Take a fresh look at your lifestyle.

పేదలకు మంచి చేయాలంటే పదవులే ముఖ్యం కాదు

  • మంచి మనసుతో మీరందరూ కృషి చేయాలి.
  • రూ. 9 కోట్ల 12 లక్షల వడ్డీ మాఫీ మొత్తాన్ని సంఘాలకు పంపిణీ చేసిన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్.

వికారాబాద్, ముద్ర ప్రతినిధి: పేదలకు మంచి చేయాలంటే పదవులే కాదు మంచి మనసు కూడా ఉండాలని మీరందరూ ఈ విషయాన్ని గమనించాలని స్పీకర్, వికారాబాద్ నియోజకవర్గ శాసనసభ్యులు గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు.వికారాబాద్ జిల్లా సమీకృత కార్యాలయ భవనంలోని సమావేశ మందిరంలో గురువారం జరిగిన ఇందిరా మహిళా శక్తి సంబురాలు, నూతన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా వికారాబాద్ నియోజకవర్గంలోని మహిళా స్వయం సహాయక బృందాలకు మంజూరైన రూ. 9 కోట్ల 12 లక్షల వడ్డీ మాఫీ మొత్తాన్ని స్పీకర్ అందజేశారు.ఈ సందర్భంగా స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ మాట్లాడుతూ సమాజంలో సగ భాగంగా ఉన్న మహిళలు ఆర్ధికంగా అభివృద్ధి చెందితే కుటుంబాలతో పాటుగా, రాష్ట్రం, దేశం కూడా అభివృద్ధి చెందుతుందన్నారు.రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం ఎర్పడినప్పటి నుండి మహిళలకు అధిక ప్రాధాన్యత ఇస్తుందని స్పీకర్ తెలిపారు.ఇందిరా మహిళా శక్తి సంబురాలలో సందర్భంగా పాల్గొన్న మహిళలకు అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు.భారతీయ సంస్కృతి, సాంప్రదాయంలో మహిళలకు అత్యున్నత స్థానం ఉందని, మనం మహిళలను అత్యంత గౌరవించాలన్నారు.అదేవిధంగా ప్రతి ఇంటికి ఇల్లాలే వెలుగనీ తెలిపారు.ఎన్నికల సమయంలో మహిళలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామని తెలిపారు.మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, పేదలకు 200 యూనిట్ల వరకు కరంటు ఉచితంగా అందుతున్నాయన్నారు. ఇందిరమ్మ ఇళ్లను కూడా మహిళల పేరు మీదనే మంజూరు చేస్తున్నామని,ఇవే కాకుండా మహిళలు ఆర్థికంగా ఎదిగి ఆత్మగౌరవంతో జీవించాలనే మంచి ఆశయంతో ప్రజా ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తుందని ఆయన తెలిపారు.మహిళా సంఘాల ద్వారా సోలార్ విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటు, ఆర్టీసీ సంస్థకు అద్దె బస్సులు ఇప్పించడం, పెట్రోల్ పంపుల నిర్వాహణ, ధాన్యం కొనుగోలు, రైస్ మిల్లుల ఏర్పాటు వంటి అనేక వ్యాపారాలను ఏర్పాటు ప్రభుత్వం చేయిస్తున్నట్లు ఆయన తెలిపారు.ఇందిరా శక్తి క్యాంటీన్, పాఠశాలలకు ఏకరూప దుస్తులు కుట్టడం వంటి ఆర్ధిక లబ్ది కలిగించే పథకాలను కూడా అమలు చేస్తున్నామన్నారు.కోటీ మంది మహిళలను కోటీశ్వరులు చేయాలని ఉద్దేశంతో సంవత్సరానికి 20 వేల కోట్ల రూపాయలు మహిళలకు వడ్డి లేకుండా అందిస్తున్నట్లు ఆయనతెలిపారు.మహిళా సంఘాలకు అందే రుణాలతో చిన్న చిన్న వ్యాపారాలు ప్రారంభించాలని, మన ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో మహిళా సంఘాలు డ్రోన్ వ్యాపారం కూడా చేస్తున్నారని, మహిళలు వివిధ రకాలైన వ్యాపారాలు చేసేందుకు ధైర్యంగా ముందుకు రావాలని ఆయన తెలిపారు. మహిళలు వ్యాపార వేత్తలుగా ఎదిగి పది మందికి ఉపాధి కల్పించాలని సూచించారు.మహిళల ఆశీర్వాదం ఉంటే ప్రభుత్వం చల్లగా ఉంటుందని, అందుకే ఆర్థికంగా అనేక కష్టాలు ఉన్నప్పటికీ మహిళల కోసం సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నట్లు ఆయన అన్నారు.రుణ భీమా, ప్రమాద భీమా వంటి పథకాలను గతంలో ఏ ప్రభుత్వం కూడా ఆలోచించ లేదని, గత పాలకుల హయాంలో నిర్లక్ష్యం చేసిన వడ్డి లేని రుణాలను ప్రజా ప్రభుత్వంలో పునరుద్ధరించడం జరిగిందని ఆయన గుర్తు చేశారు.

