Take a fresh look at your lifestyle.

కాంగ్రెస్ పధకాలు చరిత్రలో నిలిచిపోతాయి

ఉద్యోగులు, పింఛ‌నుదారుల‌కు ఆరోగ్య, బీమా ప‌థ‌కాలు వరం
ఉద్యోగుల పట్ల సీఎం సాహసోపేత నిర్ణయం
సీఎం, మంత్రి దామోదరను కలిసిన తెలంగాణ ఉద్యోగుల జేఏసీ

ముద్ర, తెలంగాణ బ్యూరో :
ఉద్యోగులు, పింఛ‌నుదారుల‌కు ప్రభుత్వం ప్రక‌టించిన ఆరోగ్య, బీమా ప‌థ‌కాలు చ‌రిత్రలో నిలిచిపోతాయ‌ని తెలంగాణ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ వి.ల‌చ్చిరెడ్డి కితాబిచ్చారు. బీమాతో కూడిన ఆరోగ్య ప‌థ‌కం అమ‌లు అనేది రాష్ట్రంలోని ఉద్యోగుల‌కు గొప్ప వ‌రం అన్నారు. ఎన్నో ఏండ్లుగా ఎదురు చూస్తున్న ఉద్యోగుల‌కు అన్ని ర‌కాలుగా దోహ‌ద ప‌డేలా ఆద‌ర్శవంత‌మైన‌ ఆరోగ్య, బీమా ప‌థ‌కాల‌ను ప్రకటించడం హర్షనీయమన్నారు. జేఏసీలోని వివిధ ఉద్యోగ సంఘాల నాయ‌కులు మంగ‌ళ‌వారం హైదరాబాద్ లో సీఎం రేవంత్‌రెడ్డి, ఆరోగ్య శాఖ మంత్రి దామోద‌ర రాజ‌న‌ర‌సింహల‌ను వేర్వేరుగా క‌లిసి రెండు కొత్త ఆరోగ్య, బీమా ప‌థ‌కాలను అమ‌లు చేసేందుకు మంత్రి వ‌ర్గం ఆమోదించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వం రూ.1.20 కోట్ల ప్రమాద బీమాను వ‌ర్తింపజేయ‌డం సాహ‌స‌మన్నారు. రూ.1,056 కోట్ల మూల నిధితో ఉద్యోగుల‌, పెన్షన‌ర్ల ఆరోగ్య ప‌థ‌కం అమ‌లు కూడా మంత్రివ‌ర్గ ఆమోదం తెలుప‌డం చాలా గొప్ప నిర్ణయంగా పేర్కొన్నారు. 652 గుర్తింపు పొందిన ప్రైవేటు, కార్పొరేట్ ఆస్పత్రుల‌లో 1,998 వ్యాధుల‌కు న‌గ‌దు ర‌హిత చికిత్సల‌ను పొందే విధంగా వెసులుబాటు క‌ల్పించింద‌న్నారు. దీనికంత‌టికి తెలంగాణ ఉద్యోగుల జేఏసీ కృషి ఫ‌లిత‌మేన‌న్నారు. ఉద్యోగులంద‌రికీ న‌గ‌దు ర‌హిత ఆరోగ్య ప‌థ‌కాన్ని అమ‌లుతో పాటు అంద‌రికీ డిజిట‌ల్ హెల్త్ కార్డుల‌ను కూడా అందించ‌నున్నట్టుగా మంత్రి దామోద‌ర రాజ‌న‌ర‌సింహ అన్నారు. ఈ ప్రక్రియ‌ను చేప‌ట్టి నెల‌లోపే పూర్తి చేయ‌నున్నట్టుగా తెలిపార‌ని ల‌చ్చిరెడ్డి చెప్పారు. కార్యక్రమంలో ఉద్యోగుల జేఏసీ నాయ‌కులు కె. రామ‌కృష్ణ(డిప్యూటీ కలెక్టర్ల సంఘం), ఎస్‌.రాములు, ర‌మేష్ పాక‌, సీహెచ్‌.శ్రీ‌నివాస్‌,(తెలంగాణ త‌హ‌శీల్దార్స్ అసోసియేష‌న్‌), బాణాల రాంరెడ్డి, వి.భిక్షం(తెలంగాణ రెవెన్యూ స‌ర్వీసెస్ అసోసియేష‌న్‌), డా.నిర్మల‌, ఎల్‌.ద‌శ‌ర‌థ్‌(టీజీసీపీఎస్ఈయూ), గ‌రికె ఉపేంద‌ర్‌రావు(జీపీఓ), సుగంధిని(హెచ్ఎండ‌బ్ల్యూఎస్ అండ్ ఎస్‌డ‌బ్ల్యూ), భూమేష్‌, సునీల్‌ పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.