- ఘనంగా వైకుంఠ ఏకాదశి వేడుకలు
ముద్ర ప్రతినిధి, భువనగిరి : ప్రముఖ వైష్ణవ క్షేత్రం స్వర్ణగిరిలో వైకుంఠ ఏకాదశి వేడుకలు అంబరాన్నంటాయి.. మంగళవారం తెల్లవారుజామున 3.00 గంటలకు సుప్రభాతం తో శ్రీ వారిని మేల్కొలిపి నిత్యారాధనలు పూర్తి చేశారు. అనంతరం స్వామి వారిని గరుడవాహనం మీద వేంచేపు చేసి ఆలయ ప్రదక్షిణగా ఉత్తర ద్వారం వద్ద కొలువుదీర్చారు. వైకుంఠ ద్వారమునకు ఆలయ వ్యవస్థాపక ధర్మకర్తలు మానేపల్లి రామారావు, మురళీకృష్ణ గారు గోపీకృష్ణ లు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వైకుంఠ ద్వారం ద్వారా భక్తులు ప్రవేశించి స్వామి వారిని దర్శించుకున్నారు. విశేష పుష్పాలంకరణతో విద్యుత్ దీప కాంతులతో దేదీప్యంగా వెలుగొందుతున్న స్వర్ణగిరి క్షేత్రాన్ని దర్శించుకొని లక్షలాది భక్తులు తన్మయత్వం పొందారు.


స్వర్ణ గిరీష్యుడిని దర్శించుకున్న ప్రముఖులు
తెలంగాణ రాష్ట్ర ఐటీ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు వైకుంఠ ఏకాదశి సందర్భంగా శ్రీ స్వర్ణగిరి వేంకటేశ్వర స్వామివారిని కుటుంబ సమేతంగా, తెలంగాణ ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య కుటుంబ సమేతంగా, భువనగిరి కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, జూబ్లీహిల్స్ కాంగ్రెస్ ఎమ్మెల్యే వల్లాల నవీన్ యాదవ్ స్వర్ణగిరి ఆలయంలో వైకుంఠ ఏకాదశి వేడుకల్లో కుటుంబ సమేతంగా పాల్గొన్నారు.


ఈ సందర్భంగా ప్రముఖులకు ఆలయ వ్యవస్థాపకులు ప్రత్యేకంగా స్వాగతం పలికారు. వారంతా ఉత్తర ద్వారం నుంచి ఆలయంలోకి ప్రవేశించి శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ అర్చకులు వేద ఆశీర్వచనం చేశారు. ఆలయ వ్యవస్థాపకులు స్వామివారి చిత్రపటంతో పాటు లడ్డు ప్రసాదం అందజేశారు.
