తడబడి.. ముగిసిన పోరు బాట
పాలకపక్షం కాఠిన్యం ముంగిట మూగబోయిన విప్లవ గీతం
ఆయుధాలు అప్పగించి.. తలవంచిన విప్లవ యోధులు
ఇక.. అంపశయ్య మీద గణపతి
ఆఖరి పోరులో చొక్కారావు.. కనిపిస్తే కాల్చుడే…
ముద్ర, తెలంగాణ బ్యూరో:
“”
1967, మే 25..
నక్సల్బరీ తిరుగుబాటు.. అంతకు ముందు మార్చి 2న స్థానిక భూస్వాములు తన భూమిని దున్నడానికి ఒక గిరిజన యువకుడిపై దాడి చేయడంతో చారు మజుందార్ నేతృత్వంలోని తిరుగుబాటుదారులు పశ్చిమ బెంగాల్‌లోని డార్జిలింగ్ జిల్లాలోని నక్సల్బరీలో పోరుకు దిగారు. ఒక బృందం అండతో.. గిరిజనులు ప్రతీకారం తీర్చుకుని వారి భూములను భూస్వాముల నుంచి తిరిగి స్వాధీనం చేసుకోవడం ప్రారంభించారు. ఈ తిరుగుబాటు మొదలైన తర్వాత అప్పటి ప్రభుత్వం తిరుగుబాటుదారులను చంపేందుకు అనుమతి ఇచ్చింది. దీంతో ఇటు తిరుగుబాటుదారుల చేతిలో ఒక ఎస్సై.. అటు పోలీసుల చేతిలో తొమ్మిది మంది గిరిజనులు హతమయ్యారు. ఈ సంఘటన అప్పుడు భూ పోరాటం చేస్తున్న రాష్ట్రాల్లో దావనంలా వ్యాపించింది. అంతే.. ఒక ఉద్యమంగా మొదలై.. నక్సలిజం పుట్టింది.
దున్నే వాడికే భూమి.. భూస్వాముల అహంకారం.. పేద వర్గాలకు ఎర్ర జెండ అండ.. అంటూ పశ్చిమ బెంగాల్ లో ఆవిర్భవించిన నక్సలైట్ ఉద్యమం.. ఇప్పుడు అస్త్ర సన్యాసం చేసింది. “”
ఎన్నో విజయాలు.. రక్తం ఏరులై పారుతున్న ఆగని పోరాటం.. ఏండ్ల తరబడి అరణ్యవాసం.. మధ్య మధ్యలో ఎన్నో మలుపులు.. ఎందరో కోవర్టులు.. మరెందరో ప్రాణ త్యాగం చేసిన పార్టీ ఇప్పుడు ఆయుధాలు వీడింది. నాటి నక్సలైట్.. ఆ తర్వాత పీపుల్స్ వార్ .. 20 ఏండ్ల కిందట మావోయిస్టు పార్టీగా రూపాంతరం చెందిన విప్లవ పార్టీ ఇప్పుడు అడవిని వీడిపోయింది.
ఆయుదాలు వీడుతాం.. కాల్పులు విరమిస్తాం అటూ మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి అభయ్ అలియాస్ మల్లోజుల వేణుగోపాల్ ప్రకటించిన రెండు నెలల్లో ఆయుధాలు అప్పగించింది.
