Take a fresh look at your lifestyle.

మార్చి 3న చంద్రగ్రహణం: మూతపడనున్న శ్రీవారి ఆలయం

తిరుమల: 2026 మార్చి 3వ తేదీన సంభవించనున్న చంద్రగ్రహణం దృష్ట్యా తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారి ఆలయాన్ని తాత్కాలికంగా మూసివేయనున్నారు. గ్రహణ సమయానికి ఆరు గంటల ముందుగానే ఆలయ తలుపులు మూసివేయడం ఆనవాయితీ కావడంతో, ఆ రోజు ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 7:30 గంటల వరకు సుమారు 10:30 గంటల పాటు దర్శనాలు నిలిపివేయనున్నారు.

గ్రహణ సమయం – ఆలయ పునఃప్రారంభం

మార్చి 3వ తేదీ సాయంత్రం 3:20 గంటలకు చంద్రగ్రహణం ప్రారంభమై, సాయంత్రం 6:47 గంటలకు ముగుస్తుంది. గ్రహణానంతరం సాయంత్రం 7:30 గంటలకు ఆలయ తలుపులు తెరిచి, అర్చకులు ఆలయ శుద్ధి మరియు పుణ్యహవచనం వంటి సంప్రదాయ కార్యక్రమాలు నిర్వహిస్తారు. అనంతరం రాత్రి 8:30 గంటల నుండి భక్తులకు తిరిగి శ్రీవారి దర్శనం కల్పిస్తారు.

రద్దయిన సేవలు.. దర్శనాలు

గ్రహణం కారణంగా ఆ రోజు ఆలయంలో నిర్వహించే పలు ఆర్జిత సేవలతో పాటు ప్రత్యేక దర్శనాలను టీటీడీ రద్దు చేసింది. అష్టదళ పాద పద్మారాధన, కళ్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలు రద్దు చేయబడ్డాయి. వీఐపీ బ్రేక్ దర్శనాలు, శ్రీవాణి దర్శనాలు, రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం నిలిపివేశారు. వృద్ధులు, దివ్యాంగులు, చంటిపిల్లల తల్లిదండ్రులు, ఎన్ఆర్ఐలు మరియు దాతలకు కేటాయించే ప్రత్యేక దర్శన కోటాలను కూడా రద్దు చేశారు.

గమనిక: భక్తులు ఈ మార్పులను గమనించి, తదనుగుణంగా తమ తిరుమల యాత్రను ప్లాన్ చేసుకోవాలని టీటీడీ అధికారులు విజ్ఞప్తి చేశారు.

Leave A Reply

Your email address will not be published.