Take a fresh look at your lifestyle.

ముగిసిన పీఐబీ హైదరాబాద్ మీడియా ప్రతినిధుల బృందం అయిదు రోజుల ఒడిశా పర్యటన

ఒడిశా అభివృద్ధి పథకాలను పరిశీలించిన మీడియా బృందం
గవర్నర్‌తో భేటీ అయిన మీడియా ప్రతినిధులు
హైదరాబాద్, 2026 ఫిబ్రవరి 09:
హైదరాబాద్‌ పత్రికా సమాచార కార్యాలయం (పీఐబీ) నేతృత్వంలో తెలంగాణకు చెందిన ఆరుగురు సభ్యుల మీడియా ప్రతినిధుల బృందం ఒడిశాలోని భువనేశ్వర్‌లో అయిదు రోజుల అధికారిక పర్యటనను ముగించుకుంది.
భువనేశ్వర్‌లోని లోక్ భవన్‌లో ఒడిశా గవర్నర్ డాక్టర్ హరిబాబు కంభంపాటితో జరిగిన మర్యాదపూర్వక భేటీతో ఈ పర్యటన శుక్రవారం నాడు ముగిసింది.
కేంద్ర ప్రభుత్వ కీలక అభివృద్ధి కార్యక్రమాలపై మీడియా ప్రతినిధులకు ప్రత్యక్ష అవగాహన కల్పించడంతో పాటు ఒడిశా సాంస్కృతిక వారసత్వం, మౌలిక సదుపాయాల వృద్ధి, పరిశోధనా సంస్థలను గురించి తెలియజేయాలనే లక్ష్యంతో పీఐబీ- హైదరాబాద్ ఈ పర్యటనను ఏర్పాటు చేసింది. మీడియా ప్రతినిధి బృందానికి భువనేశ్వర్‌ పీఐబీ, సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ అదనపు డైరెక్టర్ జనరల్ శ్రీ అఖిల్ కుమార్ మిశ్రా స్వాగతం పలికారు. ఆయన రాష్ట్ర మీడియా రంగం, ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమాల గురించి వివరించారు.
అయిదు రోజుల పర్యటనలో భాగంగా సెంట్రల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫ్రెష్‌ వాటర్ ఆక్వాకల్చర్ (సీఐఎఫ్ఏ), ఇనిస్టిట్యూట్ ఆఫ్ మినరల్స్ అండ్ మెటీరియల్స్ టెక్నాలజీ (ఐఎంఎంటీ) వంటి ప్రముఖ సంస్థలను మీడియా ప్రతినిధుల బృందం సందర్శించింది. వీటితో పాటు కళాభూమి ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ మ్యూజియం, లింగరాజ దేవాలయం, ధౌలి శాంతి స్తూపం, యునెస్కో ప్రపంచ వారసత్వ సంపద అయిన కోణార్క్ సూర్య దేవాలయం, రఘురాజ్‌పూర్ సాంస్కృతిక కళల గ్రామం, పూరీలోని జగన్నాథ ఆలయంతో సహా ప్రధాన వారసత్వ, సాంస్కృతిక ప్రాంతాలను సందర్శించిన ప్రతినిధులు.. ఒడిశాకు ఉన్న గొప్ప వాస్తు శిల్ప కళలు, మతపరమైన- సాంస్కృతిక సంప్రదాయాలపై అవగాహన పెంచుకున్నారు.
అయిదు రోజుల పర్యటన లోక్ భవన్‌లో ఒడిశా గవర్నర్ డాక్టర్ హరిబాబు కంభంపాటి‌తో జరిగిన మర్యాదపూర్వక భేటీతో ముగిసింది. ఇక్కడ ఉన్నతాధికారులతో సంభాషించిన మీడియా ప్రతినిధులు..  క్షేత్రస్థాయి పర్యటన అనుభవాలను పంచుకున్నారు. ఒడిశా సాధిస్తోన్న స్థిరమైన ఆర్థిక వృద్ధిని, 1.30 లక్షల కోట్ల రూపాయలకు మించిన ప్రధాన మౌలిక సదుపాయాల పెట్టుబడులను, అన్ని జిల్లాలకు రైల్వే అనుసంధానాన్ని కల్పించటం, ఓడరేవులు, రహదారులు, పారిశ్రామిక కారిడార్ల అభివృద్ధి గురించి గవర్నర్ ప్రముఖంగా ప్రస్తావించారు. చిరుధాన్యాల ఉత్పత్తి, ఖనిజ ఆధారిత పరిశ్రమల విషయంలో రాష్ట్రం చూపిస్తున్న నాయకత్వాన్ని ప్రధానంగా పేర్కొన్న ఆయన.. ఐఐటీ, ఎయిమ్స్, నైజర్, వరల్డ్ స్కిల్ సెంటర్ వంటి విద్యా, నైపుణ్యాభివృద్ధి సంస్థల వృద్ధి గురించి చెప్పారు.

Leave A Reply

Your email address will not be published.