- తప్పిదాల సవరణకు మార్గం న్యాయం కోసం అప్పీల్ కు సైతం అవకాశం.
- షాద్ నగర్ నియోజకవర్గంలో భూ భారతి చట్టంపై అవగాహన సదస్సుల్లో రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి వెల్లడి.
ఉమ్మడి రంగారెడ్డి, ముద్ర ప్రతినిధి: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ‘భూ భారతి 2025′ నూతన ఆర్.ఓ.ఆర్ చట్టం భూ వివాదాల పరిష్కారానికి ఎంతగానో దోహదపడుతుందని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి అన్నారు. ఈ చట్టం రైతులకు మేలు కోరే విధంగా ప్రభుత్వం తీసుకొచ్చిందని స్పష్టం చేశారు.బుధవారం రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజక వర్గం కొందుర్గు, జిల్లెడ్ చౌదరి గూడెం మండలాల్లోని రైతువేదికలలో భూ భారతి చట్టం-2025 పై అవగాహన సదస్సులు నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక శాసన సభ్యులు వీర్లపల్లి శంకర్ జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డితో కలిసి సదస్సుల్లో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి భూభారతి కొత్త ఆర్వో ఆర్ చట్టం పై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా చట్టంలో తీసుకొచ్చిన విధి.విధానాలను, మార్గదర్శకాలను ప్రజలకు వివరించారు. అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలకు ఎలాంటి భూ వివాదాలకు తావు లేకుండా రైతులకు సంబంధించిన భూముల పై వారికి పూర్తి యాజమాన్య హక్కులు కల్పించేందుకు ప్రభుత్వం ఆనేక కొత్త అంశాలను పొందుపరుస్తూ ఈ నూతన ఆర్.ఓ.ఆర్ భూభారతి చట్టాన్ని తెచ్చిందని అన్నారు.ప్రధానంగా భూ భారతిలో కీలక అంశాల గురించి మాట్లాడుతూ ధరణి స్థానంలో కొత్త భూమి హక్కుల రికార్డు – భూ భారతి వచ్చిందని, హక్కుల రికార్డులలో తప్పుల సవరణకు అవకాశం ఇస్తూ, రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ చేయ్యడానికి ముందు భూముల సర్వే, మ్యాప్ తయారీ విధానం భూ భారతి చట్టంలో అందుబాటులోకి తెచ్చారన్నారు. మోసపూరితంగా హక్కుల రికార్డులు మార్చి ఎవరైన ప్రభుత్వ, భూదాన్, అసైన్డ్, ఎండోమెంట్, వక్స్ భూములకు పట్టాలు పొందితే రద్దు చేసే అధికారం అధికారులకు అందింది అన్నారు.అంతే కాకుండా భూ భారతి 2025 చట్టంలో 23 సెక్షన్లు మరియు 18 నిబంధనలున్నాయని తెలిపారు. ప్రభుత్వం ఆధార్ తరహాలో భవిష్యతులో భూమికి సంబంధించి సర్వే చేసి కొలతలు, హద్దుల వంటి సమగ్రమైన వివరాలతో ‘భూధార్’ తీసుకు రాబోతుందని పేర్కొన్నారు.