పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకునే ప్రయత్నం
గాంధీనగర్ పోలీసులు వేధిస్తున్నారంటూ ఆరోపణ
ముద్ర, నాంపల్లి :
హైదరాబాద్ లోని నాంపల్లిలో ఉన్న రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ ముందు ఓ మహిళ ఆత్మహత్యకు యత్నించింది. మంగళవారం కమిషన్ కార్యాలయం ముందు పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుంటుండగా పోలీసులు అడ్డుకున్నారు. కవాడిగూడలో శ్రావణి అనే మహిళ తన కుటుంబంతో కలిసి నివసిస్తోంది. గాంధీ నగర్ పోలీసులు తనని వేధిస్తున్నారని కమిషన్ కార్యాలయం ముందు పెట్రోల్ పోసుకొని సదరు మహిళ ఆత్మహత్యకు యత్నించింది. అక్కడే విధుల్లో ఉన్న పోలీసులు అడ్డుకొని పెట్రోల్ బాటిల్ ను లాక్కున్నారు .సదరు మహిళను కమిషన్ చైర్మన్ వద్దకు హెచ్ ఆర్ సి సిబ్బంది తీసుకెళ్లారు. అక్కడ మహిళా ఫిర్యాదును స్వీకరించిన ఛైర్మన్ న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. దీంతో ఆమె అక్కడ్నుంచి వెళ్లిపోయింది.