ముద్ర, తుర్కపల్లి:
తుర్కపల్లి మండల కేంద్రంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. పిలుపు ప్రమోట్ చేసిన స్వర భారతి, రైతు నేస్తం, ఒంటరి మహిళల సమైక్య సంస్థలు మరియు ఇన్నర్ వీల్ క్లబ్ సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాయి.
ఈ సందర్భంగా ఇన్నర్ వీల్ భువనగిరి శాఖ అధ్యక్షురాలు లావణ్య మాట్లాడుతూ పురుషులలాగే మహిళలకు కూడా సమాన హక్కులు కల్పించాలని అన్నారు. ప్రతి మహిళ, బాలికకు హక్కులు మరియు న్యాయం జరిగేలా సమాజంలో కార్యాచరణ ఉండాలని ఆమె పేర్కొన్నారు. మహిళల అభివృద్ధి కోసం ఇన్నర్ వీల్ క్లబ్ అనేక కార్యక్రమాలు చేపడుతోందని తెలిపారు.
జిల్లా బాలల రక్షణ కమిటీ చైర్పర్సన్ జయశ్రీ మరియు కమిటీ సభ్యులు మాట్లాడుతూ పిల్లలు, మహిళలపై హింస, అన్యాయం, వివక్ష లేని సమాజ నిర్మాణం కోసం అందరూ కలసి పనిచేయాలని పిలుపునిచ్చారు.
పిలుపు ప్రమోట్ చేసిన స్వర భారతి, రైతు నేస్తం, ఒంటరి మహిళల సమైక్య ప్రతినిధులు మాట్లాడుతూ సమాజం, ప్రభుత్వం మరియు ప్రతి వ్యక్తి కలిసి లింగ సమానత్వం కోసం చర్యలు తీసుకోవాలని, మహిళలకు విద్య, ఉద్యోగాలు మరియు నాయకత్వంలో మరిన్ని అవకాశాలు కల్పించాలని కోరారు.
పిలుపు సంస్థ వ్యవస్థాపకుడు ఎం. జనార్ధన్ మాట్లాడుతూ మహిళలను గౌరవించడం, వారి కృషిని గుర్తించడం ఎంతో ముఖ్యమని తెలిపారు. ఈ సందర్భంగా ఒంటరి మహిళలైన మల్కాపురం గ్రామానికి చెందిన మరియమ్మ, పల్లెపహాడ్ గ్రామానికి చెందిన సంధ్యలను సన్మానించారు.
ఈ కార్యక్రమంలో రైతులు చాడ కరుణాకర్ రెడ్డి, మానవ హక్కుల జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్, రెడ్ క్రాస్ ప్రతినిధులు అంజయ్య, పిలుపు సంస్థ సిబ్బంది మరియు సుమారు 70 మంది గ్రామీణ మహిళలు పాల్గొన్నారు.