- ఫార్మ్ హౌస్ లో పడుకుని ఏం సందేశం ఇస్తున్నారు?
- పదేండ్లు మేమే అధికారంలో ఉంటాం.. ఆ పదేండ్లు నువ్వు ఫాంహౌజ్ లోనే ఉంటావు.
- నీ చరిత్ర ఫార్మ్ హౌస్ లోనే పరిసమాప్తం అవుతుంది.
- ప్రభుత్వం నుండి జీత భత్యాలు తీసుకుంటూ ప్రజా సమస్యలను విస్మరిస్తారా..?
- బహిరంగ సభలో నా పేరు ఎత్తడానికీ మీకు ధైర్యం రాలేదు.
- పదేండ్ల మీ దోపిడిపై చర్చకు సిద్ధమా..?
- వరంగల్ సభతో నీ పాపాలు తుడిచుకొనిపోవు.
- బసవేశ్వర జయంతి వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి.
ముద్ర, తెలంగాణ బ్యూరో : ప్రజా సమస్యలపై చర్చించేందుకు అసెంబ్లీకి రాని కేసీఆర్ కు ప్రతిపక్ష హోదా ఎందుకని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ఏనాడైనా అసెంబ్లీకి వచ్చి సభలో ప్రజల సమస్యలు ఏదైనా ప్రస్తావించారా..? మా ప్రభుత్వ లోపాలు చెప్పావా..? మంచిని అభినందించావా..? అని నిలదీశారు.ప్రభుత్వం నుంచి జీతాలు, ఇతర అన్ని వసతులు అనుభవిస్తూ ప్రతిపక్ష పాత్ర పోషించకపోతే ఎలా అని మండిపడ్డారు.ఎక్కడైనా ఎవరైనా ప్రభుత్వం నుండి జీతం తీసుకుంటూ ఇంట్లో నుండి కాలు కదపకుండా అన్ని వసతులు అనుభవిస్తున్నారా అని ప్రశ్నించారు.సభకు రాకుండా, ప్రతిపక్ష హోదా నిర్వర్తించకుండా ప్రజల సంక్షేమానికి పాటుపడుతున్న ప్రభుత్వాన్ని విమర్శించాలని ఏ చట్టంలో ఉందో చెప్పాలని డిమాండ్ చేశారు.బుధవారం హైదరాబాద్ లోని రవీంద్రభారతిలో పదవ తరగతి పరీక్ష ఫలితాలను విడుదల చేసిన అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన మహాత్మ బసవేశ్వర జయంతి ఉత్సవాల్లో సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగించారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ అసెంబ్లీకి రాని కేసీఆర్ తన పిల్లల్ని పంపిస్తా అని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ఇంత దానికి కేసీఆర్ ప్రతిపక్ష నాయకుడిగా ఉండడం ఎందుకని ప్రశ్నించారు. అదే సమయంలో ప్రభుత్వాన్ని ప్రశ్నించే, విమర్శించే హక్కు కూడా ఆయనకు లేదని స్పష్టం చేశారు.15 నెలల నుంచి తన ఫార్మ్ హౌస్ లోనే పడుకున్న కేసీఆర్.. సమాజానికి ఏం సందేశం ఇస్తున్నారని నిలదీశారు. అధికారంలో ఉంటే చెలాయిస్తాం లేదంటే అసెంబ్లీకే రాను అంటే ఎలా అని చురకలంటించారు.వచ్చే పదేళ్లు తామే రాష్ట్రంలో అధికారంలో ఉంటామని సీఎం ధీమా వ్యక్తం చేశారు.అదే పదేళ్లు కేసీఆర్ ఫార్మ్ హౌస్ లోనే ఉంటారని సెటైర్లు వేశారు. కేసీఆర్ చరిత్ర ఆయన ఫార్మ్ హౌస్ లోనే పరిసమాప్తం అవుతుందని ఎద్దేవా చేశారు.పదేండ్ల పాలనలో కేసీఆర్ కుటుంబం రాష్ట్రాన్ని అన్ని విధాలుగా దోచుకుందని సీఎం ఆరోపించారు.ఏ రంగంపై చర్చిద్దామో చెప్పాలని సవాల్ విసిరారు.నిండు సభలో తాను చర్చకు సిద్ధమన్నారు. ప్రతిపక్ష నాయకుడిగా తమ నిర్ణయాల్లో ఉన్న తప్పులు చెబితే వాటిని సరిదిద్దుకుంటామని సీఎం చెప్పారు.అదే సమయంలో వరంగల్ సభలో కేసీఆర్ కాంగ్రెస్ ను విలన్ గా అభివర్ణించడాన్ని రేవంత్ రెడ్డి తప్పు పట్టారు.ఏడు దశాబ్దాల కలను నెరవేరుస్తూ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చినందుకు కాంగ్రెస్ విలన్ అయిందా? మరెందుకు విలన్ అయిందో చెప్పాలని నిలదీశారు.కాంగ్రెస్ తెలంగాణ ఇస్తే పదేళ్లు దోచుకుని మళ్లీ మా పార్టీని, మమ్మల్ని విలన్ అంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.కాంగ్రెస్ తెలంగాణ ఇస్తే కేసీఆర్ దాన్ని ఆగం చేశారని చెప్పారు.ఇప్పటికైనా విషం చిమ్మే మాటలు మానుకోవాలని సీఎం హితవుపలికారు.వరంగల్ సభలో ప్రసంగించిన కేసీఆర్ గత ప్రభుత్వ పథకాలు ఆగిపోయాయని అసత్య ప్రచారాలు చేస్తున్నారని సీఎం మండిపడ్డారు.రైతుబంధు, రుణమాఫీ, ప్రజాపాలన ఆగిందా అని ప్రశ్నించారు.తాము సంక్షేమం, అభివృద్ధిపై దృష్టి పెట్టామని అవి కేసీఆర్ కు కనబడటం లేదా అని నిలదీశారు.వరంగల్ సభతో కేసీఆర్ తన పాపాలు కడుక్కోవాలని చేశారని సెటైర్లు వేశారు. కాని చేసిన పాపాలు ఊరికే పోవన్న సీఎం ఇంకా అనుభవించాల్సింది ఉందని కీలక వ్యాఖ్యలు చేశారు. వరంగల్ సభ మొత్తంలో కేసీఆర్ కు తన పేరు ఎత్తడానికి కూడా ధైర్యం రాలేదని సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.దాన్ని బట్టి కాంగ్రెస్ కార్యకర్తల బలం ఏంటో అర్థం చేసుకోవాలన్నారు.విప్లవకారుడు అంటే తుపాకీ పట్టుకోవాల్సిన అవసరం లేదని, విప్లవాత్మక మార్పు తెచ్చే ఎవరైనా విప్లవకారుడని సీఎం వ్యాఖ్యానించారు. రాహుల్ గాంధీ పై బసవేశ్వరుడు ప్రభావం ఎక్కువని రేవంత్ రెడ్డి అన్నారు.ప్రభుత్వ తప్పిదాలు సరిదిద్దేలా ప్రతిపక్ష వ్యవస్థ ఏర్పాటు చేసుకున్నామని చెప్పారు. అలాగే ప్రజల అభివృద్ధి జీవన ప్రమాణాలు పెంచేలా రాజ్యాంగం ఏర్పాటు చేసుకున్నామన్నారు.
