ముద్ర, సంగారెడ్డి:
అమలుకు నోచుకోని హామీలు, వాగ్దానాలు, గ్యారంటీలతో గద్దెనెక్కి… వాటిని ఎగ్గొట్టిన సీఎం రేవంత్ రెడ్డి అసలైన నకిలీ అని మాజీమంత్రి హరీశ్ రావు విమర్శించారు. రాష్ట్రంలో అసలు ఎవరో, నకిలీ ఎవరో ప్రజలందరికీ తెలుసన్నారు. హామీలు ఇచ్చి అమలు చేసిన కేసీఆర్ అసలు అన్న హరీశ్ రావు… రూ 4వేల పెన్షన్, రూ. 2500 మహాలక్ష్మి, నిరుద్యోగ భృతి, తులం బంగారం.. ఏదీ ఇవ్వకుండా మోసం చేసిన రేవంత్ రెడ్డి నకిలీ అని చురకలంటించారు.. కమీషన్ల కోసం కాంట్రాక్టర్లకు రూ40వేల కోట్లు ఇవ్వడానికి ఉన్నాయి కానీ.. ఉద్యోగులకు, పేదలకు ఇవ్వడానికి రేవంత్ దగ్గర డబ్బులు లేవని విమర్శించారు. గల్లీల్లో పారే మురుగు నీరు కన్నా.. రేవంత్ రెడ్డి నోటి నుంచి వచ్చే మురికి మాటలు మరింత కంపు కొడుతున్నాయని మండిపడ్డారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం ఆయన సంగారెడ్డి పట్టణంలో పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ సాధిస్తానంటే సాధించి చూపించింది కేసీఆరే అన్నారు. రూ. 2వేల పింఛన్ ఇస్తానని చెప్పి మాట నిలబెట్టుకున్నది కేసీఆర్ అన్నారు. కల్యాణ లక్ష్మి కింద రూ.లక్ష, కేసీఆర్ కిట్ కింద రూ. 13వేలు ఇచ్చి చూపించింది కేసీఆరే అన్నారు. ఇదీ అసలు నాయకుడి లక్షణం అన్నారు. సంగారెడ్డి పట్టణ అభివృద్ధి కేసీఆర్ హయాంలోనే జరిగిందన్న ఆయన రూ. 34 కోట్లతో ఇంటింటికి మంచినీళ్లు ఇచ్చి అక్కచెల్లెళ్ల కష్టాలు తీర్చామన్నారు. చౌరస్తా నుండి పాత బస్టాండ్ వరకు రోడ్లు, లైట్లు, డివైడర్లు అభివృద్ధి చేసింది కేసీఆర్ ప్రభుత్వంలోనే అన్నారు. సంగారెడ్డికి మెడికల్ కాలేజ్, నర్సింగ్ కాలేజ్ మంజూరు చేశారన్నారు. టీయూఎఫ్ ఐడీసీ కింద రూ. 50 కోట్లు, ఎస్ డీ ఎఫ్ కింద రూ. 25 కోట్లు ఇచ్చి సంగారెడ్డిని అభివృద్ధి చేశామన్నరు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రెండున్నరేళ్లయినా సంగారెడ్డిలో ఎక్కడా ఒక్క రూపాయి పని జరగలేదన్నారు. ఇప్పుడు ఎన్నికల కోసం శాంక్షన్లు, టెండర్లు లేకుండా కొబ్బరికాయలు కొట్టి ప్రజలను మభ్యపెడుతున్నారని ఆరోపించారు. రెండేళ్లలో రూ. ఎనిమిది కూడా ఇవ్వని వాళ్లు ఇప్పుడు వార్డుకు రూ. 8 కోట్లు ఇస్తారంటే ఎవరు నమ్ముతారన్నారు. రేవంత్ రెడ్డిది కమీషన్ల ప్రభుత్వమనీ రూ. 95 వేల కోట్ల టెండర్లు పిలిచి డబ్బులు ఇవ్వడానికి ఉన్నాయన్నారు. రూ. 40వేల కోట్లు కాంట్రాక్టర్లకు మిత్రులందరికీ కమిషన్లు తీసుకోవడానికి డబ్బులు ఉన్నాయి కానీ.. రిటైర్డ్ ఉద్యోగులకు, పీఆర్సీ, డిఏ బకాయిలు ఇవ్వడానికి మాత్రం డబ్బులు లేవా అని ప్రశ్నించారు.