Take a fresh look at your lifestyle.

ఇంటర్, ఎస్సెస్సీ పరీక్షల్లో 5 నిమిషాల నిబంధన సడలింపు

 
ఐదు నిమిషాల తర్వాత కూడా విద్యార్థులను అనుమతించాలి
జిల్లా కలెక్టర్లు, ఎస్.పీలతో వీడియో కాన్ఫరెన్స్ లో సీఎస్ రామకృష్ణరావు

ముద్ర, తెలంగాణ బ్యూరో :

రాష్ట్రంలో జరగనున్న ఇంటర్మీడియట్, పదో తరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ప్రరీక్ష ప్రారంభం తర్వాత ఐదు నిమిషాల వరకు హాజరయ్యేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు వెల్లడించారు. ఈసారి నిర్ణీత సమయానికన్నా ఐదు నిమిషాల తర్వాత కూడా పరీక్ష కేంద్రాలకు విద్యార్థులను అనుమతిస్తూ నిర్ణయం తీసుకున్నామని దీన్ని దృష్టిలో పెట్టుకుని అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇంటర్, పదో తరగతి పరీక్షల నిర్వహణపై రాష్ట్రంలోని జిల్లా కలెక్టర్లు, ఎస్.పీ లతో మంగళవారం ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ నేటి నుం,చి ఇంటర్, మార్చి 14 నుండి పదో తరగతి పరీక్షలు ప్రారంభమవుతున్నాయని చెప్పారు. ఈ పరీక్షలు ఎలాంటి అవకతవకలు లేకుండా పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్లను ఆదేశించారు. ప్రతీ పరీక్ష కేంద్రం వద్ద పటిష్టమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయాలన్న ఆయన గతంలో ఉన్న వివాదాస్పద పరీక్షా కేంద్రాలపై మరింత విజిలెన్ట్ గా ప్రత్యేక దృష్టి సాధించాలని అన్నారు. ప్రతీ పరీక్ష కేంద్రంలో తాగునీరు, విద్యుత్, టాయిలెట్ ల సౌకర్యాలు కల్పించడంతో పాటు సి.సి టీవీ లను ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రతీ కేంద్రంలో ఒక ఏ.ఎన్.ఎం, ఫస్ట్ ఎయిడ్ కిట్ లను ఏర్పాటు చేయాలని సూచించారు. ఏ ఒక్క విద్యార్థి కూడా నేలపై కూర్చొని పరీక్ష రాయకూడదని అన్ని కేంద్రాలలో బెంచీలు ఏర్పాటు చేయాలని అన్నారు. పరీక్షల నిర్వహణలో పోలీస్, రెవెన్యూ తదితర శాఖల అధికారులతో సమన్వయంతో పనిచేయాలన్నారు. విద్యా శాఖ అధికారులు కాకుండా ఇతర శాఖల అధికారులతో సిట్టింగ్ స్క్వాడ్, ఫ్లయింగ్ స్క్వాడ్ లను ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. రాష్ట్ర విద్య శాఖ కార్యదర్శి యోగితా రాణా మాట్లాడుతూ, ఈ సారి ఇంటర్ పరీక్షలకు 4,89,055 మంది ఫస్ట్ ఇయర్ కు 4,53,832 మంది విద్యార్థులు సెకండ్ ఇయర్ కు హాజరవుతున్నారని అదేవిధంగా 5,28,239 మంది పదవ తరగతి పరీక్షలకు హాజరవుతున్నారని తెలిపారు. పరీక్షా కేంద్రాలకు సెల్ ఫోన్ లు ఇతర ఎలక్ట్రానిక్ గాడ్జెట్ లను అనుమతించడం లేదని కేవలం పరీక్ష కేంద్రం ఛీప్ సూపరింటెండెంట్ కు మాత్రమే ఎమర్జెన్సీ పరిస్థితులలో ఉపయోగించడానికి సెల్ ఫోన్ ను అనుమతిస్తున్నట్టు తెలిపారు. ప్రతీ కేంద్రం వద్ద మొదటి సారిగా క్లోక్ రూమ్ లను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఏపరీక్షా కేంద్రంలో నైనా ఏవిధమైన అవకతవకలకు పాల్పడితే సంబంధిత అధికారులు, సిబ్బంది పై కఠిన చర్యలు చేపట్టనున్నట్టు హెచ్చరించారు. ప్రతీ పరీక్ష ప్రశ్న పత్రానికి ప్రత్యేకంగా క్యూ ఆర్ కోడ్, సీరియల్ నెంబర్ ఉంటుందని పరీక్ష ప్రారంభానికి 15 నిమిషాల ముందుగా మాత్రమే ప్రశ్నా పత్రాలను ఓపెన్ చేయాలని స్పష్టం చేసారు. ఈసారి మొదటి సారిగా విద్యార్థుల హాల్ టికెట్లను వాట్సాప్ ద్వారా పంపడమే కాకుండా వెబ్‌సైట్ ద్వారా డౌన్ లోడ్ చేసుకునే సౌకర్యాన్ని కల్పించామని వెల్లడించారు. కాగా, రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మాణాల విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపాలని కలెక్టర్లను ఆదేశించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో విద్యా శాఖ కార్యదర్శి యోగితా రాణా, ఇంటర్ బోర్డు కార్యదర్శి కృష్ణ ఆదిత్య , పాఠశాల విద్యా శాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ లు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.