Take a fresh look at your lifestyle.

నాంపల్లి ఫోరెన్సిక్ ల్యాబ్ అగ్నిప్రమాదంపై కేటీఆర్‌ సిట్టింగ్ జడ్జీ విచారణ డిమాండ్

నాంపల్లి ప్రమాదంపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలి
ఓటుకు నోటు నుంచి తప్పించుకునేందుకు సీఎం కుట్ర
తాను తప్పించుకోవడానికి మిగతా కేసుల ఆధారాలూ కాల్చేశారు
ప్రమాద ఘటనపై లాబొరేటరీ డైరెక్టర్ తూతూమంత్ర వివరణ
బీఆర్‌ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌

ముద్ర, హన్మకొండ :

నాంపల్లిలోని ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ అగ్నిప్రమాదం వెనుక కుట్ర ఉందని బీఆర్‌ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అనుమానం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్‌ రెడ్డినే ఆ ల్యాబ్‌ను తగులబెట్టించాడని ప్రజలంతా భావిస్తున్నారని తెలిపారు. ఓటుకు నోటు కేసు నుంచి తప్పించుకోవడానికే ఆయన ఈ ప్రమాదం చేయించారని అనుమానం వ్యక్తం చేశారు. ఆదివారం హనుమకొండ జిల్లా కేంద్రంలో ఆయన మీడియాతో మాట్లాడారు. మున్సిపల్ ఎన్నికల్లో అందరూ బిజీగా ఉండడంతో ఇదే అదునుగా భావించిన సీఎం.. ఈ కుట్రకు పాల్పడ్డారని ఆరోపించారు. పక్కా ప్లాన్‌తో ఆధారాలు మాయం చేశారని విమర్శించారు. తాను తప్పించుకోవడానికి మిగతా కేసులకు సంబంధించిన ఆధారాలు కూడా దెబ్బతినేలా ఆగ్రహం వ్యక్తం చేశారు. అగ్నిప్రమాద ఘటనపై ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ డైరెక్టర్ తూతూమంత్రంగా వివరణ ఇచ్చారని విమర్శించారు. నేరాల విచారణలో ఫోరెన్సిక్‌ కీలక విభాగమన్న కేటీఆర్‌.. వేలాది కేసుల వివరాలు అగ్గికి బుగ్గి అయ్యాయని పేర్కొన్నారు. ఈ ప్రమాదం తర్వాత ఎంతోమంది క్రిమినల్స్‌ తప్పించుకునే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ అగ్ని ప్రమాద ఘటనపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. మూడు అంతస్థుల భవనంలో మంటలను ఆర్పేందుకు మూడు గంటల సమయం పడుతుందా? అని ప్రశ్నించారు. దాంతో పాటు ప్రమాద సమయంలో డ్యూటీలో కూడా ఎవరూ లేకపోవడం అనేక అనుమానాలకు తావిస్తోందన్నారు. స్వయంగా సీఎం చేతిలో ఉన్న శాఖలో ఇలా జరగడం చరిత్రలో తొలిసారి అన్నారు. విచారణ చివరి దశకు చేరుకోవడంతో సాక్ష్యాలు మాయం చేశారని ఆరోపించారు. రేవంత్ రెడ్డితో బీజేపీకి లాలాచీ లేకపోతే దీనిపై విచారణ జరిపించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.

Leave A Reply

Your email address will not be published.