Take a fresh look at your lifestyle.

ఆకాశ మార్గాన అందాల సోమశిలకు.. హేలీ టూరిజం సేవలు ప్రారంభం

 

ముద్ర ప్రతినిధి నాగర్ కర్నూల్:

కొల్లాపూర్, కృష్ణానది పరవళ్లు, నల్లమల అరణ్యాల సోయగాలు ఆకాశ మార్గం నుంచి వీక్షించే అద్భుత అవకాశం పర్యాటకులకు అందుబాటులోకి రానుంది. పర్యాటక రంగంలో కొత్త అడుగులు వేస్తూ సోమశిల–శ్రీశైలం క్షేత్రాల మధ్య ‘హేలీ టూరిజం’ సేవలను ఈ నెల 9వ తేదీ నుంచి ప్రారంభించనున్నట్లు రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు వెల్లడించారు.
శనివారం కొల్లాపూర్‌లోని తన క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, హైదరాబాద్‌ నుంచి ప్రారంభమయ్యే ఈ హెలికాప్టర్ ప్రయాణం సోమశిల మీదుగా శ్రీశైలం వరకు సాగుతుందని తెలిపారు.
సోమశిల చేరుకున్న తర్వాత పర్యాటకులు కృష్ణానదిలో బోటింగ్ చేస్తూ ప్రకృతి అందాలను ఆస్వాదించవచ్చని, అనంతరం శ్రీశైలంలోని మల్లికార్జున స్వామిని దర్శించుకుని తిరిగి హైదరాబాద్ చేరుకునేలా పర్యటనను రూపొందించినట్లు వివరించారు. ఈ సేవలను ప్రైవేట్ సంస్థల భాగస్వామ్యంతో అమలు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు.
ఈ ప్రాజెక్ట్ ద్వారా స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
మరిన్ని పర్యాటక ప్రాంతాలకు విస్తరణ భవిష్యత్తులో ఈ హేలీ టూరిజం సేవలను సోమశిలకు మాత్రమే పరిమితం చేయకుండా నాగార్జునసాగర్, రామప్ప, నిజాంసాగర్ వంటి ప్రముఖ పర్యాటక ప్రాంతాలకు విస్తరించనున్నట్లు మంత్రి జూపల్లి కృష్ణారావు వెల్లడించారు. తెలంగాణను దేశంలోనే అత్యుత్తమ పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.

Leave A Reply

Your email address will not be published.