- భక్తుల కోసం భారీ ఏర్పాట్లు
- విద్యుల్లతలతో మెరిసిపోతున్న ఆలయం
- ఆలయ చైర్మన్ మానేపల్లి రామారావు
- ధర్మకర్తలు మానేపల్లి మురళీకృష్ణ, గోపీకృష్ఱ
ముద్ర ప్రతినిధి, భువనగిరి : ఇల వైకుంఠపురంగా విరాజిల్లుతున్న యాదాద్రి స్వర్ణగిరి శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశి ఉత్సవాలను డిసెంబర్ 30వ తేదీ నుండి జనవరి 08 వ తేదీ వరకు ఘనంగా నిర్వహిస్తున్నట్లు ఆలయ చైర్మన్ మానేపల్లి రామారావు, ధర్మకర్తలు మానేపల్లి మురళీకృష్ణ, మానేపల్లి గోపికృష్ణలు ఆదివారం తెలిపారు.
30న వైకుంఠ ఏకాదశి పురస్కరించుకుని స్వర్ణగిరి శ్రీ వేంకటేశ్వర స్వామి భక్తులకు ఉత్తరద్వార దర్శనమిస్తారని తెలిపారు. రాష్ట్ర నలుమూలల నుంచి భక్తులు అధిక సంఖ్యలో హాజరవుతారని ప్రత్యేక ఏర్పాట్లను చేస్తున్నామని తెలిపారు. వైకుంఠ ఏకాదశి ఉత్సవాల్లో పాల్గొనే భక్తుల కోసం ఆన్ లైన్ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చామని చెప్పారు. పది రోజులపాటు కానీ విని ఎరగని తరహాలో స్వామివారి అలంకరణ, సేవలు వైభవంగా నిర్వహించడం జరుగుతుందన్నారు.
వైకుంఠ ఏకాదశి డిసెంబర్ 30వ తేదీన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వేంకటేశ్వర స్వామి వారు వేకువజామున ఉత్తర ద్వారా భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. భక్తుల కోసం ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. స్వామి వారి దర్శనానికి వచ్చే ప్రతి భక్తునికి కూడా స్వామివారి అన్న ప్రసాదాన్ని అందజేయడానికి ఏర్పాట్లు పూర్తి చేశారు ఆలయ నిర్వాహకులు. సుదూరాల నుంచి వచ్చే భక్తులకు ప్రత్యేకమైన పార్కింగ్ సదుపాయ, ఆలయ పరిసర ప్రాంతాలతో పాటుగా పురవీధుల్లో మంచినీటి వసతి ఏర్పాటు చేశామన్నారు.