మహిళా సంఘాల్లో ఉన్న సభ్యులు ప్రమాదవశాత్తు మరణిస్తే 10 లక్షల రూపాయల భీమా అందుతుందని, అదే మహిళ సభ్యులు సాధారణంగా మరణిస్తే 2 లక్షల రూపాయల వరకు ఉన్న లోన్ బీమా అమలు అవుతుందని ఆయన అన్నారు.మహిళా స్వయం సహాయక సంఘాలకు రుణమాఫీలో భాగంగా వికారాబాద్ జిల్లాలో మొత్తం 32.70 కోట్లు రుణమాఫీ జరిగిందని ఆయన అన్నారు.ఇందులో భాగంగా మన వికారాబాద్ నియోజకవర్గానికి చెందిన రెండు వేల 987 సంఘాల లోని 30 వేల మంది మహిళా సభ్యులకు 9 కోట్ల 12 లక్షల రూపాయల వడ్డీ రుణమాఫీ జరిగిందని తెలిపారు.తెలంగాణ ప్రాంతంలో కుటుంబానికి భూమి ఉంటే ఎంత ఆత్మ గౌరవమో అదేవిధంగా రేషన్ కార్డు ఉంటే కూడా ఆ కుటుంబానికి అంతే ఆత్మగౌరవం అని ఆయన అన్నారు.తెల్ల రేషన్ కార్డులు తీసుకునే వారు పేదలు. రేషన్ కార్డుతో చౌకగా బియ్యం అందితే కుటుంబంతో కడుపు నిండా అన్నం తింటారని, కానీ గత ప్రభుత్వం పదేళ్ళ పాలనలో ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదని ఆయన అన్నారు.రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంచి మనసుతో అర్హులైన వారందరికి రేషన్ కార్డుల పంపిణీని ప్రారంభించారని, అర్హులైన వారందరికీ కొత్త రేషన్ కార్డులు వస్తాయని, కడుపు నిండా తృప్తిగా అన్నం తినాలని సన్న బియ్యాన్ని ఇస్తున్నాం అని ఆయన అన్నారు.గత ప్రభుత్వ ఎనిమిది లక్షల కోట్లకు పైగా అప్పులు చేసి రాష్ట్ర ప్రజల నెత్తిమీద భారం వేసిందని, రాష్ట్ర ముఖ్యమంత్రి నిరంతరం కృషి చేస్తూ రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిని ఒక గాడిలో పెడుతున్నట్లు ఆయన తెలిపారు. ఆర్థిక పరిస్థితి బాగుంటే మీకు ఇస్తామన్న నెలకు 2,500 రూపాయలు ఇచ్చేవాళ్ళం, పెళ్ళిలో తులం బంగారం కూడా వచ్చేది. మీరు అర్థం చేసుకోవాలని ఆయన కోరారు. త్వరలోనే మహిళలకు ఇచ్చిన అన్ని హామీలను అమలు చేస్తామని స్పీకర్ హామీ ఇచ్చారు.ఈ సందర్భంగా స్పీకర్ కు పెద్ద ఎత్తున మహిళలు బోనాలు, వాయిద్యాలతో ఘనంగా స్వాగతం పలికారు.కార్యక్రమంలో భాగంగా జిల్లా మహిళా సంఘాలకు చెక్కులను, అర్హులైన పేదలకు స్పీకర్ చేతుల మీదుగా రేషన్ కార్డులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, అదనపు కలెక్టర్లు లింగ్యా నాయక్, ఎం.సుధీర్, హెల్ప్ డైరెక్టర్ జాన్సన్, డి ఆర్ డి ఓ శ్రీనివాస్, డిసిసిబి డైరెక్టర్ కిషన్ నాయక్, ఆర్టీవో సభ్యులు జాఫర్, జిల్లా పౌరసరఫరాల అధికారి సుదర్శన్, మహిళా సంఘం జిల్లా అధ్యక్షురాలు జానకి తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.