Take a fresh look at your lifestyle.

తహశీల్దార్లకు అడ్‌హాక్ ప్రమోషన్లు ఇవ్వండి- సీఎం రేవంత్ కు రెవెన్యూ ఎంప్లాయీస్ సర్వీసెస్ అసోసియేషన్ వినతి

 
రెవెన్యూ శాఖలో 150 మంది తహశీల్దార్లు పదోన్నతుల కోసం ఎదురుచూస్తున్నారు

ముద్ర, తెలంగాణ బ్యూరో :

క్షేత్ర స్థాయిలో ప్రభుత్వ పథకాల అమలు, భూసంబంధిత సమస్యల పరిష్కారం, విపత్తు నిర్వహణ, ఎన్నికల నిర్వహణ వంటి కీలక బాధ్యతలను నిర్వర్తిస్తున్న తహశీల్దార్లకు అడ్‌హాక్ ప్రమోషన్లు మంజూరు చేయాలని తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీస్ సర్వీసెస్ అసోసియేషన్ (ట్రెసా) సీఎం రేవంత్ రెడ్డిని విజ్ఞప్తి చేసింది. రాష్ట్ర రెవెన్యూ శాఖలో సుమారు 150 మంది తహశీల్దార్లు 10 నుంచి 12 సంవత్సరాలకు పైగా పదోన్నతుల కోసం ఎదురుచూస్తున్నరని, పదోన్నతులు నిలిచిపోవడంతో శాఖలో దిగువ స్థాయి అధికారుల ప్రమోషన్లు కూడా స్థబ్దతకు గురయ్యాయని సీఎంకు వివరించింది. ట్రెసా రాష్ట్ర అధ్యక్షులు వంగ రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డికి ప్రతినిధి బృందం మంగళవారం సీఎంను హైదరాబాద్ లోని ఆయన క్యాంప్ కార్యాలయంలో కలిసి వినతిపత్రాన్ని సమర్పించింది. టీఈజేఏసీ నాయకులతో కూడిన ప్రతినిధి బృందం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల కోసం సమగ్ర ఆరోగ్య పథకాన్ని అమలు చేయాలనే నిర్ణయానికి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపింది. ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులకు మెరుగైన వైద్య సేవలు అందించేలా ఆరోగ్య ట్రస్ట్ ఏర్పాటు చేయడం ఒక చారిత్రాత్మక నిర్ణయంగా పేర్కొంది. ఈ సందర్భంగా రెవెన్యూ శాఖలో దాదాపు 632 మంది ఔట్‌సోర్సింగ్ ఆపరేటర్లు గత 20 ఏండ్లుగా సేవలందిస్తున్నారని వివరించింది. భూసంబంధిత రికార్డుల నిర్వహణ, ధరణి వ్యవస్థలో డేటా నమోదు, ప్రజా సేవల అందజేత వంటి కీలక పనులను నిర్వహిస్తున్నారని తెలిపింది. 2026 మార్చి 31 తర్వాత వీరిని కొనసాగించరాదనే ఆదేశాలు తీవ్ర ఆందోళనకు దారి తీశాయన్న ట్రెసా… శాఖలో ఉన్న ఖాళీల దృష్ట్యా వీరి సేవలను కొనసాగించాలని కోరింది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు ఎంతోకాలంగా వేతన సవరణ కోసం ఎదురుచూస్తున్నరని తెలిపింది. పెరుగుతున్న జీవన వ్యయం నేపథ్యంలో వేతన సవరణను త్వరితగతిన అమలు చేయడం ద్వారా లక్షలాది ఉద్యోగులు మరియు పెన్షనర్లకు ఊరట కలిగించవచ్చని ట్రెసా పేర్కొంది. కార్యక్రమంలో ట్రెసా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.గౌతమ్ కుమార్, నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు రమణ్ రెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కార్యదర్శి రామకృష్ణా రెడ్డి పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.