ముద్ర ప్రతినిధి, నాగర్ కర్నూల్
నాగర్ కర్నూల్: ప్రమాదం జరిగిన తరువాత మొదటి గంట (గోల్డెన్ అవర్) అత్యంత కీలకమని జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ పేర్కొన్నారు. ప్రమాద బాధితులను గోల్డెన్ అవర్‌లో ఆసుపత్రికి చేర్చిన వారికి కేంద్ర ప్రభుత్వ పథకమైన “రాహ్-వీర్” ద్వారా ప్రోత్సాహకాలు అందజేయబడతాయని తెలిపారు.

తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ప్రజా పాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహిస్తున్న “అరైవ్–అలైవ్” అవగాహన కార్యక్రమాల సందర్భంగా, అదనపు ఎస్పీ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో శుక్రవారం జిల్లా పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో సిపిఆర్, గోల్డెన్ అవర్‌పై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కలెక్టర్ బాదావత్ సంతోష్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆర్టీసీలో గత 30 సంవత్సరాలుగా ఎలాంటి ప్రమాదం చేయకుండా సేవలందిస్తున్న డ్రైవర్ సురేందర్ రెడ్డి ను కలెక్టర్ మరియు అదనపు ఎస్పీ ఘనంగా సత్కరించారు.
అదనపు ఎస్పీ ఎన్. వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, ప్రమాదం జరిగిన వెంటనే బాధితులను గోల్డెన్ అవర్‌లో ఆసుపత్రికి తరలిస్తే ప్రాణాలను కాపాడవచ్చని తెలిపారు. బాధితుని ఎడమచేతి నాడి (పల్స్) పరిశీలించి, పల్స్ లేకపోతే వెంటనే సిపిఆర్ చేయాలని సూచించారు. 18 సెకండ్లలో సుమారు 30 సార్లు ఛాతిపై ఒత్తిడి ఇవ్వడం, అవసరమైతే నోటి ద్వారా శ్వాస అందించడం వంటి ప్రాథమిక చికిత్సా విధానాలను వివరించారు. అనంతరం తక్షణ వైద్య సహాయం అందించేలా ఆసుపత్రికి తరలించాలని సూచించారు.
అలాగే వేసవి కాలంలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో ప్రజలు జాగ్రత్తలు పాటించాలని, వడదెబ్బ నుంచి రక్షణ కోసం అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి, ఆర్టీసీ డిఎం, ఆర్టీవో, నాగర్ కర్నూల్ సబ్‌డివిజన్ డిఎస్పీ శ్రీనివాస్, సీఐలు ఉపేందర్, అశోక్ రెడ్డి, ఆర్ఐ జగన్, ఎస్సైలు గోవర్ధన్, ప్రశాంత్, శివాజీ, కళ్యాణ్, ఆర్టీసీ డ్రైవర్లు, డ్రైవింగ్ యూనియన్ సభ్యులు పాల్గొన్నారు.