Take a fresh look at your lifestyle.

ఆఖరి పోరాటం

సరిహద్దు అడవుల్లో ఆపరేషన్ కగార్‌-2
2 వేల మంది బలగాలతో అగ్రనేతల కోసం వేట
ఈసారి అంతిమ పోరాటం అంటున్న కేంద్రం
మరోసారి ఎన్ కౌంటర్.. ఐదుగురు హతం

ముద్ర, తెలంగాణ బ్యూరో :
కేంద్ర ప్రభుత్వం నిర్దేశించుకున్న మార్చి 31 గడువు దగ్గర పడుతోంది. కేవలం ఇంకో నలభై రోజులు మాత్రమే మిగిలి ఉంది. అందుకే ఈలోపు ఉన్న మావోయిస్టులను తుదముట్టించాలని ప్రభుత్వం ఆపరేషన్‌ను తీవ్రం చేసింది.
దేశం నుంచి వామపక్ష తీవ్రవాదాన్ని పూర్తి స్థాయిలో తుడిచి పెట్టాలనే కేంద్ర ప్రభుత్వ మిషన్ -2026 గడువు సమీపిస్తున్న వేళ తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో వాతావరణం వేడెక్కింది. మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా భద్రతా బలగాలు అత్యంత వ్యూహాత్మకమైన ఆపరేషన్ కగార్‌ను పునఃప్రారంభించాయి. ఈసారి కర్రె గుట్టల హిల్స్‌ను టార్గెట్ చేసుకున్నట్టు సమాచారం. అందుకే దీనికి ఆపరేషన్ కేజీహెచ్‌-2ను ప్రారంభించాయి. ఒకవైపు సరిహద్దుల్లో రెండు వేల మంది సాయుధ బలగాల మోహరించారు. మరోవైపు ఉమ్మడి వరంగల్‌ జిల్లా అటవీప్రాంతాల్లో అగ్రనేత బడే చొక్కారావు, అలియాస్‌ దామోదర్‌తోపాటు బడానేతలు సంచరిస్తున్నారనే సమాచారరంతో పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. దీంతో ఏజెన్సీ ప్రాంతాల్లో భారీ సంఖ్యలో బలగాలు కూంబింగ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నాయి.

అగ్రనేతలే లక్ష్యంగా భారీ వ్యూహం
కేంద్ర ప్రభుత్వం నిర్దేశించుకున్న మార్చి 31 గడువు దగ్గర పడుతోంది. కేవలం ఇంకో నలభై రోజులు మాత్రమే మిగిలి ఉంది. అందుకే ఈలోపు ఉన్న మావోయిస్టులను తుదముట్టించాలని ప్రభుత్వం ఆపరేషన్‌ను తీవ్రం చేసింది. సీఆర్‌పీఎఫ్‌, ఛత్తీస్‌గఢ్ పోలీసులు సంయుక్తంగా ఆపరేషన్ కేజీహెచ్‌-2 చేపడుతున్నాయి. ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్‌ జిల్లా నంబి ప్రాంతం నుంచి వ్యాపించి ఉన్న కర్రెగుట్టల అడవుల్లో ఈ వేట కొనసాగిస్తున్నారు. మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శి దేవ్‌జి అలియాస్‌ చేతన్, జూనియర్ క్యాడర్‌కు చెందిన బెటాలియన్ ఇన్‌ఛార్జి కేసా సోధీ, బడే చొక్కారావులాంటి పెద్ద తలకాయలను పట్టుకోవడమే లక్ష్యంగా రెండు వేలకుపైగా బలగాలతో అడవిలో అణువణువూ గాలింపు చర్యలు చేపట్టారు. గతేడాది ఏప్రిల్‌లలో ఇదే ర్రెగుట్టల్లో నిర్వహించిన 21రోజుల సుదీర్ఘ ఆపరేషన్‌లో 31 మంది మావోయిస్టులను హతమార్చారు. కానీ అగ్రనేతలు మాత్రం తప్పించుకున్నారు. ఈసారి వారిని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టకూడదనే పట్టుదలతో బలగాలు ఉన్నాయి. ప్రస్తుతానికి తడపల, పామునూరు, మురుమూరు, డోలి వంటి ప్రాంతాల్లో నిరంతర నిఘా పెట్టార.

సరిహద్దుల్లో దామోదర్‌ కోసం వేట
తెలంగాణలోని ములుగు, జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాల సరిహద్దుల్లో బడే చొక్కారావు అలియాస్‌ దామోదర్ షెల్టర్ తీసుకున్నారని పక్కా సమాచారం అందింది. అందుకే ఈ ప్రాంతాల్లో కూడా హై అలర్ట్ ప్రకటించారు. దామోదర్‌ స్వస్థలమైన తాడ్వాయి మండలం నార్లాపూర్ గ్రామంపై పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు. ఆ గ్రామం నుంచి కీలక సమాచారం బయటకు వెళుతుందని అనుమానంతో నిఘా విభాగం, గ్రేహౌండ్స్ దళాలు అప్రమత్తమయ్యాయి. పెద్దాపూర్, కొప్పుగుట్ట, గండికామారం వంటి ప్రాంతాల్లో కూంబింగ్‌ నిర్వహిస్తున్నారు.

