బీజేపీ నూతన ప్రజాప్రతినిధులు.. వేలాది మందితో కలిసి తో 14న బండి సంజయ్ మహా పాదయాత్ర
ఉదయం 7 గంటలకు కరీంనగర్ మహాశక్తి ఆలయం నుండి పాదయాత్రకు శ్రీకారం
సాయంత్రం 4 గంటలకు కొండగట్టుకు చేరుకోనున్న కేంద్ర మంత్రి
నూతన ప్రజాప్రతినిధులతో కలిసి అంజన్నకు మొక్కులు తీర్చుకోనున్న బండి సంజయ్
దాదాపు 10 వేల మంది కార్యకర్తలు మహాపాదయాత్రలో పాల్గొనేలా కార్యాచరణ
రాజకీయాలకు అతీతంగా భక్తిపాటలు, డప్పు చప్పళ్లతో సాగనున్న ఆధ్యాత్మిక మహాపాదయాత్ర
అంజన్న ఆశీర్వాద యాత్రకు మంగళహారతులు, పూల జల్లులతో స్వాగతం పలికేందుక సిద్ధమైన గ్రామాలు
ముద్ర, కరీంనగర్:
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ‘అంజన్న ఆశీర్వాద యాత్ర’ పేరిట ఈ నెల 14న మహా పాదయాత్ర చేపట్టనున్నారు. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో నూతనంగా ఎన్నికైన గ్రామ పంచాయతీ వార్డు సభ్యులు, ఉపసర్పంచులు, సర్పంచులు, మున్సిపల్ కౌన్సిలర్లు, కార్పొరేషన్ కార్పొరేటర్లు, మేయర్, డిప్యూటీ మేయర్‌తో పాటు దాదాపు 10 వేల మంది కార్యకర్తలతో కలిసి ఈ మహా పాదయాత్ర నిర్వహించనున్నారు.
ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో కరీంనగర్ మేయర్ పదవిని బీజేపీకి అప్పగిస్తే, తన పార్లమెంట్ పరిధిలోని నూతనంగా ఎన్నికైన బీజేపీ ప్రజాప్రతినిధులతో కలిసి కొండగట్టు అంజన్న ఆలయానికి కాలినడకన వెళ్లి మొక్కులు తీర్చుకుంటానని బండి సంజయ్ ప్రకటించారు. ప్రజలు బీజేపీని ఆశీర్వదించి మేయర్ పీఠాన్ని అందజేయడంతో పాటు పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో గతంతో పోలిస్తే అధిక సంఖ్యలో వార్డు సభ్యులు, సర్పంచులు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు గెలవడంతో ఇచ్చిన మాట ప్రకారం మొక్కులు తీర్చుకునేందుకు ఆయన సిద్ధమయ్యారు.
అందులో భాగంగా ఈ మహా పాదయాత్రకు ‘అంజన్న ఆశీర్వాద యాత్ర’గా నామకరణం చేశారు. ఈ నెల 14న ఉదయం 7 గంటలకు కరీంనగర్‌లోని మహాశక్తి ఆలయం నుంచి పాదయాత్ర ప్రారంభమవుతుంది. పాదయాత్ర విజయవంతం కోసం డాక్టర్ గంగిడి మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక కమిటీని బండి సంజయ్ ఏర్పాటు చేశారు. బీజేపీ కరీంనగర్, సిరిసిల్ల జిల్లాల ఇన్‌చార్జ్‌లు భండారి శాంతికుమార్, మోహన్ రెడ్డి, ఆయా జిల్లాల అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి, రెడ్డబోయిన గోపి, కరీంనగర్ పార్లమెంట్ కన్వీనర్, కార్పొరేటర్ బోయినిపల్లి ప్రవీణ్ కుమార్ ఈ కమిటీలో సభ్యులుగా ఉన్నారు.
ఇవాళ మధ్యాహ్నం సమావేశమై పాదయాత్ర విజయవంతానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించనున్నారు. వీరితో పాటు కరీంనగర్ మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ సునీల్ రావు కూడా పాదయాత్ర ఏర్పాట్లను పర్యవేక్షించనున్నారు.
ఇక ఈ మహా పాదయాత్రలో బండి సంజయ్‌తో కలిసి అడుగులో అడుగులు వేసేందుకు కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని కార్యకర్తలు సిద్ధమవుతున్నారు. ఎంపీ కార్యాలయానికి ఫోన్లు చేసి పాదయాత్రలో పాల్గొనడానికి పేర్లు నమోదు చేసుకుంటున్నారు. పోలింగ్ బూత్ కమిటీ సభ్యుల నుంచి మండల, జిల్లా, పార్లమెంట్ స్థాయి నాయకుల వరకు అందరూ ఈ యాత్రలో పాల్గొననున్నారు.
రాజకీయాలకు అతీతంగా నిర్వహించే ఈ పాదయాత్రలో ప్రతి ఒక్కరూ పాల్గొనవచ్చని మహా పాదయాత్ర కమిటీ సభ్యులు తెలిపారు. భక్తి పాటలు, డప్పు చప్పుళ్లతో ఆధ్యాత్మిక వాతావరణంలో యాత్ర కొనసాగుతుందని చెప్పారు.
ఉదయం 7 గంటలకు కరీంనగర్ మహాశక్తి ఆలయం నుంచి ప్రారంభమయ్యే ఈ పాదయాత్ర రేకుర్తి, కొత్తపల్లి, గంగాధర, కొడిమ్యాల, మల్యాల మార్గంగా కొండగట్టు అంజన్న ఆలయానికి చేరుకుంటుంది. దాదాపు 40 కిలోమీటర్ల మేర కాలినడకన ప్రయాణించి, కొండగట్టు ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకోనున్నారు.
ఈ పాదయాత్ర నేపథ్యంలో ఆయా గ్రామాల్లో కాషాయ కార్యకర్తలు, హిందుత్వవాదుల్లో ఉత్సాహం నెలకొంది. బండి సంజయ్ పాదయాత్రకు మంగళహారతులు, పూల జల్లులతో ఘన స్వాగతం పలకడానికి గ్రామస్థులు సిద్ధమవుతున్నారు. వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని పాదయాత్రలో పాల్గొనే వారికి దారిపొడవునా మంచినీళ్లు, మజ్జిగ ప్యాకెట్లు, పులిహోర ప్యాకెట్లు ఏర్పాటు చేయనున్నారు.