ఈ చట్టం ద్వారా భూముల రికార్డుల్లో తప్పుల సవరణకు అవకాశం కల్పించబడినదని, భూమి రిజిస్ట్రేషన్,మ్యూటేషన్‌కు ముందు తప్పనిసరిగా భూమి సర్వే జరిపించి మ్యాప్ తయారు చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. మ్యుటేషన్ ఫీస్ క్రింద ఎకరాకు 2500 రూపాయలు ఉంటుందన్నారు. ప్రస్తుతం 12-10-2020 నుండి 10-11-2020 వరకు పెండింగ్‌లో ఉన్న సాదా బైనామాల దరఖాస్తుల పరిష్కారం ఈ చట్టం ద్వారా వేగవంతం కావడంతో పాటు, వారసత్వ భూముల మ్యూటేషన్‌ను గడువులో పూర్తి చేయడం, హక్కుల సంక్రమణను అధికారికంగా నమోదు చేయడం ద్వారా వ్యవస్థ మరింత నిబద్ధతతో పని చేస్తుందని కలెక్టర్ తెలిపారు.భూ సమస్యల పరిష్కారానికి రెండు అంచెల అప్పీల్ వ్యవస్థ, రైతులకు న్యాయబద్ధమైన మార్గం కల్పిస్తోందని తెలిపారు. ఇంటి స్థలాలు, ఆబాది, వ్యవసాయేతర భూములకు హక్కుల రికార్డులతో వ్యవస్థను సమగ్రంగా అభివృద్ధి చేయడంతో పాటు, భవిష్యత్తులో పేద రైతులకు ఉచిత న్యాయ సహాయం అందించే దిశగా చర్యలు తీసుకొవడం జరుగుతుందని తెలిపారు.గ్రామ రెవెన్యూ రికార్డుల నిర్వహణను శాస్త్రీయంగా చేస్తూనే, మోసపూరితంగా పొందిన ప్రభుత్వ భూములపై పట్టాలను రద్దు చేసే అధికారం ఈ చట్టం ద్వారా కల్పించబడిందని,భూ భారతి రైతుల సమస్యలకు శాశ్వత పరిష్కారంగా నిలుస్తోందని అన్నారు.గ్రామాల్లో మండల వ్యవసాయాధికారుల సహకారంతో రైతు వేదికల వద్ద రెవెన్యూ సదస్సులు నిర్వహణ చేసి, ఈ చట్టంపై అవగాహన కార్యక్రమాలు చేపడతామని, భూ సమస్యల పరిష్కారానికి ఎంతో వెసులుబాటు కల్పించే భూభారతి చట్టంపై అవగాహనను ఏర్పర్చుకోవాలని, దీనిని పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని రైతులకు సూచించారు.జిల్లాకు ఒక మండలాన్ని పైలెట్ మండలంగా ఎంపిక చేసి ఈ చట్టాన్ని అమలు చేయడం జరుగుతుందని తెలిపారు.రంగారెడ్డి జిల్లాలో కొందుర్గు మండలాన్ని పైలెట్ ప్రాజెక్ట్ మండలంగా ఎంపిక చేయడం జరిగిందని తెలిపారు.కొందుర్గు మండలాన్ని జిల్లాకు మోడల్ మండలంగా తీర్చిదిద్దాలని అందుకు అధికారులకు ప్రతి గ్రామ ప్రజలు రైతులు తమ సహకారాన్ని అందించాలని ఆయన కోరారు.
షాద్ నగర్ శాసన సభ్యులు వీర్లపల్లి శంకర్ మాట్లాడుతూ ధరణి రైతు పట్ల ఒక భూతంలా మారి రైతులకు ఇబ్బందులను, సమస్యలు తీసుకు వచ్చిందని, ఇచ్చిన మాట ప్రకారం ధరణిని తొలగించి దాని స్థానంలో భూ భారతి నూతన చట్టాన్ని ప్రభుత్వం తీసుకొచ్చిందని అన్నారు. భూ సమస్యలు పరిష్కరించేందుకు భూ భారతి చట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకు వచ్చిందని, ప్రతి ఒక్క రైతుకు కొత్త చట్టంపై అవగాహన కల్పించేందుకు ఈ సదస్సులు ఏర్పాటు చేసి అవగాహన కల్పించడం జరుగుతుందని తెలిపారు.ప్రతి ఒక్క రైతు సంఘాలతో, రెవెన్యూ మేధావులతో చర్చించి, ప్రజాభిప్రాయ సేకరణ తీసుకుని కులాకంషంగా చర్చించి భూభారతి చట్టాన్ని తీసుకొచ్చిందని అన్నారు.ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బాబార్, ఆర్డీవో సరిత, తహసిల్దార్లు, రైతులు, రైతు సంఘాల నాయకులు తదితరులు, సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
