Take a fresh look at your lifestyle.

ఇంటింటికీ ఇంటర్నెట్ – స్మార్ట్ టీవీ

  • ఇప్పటికే 8,891 గ్రామపంచాయతీల్లో టీ ఫైబర్ అనుసంధానం.
  • టీ ఫైబర్ ఇకపై T-NxTగా సేవలు అందిస్తుంది.
  • ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు.

ముద్ర, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలోని ప్రతి ఇంటికి, ప్రభుత్వ కార్యాలయాలకు తెలంగాణ ఫైబర్ నెట్ ద్వారా ఇంటర్నెట్ సేవలు అందజేస్తామని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్ర దుద్ధిళ్ళ శ్రీధర్ బాబు చెప్పారు.ఈ మేరకు గురువారం హైదరాబాద్‌లోని బేగంపేటలో టీ ఫైబర్ నూతన కార్యాలయాన్ని మంత్రి శ్రీధర్ బాబు ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో వ్యాపార భాగస్వాములతో 9 అవగాహన ఒప్పందాలపై సంతకాలు జరిగాయి.ఈ సందర్భంగా శ్రీధర్ బాబు టీ ఫైబర్ కొత్త లోగోను ఆవిష్కరించారు.తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించిన డేటాను సురక్షితంగా ఉంచగల సావరిన్ క్లౌడ్ ను మంత్రి ప్రారంభించారు. కేవలం వైర్లను జత చేయటం కాదు. ప్రజలను, వాళ్ళ ఆలోచనలను, అవకాశాలను కలుపుతున్నాం అని మంత్రి ప్రకటించారు.టీ ఫైబర్ కోసం కొత్త విజన్ డాక్యుమెంట్ ను ఆవిష్కరించారు.తెలంగాణా ఫైబర్ గ్రిడ్ కార్పొరేషన్ ఛైర్మన్ గా కూడా మంత్రి శ్రీధర్ బాబు బాధ్యతలు స్వీకరించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేబుల్ అపరేటర్ల సహకారంతో లాస్ట్ మైలు వరకు టీవీ ఛానెల్స్ సదుపాయాలు కూడా కల్పిస్తామని తెలిపారు. టీవీ సెట్లను కంప్యూటరు మానిటర్‌గా వినియోగించుకుని విద్యార్థులు ప్రయోజనం పొందేలా టెక్నాలజీ రూపొందించినట్టు శ్రీధర్ బాబు చెప్పారు. టీ ఫైబర్ ఇప్పటికే 424 మండలాల్లోని 8,891 గ్రామ పంచాయతీలను అనుసంధానం చేసిందన్నారు.మరో 7,187 పంచాయతీలు సేవలు అందుకోవటానికి సిద్దంగా ఉన్నామన్నారు.ఈ సంవత్సరం 30 వేల ప్రభుత్వ కార్యాలయాలకు కనెక్టివిటీ కల్పించామన్నారు. 2027 నాటికి 60 వేల కార్యాలయాలను అనుసంధానం చేస్తామని చెప్పారు. టీ ఫైబర్ ఇకపై T-NxT పేరుతో సేవలు అందిస్తుందన్నారు.ఈ కార్యక్రమంలో ఐటీ శాఖ డిప్యూటీ సెక్రెటరీ భవేష్ మిశ్రా, టీ ఫైబర్ ఎండీ వేణు ప్రసాద్ పన్నేరు, పలువురు అధికారులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.