Take a fresh look at your lifestyle.

పర్యాటకులకు ఆహ్లాదకరంగా ఉండే విధంగా అనంతగిరి గుట్ట ప్రాంతాన్ని తీర్చి దిద్దుతాం

  • వన మహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్.

వికారాబాద్, ముద్ర ప్రతినిధి: పర్యాటకులకు ఆహ్లాదకరంగా ఉండే విధంగా అనంతగిరి గుట్ట ప్రాంతాన్ని తీర్చి దిద్దుతామని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అధికారులకు సూచించారు.గురువారం వికారాబాద్ జిల్లాలో సభాపతి పర్యటనలో భాగంగా అనంతగిరిగుట్ట పైన అటవీ శాఖ ఆధ్వర్యంలో చేపడుతున్న పర్యావరణ పట్టణ పార్క్ అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవం, పట్టణ కేంద్రంలోని బ్లాక్ గ్రౌండ్ లో క్రీడా ప్రాంగణం పునః నిర్మాణం, బ్యాట్మెంటన్ కోర్టు ఏర్పాటు నిర్మాణ పనులకు శంకుస్థాపనలతో పాటు వన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా అనంతగిరి అటవీ ప్రాంతంలో మొక్కలు నాటే కార్యక్రమంలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సభాపతి అధికారులనుద్ధేశించి మాట్లాడుతూ.. అనంతగిరి అటవీ ప్రాంతంలో పర్యాటకులకు మంచి అనుభూతి, సంతృప్తిని కలిగించే విధంగా అభివృద్ధి పనులు చేపట్టాలన్నారు. సుదీర్ఘ కాలంగా అవసరానికి వచ్చే నిర్మాణాలతో పాటు సదుపాయాలను నాణ్యతతో పకడ్బందిగా పట్టాలని ఆయన అధికారులకు సూచించారు. వన మహోత్సవంలో భాగంగా ఆకుపచ్చ తెలంగాణ దిశగా పెద్ద మొత్తంలో మొక్కలు నాటేందుకు అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఆయన సూచించారు. కోటి రూపాయల వ్యయం తో చేపట్టే వికారాబాద్ బ్లాక్ గ్రౌండ్ పునఃనిర్మాణ, బ్యాట్మెంటన్ కోర్టు పనులను నాణ్యత లోపము లేకుండా వేగవంతంగా పూర్తి చేయాలని సంబంధిత అధికారిని ఆయన ఆదేశించారు. ఈ సందర్భంగా అనంతగిరి అటవీ ప్రాంతంలో శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ అధికారులతో కలిసి మొక్కలు నాటారు. ఈ కార్యక్రమాల్లో అటవీ శాఖ చీఫ్ కన్జర్వేటర్ ప్రియాంక వర్గీస్, జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, అదనపు కలెక్టర్ లింగ్యా నాయక్, పంచాయతీ రాజ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఉమేష్, డిఆర్డిఓ శ్రీనివాస్, జిల్లా అటవీ శాఖ అధికారి జ్ఞానేశ్వర్, ఆర్డీవో వాసు చంద్రలతో పాటు సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.