ఆయుధం వీడిన అన్నలు
మావోయిస్టు పార్టీకి కోలుకోలేని దెబ్బ తగిలింది. కేంద్ర మావోయిస్టు ప్రధాన పార్టీ సెక్రటరీ దేవ్ జీ అలియాస్ తిప్పిరి తిరుపతి, కేంద్ర కమిటీ సభ్యుడు రాజిరెడ్డి సహా 16 మంది మావోయిస్టులు పోలీసుల ఎదుట లొంగిపోయారు. అగ్రనేతలు దేవ్ జి, రాజిరెడ్డి సహా 16 మంది మావోయిస్టులు కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా ఆసిఫాబాద్ పోలీసుల ఎదుట లొంగిపోయారు. వరుస ఎన్ కౌంటర్లలో మావోయిస్ట్ అగ్రనేతలు పలువురు ప్రాణాలు కోల్పోతుంటే, మరోవైపు అదే స్థాయిలో మావోయిస్టులు లొంగిపోతున్నారు. రెండు నెలల క్రితం ఆసిఫాబాద్ అడవుల్లోని సిర్పూర్ యు అడవి ప్రాంతంలో 16 మంది మావోయిస్టులు లొంగిపోగా.. తాజాగా రాష్ట్రస్థాయి మావోయిస్టుల అగ్రనాయకత్వం జిల్లా పోలీసుల ముందు లొంగిపోయినట్లుగా తెలుస్తోంది. పోలీసులు అధికారికంగా ప్రకటన చేయాల్సి ఉంది. పోలీసులు రెండు రోజుల్లో మీడియా ముందుకు దేవ్‌జీ, రాజిరెడ్డిలను తీసుకువచ్చే అవకాశం ఉంది. ఆసిఫాబాద్ అడవులలో లొంగిపోయిన కేంద్ర మావోయిస్టు ప్రధాన పార్టీ సెక్రటరీగా ఉన్న దేవ్ జీ అలియాస్ తిప్పిరి తిరుపతితో పాటు, కేంద్ర కమిటీ సభ్యుడు రాజిరెడ్డి సహా 16 మంది కలిసి లొంగిపోయారు. ప్రస్తుతం వీరు పోలీసుల అదుపులో సురక్షితంగా ఉన్నారు. ఒకప్పుడు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మావోయిస్టులకు కంచుకోటగా ఉన్న ఆసిఫాబాద్ కాగజ్ నగర్ అటవీ ప్రాంతాలు తమ ప్రాబల్యాన్ని కోల్పుతున్నాయి. శనివారం రాత్రి 12 గంటల ప్రాంతంలో మావోయిస్టు అగ్ర నేతలు దేవుజీ, రాజిరెడ్డి సహా 16 మంది మావోయిస్టులు ఆసిఫాబాద్ పోలీసుల ఎదుట లొంగిపోయారని ప్రచారం జరుగుతోంది.
ఆపరేషన్ కోఆర్డినేటర్
తెలంగాణ- ఛత్తీస్‌గఢ్ అడవుల్లో ఆపరేషన్ కగార్-2 పేరుతో రెండు వేల మంది బలగాలతో అగ్రనేతల కోసం వేట మొదలైంది. కేంద్ర ప్రభుత్వం నిర్దేశించుకున్న మార్చి 31 గడువు దగ్గర పడుతోంది. కేవలం ఇంకో నలభై రోజులు మాత్రమే మిగిలి ఉంది. అందుకే ఈలోపు ఉన్న మావోయిస్టులను తుదముట్టించాలని ప్రభుత్వం ఆపరేషన్‌ను తీవ్రం చేసింది.దేశం నుంచి వామపక్ష తీవ్రవాదాన్ని పూర్తి స్థాయిలో తుడిచి పెట్టాలనే కేంద్ర ప్రభుత్వ మిషన్ -2026 గడువు సమీపిస్తున్న వేళ తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో వాతావరణం వేడెక్కింది. మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా భద్రతా బలగాలు అత్యంత వ్యూహాత్మకమైన ఆపరేషన్ కగార్‌ను పునఃప్రారంభించాయి. ఈసారి కర్రె గుట్టల హిల్స్‌ను టార్గెట్ చేసుకున్నట్టు సమాచారం. అందుకే దీనికి ఆపరేషన్ కేజీహెచ్-2ను ప్రారంభించాయి. ఒకవైపు సరిహద్దుల్లో రెండు వేల మంది సాయుధ బలగాల మోహరించారు. మరోవైపు ఉమ్మడి వరంగల్ జిల్లా అటవీప్రాంతాల్లో అగ్రనేత బడే చొక్కారావు, అలియాస్ దామోదర్‌తోపాటు బడానేతలు సంచరిస్తున్నారనే సమాచారరంతో పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. దీంతో ఏజెన్సీ ప్రాంతాల్లో భారీ సంఖ్యలో బలగాలు కూంబింగ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నాయి.
