15 కోట్లతో ఏర్పాటు చేసిన 50 పడకల సమీకృత ఆయుష్ ఆసుపత్రిని ఆయన జాతికి అంకితం చేశారు. ఇవే కాకుండా సెంట్రల్ మెడిసిన్ స్టోర్‌తో పాటు నంగునూరు, అంబేద్కర్ నగర్‌లలో కొత్తగా నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం భవనాలను కూడా సీఎం ప్రారంభించారు.

టార్గెట్ హరీశ్ ..?
మొత్తంగా సీఎం రేవంత్ రెడ్డి.. ఇప్పుడు హరీశ్ రావు మీద గురి పెట్టినట్లుగా అర్థమవుతోంది. ఇటు కేసీఆర్ కూడా ఫాంహౌస్ కు పరిమితం కావడం, కేడర్ ను పట్టించుకోకపోవడంతో గులాబీ దళం కొంత ఆయోమయంలో ఉంది. దీనికితోడు హరీశ్ రావుకు.. కేటీఆర్ కు మధ్య గ్యాప్ ఉంది. ఇదే అవకాశాన్ని సీఎం అనుకూలంగా మల్చుకుంటున్నారనే ప్రచారం మొదలైంది. సిద్ధిపేటకు మంత్రి పదవి ఆఫర్ నేపథ్యంలో ఇటీవల పరిస్థితులకు అనుగుణంగా హరీశ్ రావు తమవైపు మద్దతుగా ఉంటారని అంచనా వేస్తున్నట్లు తెలుస్తోంది.

Leave A Reply

Your email address will not be published.