ముద్ర ప్రతినిధి, భువనగిరి :
జిల్లాలో నార్మల్ డెలివరీలు పెరిగేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఏఎన్‌ఎంలకు జిల్లా కలెక్టర్ హనుమంత రావు సూచించారు. గురువారం కలెక్టరేట్ కార్యాలయంలో అర్మాన్ ట్రైనింగ్ బృందం ఆధ్వర్యంలో ఏఎన్‌ఎంలకు హై–రిస్క్ గర్భిణీ ట్రాకింగ్, నిర్వహణపై ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి గర్భిణి స్త్రీని గర్భధారణ మొదటి నెల నుంచే నమోదు చేసి, ఆమె ఆరోగ్య పరిస్థితిపై పూర్తి అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని తెలిపారు. హై–రిస్క్ గర్భిణీ కేసులను ముందుగానే గుర్తించి, క్రమం తప్పకుండా ట్రాక్ చేస్తూ ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే మెరుగైన వైద్యం అందేలా చూడాలని ఆదేశించారు.
గ్రామీణ ప్రాంతాల్లో పల్లె దవాఖానల్లో సిబ్బంది అందుబాటులో లేకపోవడం వల్ల కొంతమంది గర్భిణీలు ప్రభుత్వ ఆసుపత్రులకు రాకుండా ప్రైవేట్ ఆసుపత్రులకు వెళుతున్నారని, అక్కడ అవసరం లేకపోయినా భయపెట్టి సిజేరియన్ ఆపరేషన్లు చేస్తున్న సందర్భాలు ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అనవసర సిజేరియన్ ఆపరేషన్లను అరికట్టాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో నాణ్యమైన వైద్యం అందుబాటులో ఉందని, వైద్యులు నార్మల్ డెలివరీలు జరిగేలా కృషి చేస్తున్నారని తెలిపారు. జిల్లాలోని అన్ని గర్భిణీలు ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే ప్రసవాలు జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

ఈ సందర్భంగా జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారి డా. ఎం. మనోహర్ మాట్లాడుతూ, అన్ని MPHA (F)లకు హై–రిస్క్ గర్భిణీ ప్రోటోకాల్స్ ప్రాముఖ్యతను వివరించారు. హై–రిస్క్ గర్భిణీ కేసులను తొందరగా గుర్తించడం ద్వారా వారికి సమయానుకూలంగా మెరుగైన చికిత్స అందించవచ్చని తెలిపారు. అవసరమైన సందర్భాల్లో సమయానికి రిఫరల్ చేయడంపై కూడా అవగాహన కల్పించారు. ప్రతి గర్భిణి స్త్రీ ప్రభుత్వ ఆసుపత్రిలోనే డెలివరీ అయ్యే విధంగా కృషి చేయాలని సూచించారు.
అర్మాన్ ట్రైనింగ్ బృందం, హైదరాబాద్‌కు చెందిన ట్రైనర్స్ డా. భవాని మరియు డా. రోహిణి హై–రిస్క్ గర్భిణీ ప్రోటోకాల్స్‌పై సవివరంగా శిక్షణ అందించారు.
ఈ కార్యక్రమంలో డాక్టర్ లు యశోద, రామకృష్ణ, వీణ, వంశీ కృష్ణ, వైద్య ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.