తొలిసారిగా మోడల్ రాకెట్ ప్రయోగం
వేదికగా మారనున్న హనుమకొండ హయగ్రీవాచారి మైదానం
ఇస్రో స్పేస్ ట్యూటర్ శశాంక్ భూపతి నేతృత్వంలో రూపకల్పన
వరంగల్ నిట్, ‘కూడా’ సహకారం
ఈ నెల 28న జాతీయ సైన్స్ దినోత్సవాన నిర్వహణ
ముద్ర, వరంగల్ :
చారిత్రక నగరిగా పేరొందిన ఓరుగల్లు నగర కీర్తి కిరీటంలో త్వరలోనే మరో మణిహారం చేరబోతోంది. ఇప్పటికే పలు పర్యాటక ప్రాంతాలతో విలసిల్లుతున్న… విద్యా, సాంస్కృతిక కేంద్రంగా వెలుగొందుతున్నఈ గడ్డ తొలిసారిగా ఒక మోడల్ రాకెట్ ప్రయోగానికి వేదికకానుంది. జాతీయ సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 28న నిర్వహించ తలపెట్టిన ఈ అద్భుత ఘట్టం, అటు విద్యార్థుల్లో ఇటు సామాన్య ప్రజల్లో అంతరిక్ష విజ్ఞానంపై సరికొత్త ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఇస్రో స్పేస్ ట్యూటర్ , ఏటీడీఆర్ఎల్ వ్యవస్థాపకుడు శశాంక్ భూపతి నేతృత్వంలో రూపొందిన ఈ ప్రాజెక్టుకు వరంగల్ నిట్ , కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ (కుడా) పూర్తి స్థాయిలో సహకారం అందిస్తున్నాయి. కాకతీయ వీరనారి రాణి రుద్రమదేవి సాహసానికి ప్రతీకగా ఈ మోడల్ రాకెట్‌కు ‘రుద్రమ’ అని నామకరణం చేశారు. ఈ నెల 28న హనుమకొండలోని హయగ్రీవాచారి మైదానం ఈ చారిత్రక ప్రయోగానికి వేదిక కానుంది. ఈ ప్రయోగానికి ముందు మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు సైన్స్ , అంతరిక్షంపై విద్యార్థుల కోసం ప్రత్యేక అవగాహన సదస్సును నిర్వహిస్తారు. ఈ సదస్సు ముగిసిన వెంటనే ‘రుద్రమ’ రాకెట్ నింగిలోకి దూసుకెళ్లనుంది. విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథాన్ని పెంచడానికి , భవిష్యత్తులో అంతరిక్ష పరిశోధనల వైపు వారిని ప్రోత్సహించడానికి ఈ కార్యక్రమం ఎంతగానో దోహదపడుతుందని నిర్వాహకులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో కేవలం రాకెట్ ప్రయోగంతోనే ఆగకుండా, ఖగోళ ప్రియుల కోసం మరిన్ని ఏర్పాట్లు చేశారు. ఈ నెల 15వ తేదీ నుండి 27వ తేదీ వరకు ప్రతిరోజూ సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 11 గంటల వరకు భద్రకాళి ట్యాంక్ బండ్‌పై ప్రత్యేకంగా టెలిస్కోపులను ఏర్పాటు చేస్తున్నారు. దీంతోనక్షత్రాలను, గ్రహాలను వీక్షించే (స్టార్ గేజింగ్) అరుదైన అవకాశం నగరవాసులకు కలగనుంది. ఈ కార్యక్రమాలన్నింటిలో పాల్గొనేందుకు పాఠశాల , కళాశాల విద్యార్థులకు, ఆసక్తి ఉన్నవారికి ఉచిత ప్రవేశం కల్పించనున్నారు. మొత్తానికి వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ సహకారంతో జరుగుతున్న ఈ వేడుకలు నగరంలో సైన్స్ పై కొత్త చర్చకు దారితీస్తున్నాయి.