గ్రేహౌండ్స్‌- ఎస్ఐబీ రంగ ప్రవేశం
రాష్ట్రంలోని అత్యంత శక్తిమంతమైన నిఘా విభాగం, గ్రేహౌండ్స్ దళాలు ఈ ఆపరేషన్‌లో భాగస్వామ్యం అయ్యాయి. ముత్తారం మండలంలోని సర్వాయిపేట అడవుల నుంచి ఇతర ప్రాంతాల వరకు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. అడ్డగుట్ట అడవుల్లో సాయుధ బలగాలు మ తాత్కాలిక స్థావరాలను ఏర్పాటు చేసుకున్నాయి. ప్రధాన రహదారుల మీద చెక్‌పోస్టుల ఏర్పాటు చేసి ప్రతి వాహనాన్ని తనిఖీ చేస్తున్నారు.

మళ్లీ ఎన్ కౌంటర్..
తెలంగాణ-ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దులోని కర్రెగుట్ట అటవీ ప్రాంతంలో ఎదురుకాల్పుల్లో ఐదుగురు మావోయిస్టులు మృతి చెందారు. మావోయిస్టు అగ్రనేత, కార్యదర్శి దేవ్‌జీ సహా కీలక నేతలు ఈ ప్రాంతంలో ఉన్నారన్న పక్కా సమాచారంతో బలగాలు వెళ్లాయి. అగ్రనేతల కోసం ‘ఆపరేషన్ కగార్-2’లో భాగంగా కూంబింగ్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ ఎన్‌కౌంటర్‌లో ఐదుగురు మావోయిస్టులు మృతి చెందారు. మృతుల్లో మావోయిస్టు అగ్ర నేతలు ఉన్నట్టుగా సమాచారం. ఆపరేషన్ కగార్ 2 పేరుతో కర్రెగుట్టలో భద్రతా బలగాల కూంబింగ్ చేస్తున్నాయి. మావోయిస్టు అగ్ర నేతలే టార్గెట్‌గా ఆపరేషన్ కగార్ 2 నడుస్తోంది. ఆపరేషన్ కగార్‌ డెడ్‌లైన్ ఇంకా 40 రోజులే మిగిలి ఉంది. దీంతో ఛత్తీస్‌గఢ్ పోలీసులు, సీఆర్పీఎఫ్ బలగాలతో కూంబింగ్ చేస్తున్నాయి. 2 వేలకు పైగానే బలగాలు ఈ ఆపరేషన్‌లో పాల్గొన్నాయి.

నక్సలిజాన్ని మార్చిలోపు అంతం చేయాలనే కేంద్ర మంత్రి అమిత్ షా ఆదేశాల మేరకు వేట కొనసాగుతోంది. అందులో భాగంగానే కర్రెగుట్టలు హిల్స్ 2ను బలగాలు ప్రారంభించాయి. మావోయిస్టులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. అగ్రనేతలే టార్గెట్‌గా బలగాలకు ఆదేశాలు వెళ్లాయి. మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శి దేవ్‌జీ, జూనియర్ క్యాడర్‌కు చెందిన బెటాలియన్ ఇన్‌ఛార్జీ కేసా సోది కోసం కర్రెగుట్టల్లో బలగాలు వేట కొనసాగిస్తున్నాయి. కర్రెగుట్టల్లో మావోయిస్టులు తలదాచుకున్నట్టుగా భద్రతా బలగాలకు పక్కా సమాచారం వచ్చింది. దీంతో బలగాలు ముందుకుసాగాయి. మావోయిలు ఎదురుపడటంతో కర్రెగుట్టల్లో ఎన్‌కౌంటర్ జరిగింది. కొద్దిసేపటికి కాల్పులు ఆగిపోయాయి. ఆ ప్రాంతంలో ఐదుగురు మావోయిస్టుల మృతదేహాలను బలగాలు గుర్తించాయి. మృతుల్లో అగ్రనేతలు ఉన్నారని ప్రచారం మాత్రం జోరుగా సాగుతోంది.
కొంతకాలంగా ఆపరేషన్ కగార్‌తో మావోయిస్టులకు బలగాలు ఊపిరి ఆడకుండా చేస్తున్నాయి. ఇందులో భాగంగా అగ్రనేతలను పార్టీ కోల్పోయింది. ఎన్‌కౌంటర్‌లో కొందరు మరణించగా.. మరికొందరు లొంగిపోయారు. దీంతో మావోయిస్టులు తలదాచుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా మధ్యప్రదేశ్ నుంచి కర్రెగుట్టల్లోకి మావోలు ప్రవేశించారనే సమాచారంతో బలగాలు కూంబింగ్ చేస్తుండగా ఎన్‍కౌంటర్ జరిగింది.

మిగిలింది కొందరే
మార్చినాటికి మావోయిస్టులను నిర్మూలించేందుకు కేంద్రం టార్గెట్ పెట్టుకుంది. మరికొన్ని రోజుల్లో ఆపరేషన్ కగార్ గడువు ముగియనుంది. మావోయిస్టు అగ్రనేతలు దేవ్‌జీ, బడే చొక్కారావులాంటివారు ఇప్పుడు కర్రెగుట్టల ప్రాంతంలోనే ఉన్నారని బలగాలు జల్లెడ పడుతున్నాయి. మరణించిన ఐదుగురు మావోయిస్టుల గుర్తింపు తెలియాల్సి ఉంది. ఎన్‌కౌంటర్ జరిగిన ప్రాంతంలో ఆయుధాలు, విప్లవ సాహిత్యం దొరికినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం తెలంగాణకు చెందిన 15 మంది వరకు మావోయిస్టులు అజ్ఞాతంలో ఉన్నారు.

Leave A Reply

Your email address will not be published.