టార్గెట్ కంప్లీట్
అగ్రనేతలే లక్ష్యంగా భారీ వ్యూహం
కేంద్ర ప్రభుత్వం నిర్దేశించుకున్న మార్చి 31 గడువు దగ్గర పడుతోంది. కేవలం ఇంకో నలభై రోజులు మాత్రమే మిగిలి ఉంది. అందుకే ఈలోపు ఉన్న మావోయిస్టులను తుదముట్టించాలని ప్రభుత్వం ఆపరేషన్‌ను తీవ్రం చేసింది. సీఆర్‌పీఎఫ్, ఛత్తీస్‌గఢ్ పోలీసులు సంయుక్తంగా ఆపరేషన్ కేజీహెచ్-2 చేపడుతున్నాయి. ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లా నంబి ప్రాంతం నుంచి వ్యాపించి ఉన్న కర్రెగుట్టల అడవుల్లో ఈ వేట కొనసాగిస్తున్నారు. మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శి దేవ్‌జి అలియాస్ చేతన్, జూనియర్ క్యాడర్‌కు చెందిన బెటాలియన్ ఇన్‌ఛార్జి కేసా సోధీ, బడే చొక్కారావులాంటి పెద్ద తలకాయలను పట్టుకోవడమే లక్ష్యంగా రెండు వేలకుపైగా బలగాలతో అడవిలో అణువణువూ గాలింపు చర్యలు చేపట్టారు. గతేడాది ఏప్రిల్‌లలో ఇదే కర్రెగుట్టల్లో నిర్వహించిన 21రోజుల సుదీర్ఘ ఆపరేషన్‌లో 31 మంది మావోయిస్టులను హతమార్చారు. కానీ అగ్రనేతలు మాత్రం తప్పించుకున్నారు. ఈసారి వారిని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టకూడదనే పట్టుదలతో బలగాలు ఉన్నాయి. ఇదే సమయంలో దామోదర్ మినహా అగ్రనేతలు లొంగిపోయారు.
ఉమ్మడి వరంగల్ సరిహద్దుల్లో దామోదర్ కోసం వేట
తెలంగాణలోని ములుగు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల సరిహద్దుల్లో బడే చొక్కారావు అలియాస్ దామోదర్ షెల్టర్ తీసుకున్నారని పక్కా సమాచారం అందింది. అందుకే ఈ ప్రాంతాల్లో కూడా హై అలర్ట్ ప్రకటించారు. దామోదర్ స్వస్థలమైన తాడ్వాయి మండలం నార్లాపూర్ గ్రామంపై పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు. ఆ గ్రామం నుంచి కీలక సమాచారం బయటకు వెళుతుందని అనుమానంతో నిఘా విభాగం, గ్రేహౌండ్స్ దళాలు అప్రమత్తమయ్యాయి. పెద్దాపూర్, కొప్పుగుట్ట, గండికామారం వంటి ప్రాంతాల్లో కూంబింగ్ నిర్వహిస్తున్నారు.
అనుకున్నదే అయిందా..?
మావోయిస్టు రహితంగా దేశాన్ని మార్చే దిశగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నాయి. కర్రెగుట్టలో ఆపరేషన్ కగార్ చేపట్టి పలువురు మావోయిస్టులను మట్టుపెట్టారు. పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు, PLGA 1వ బెటాలియన్ మాస్టర్ మైండ్ మాడ్వి హిడ్మా గతేడాది నవంబర్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో హతమయ్యారు. ఆంధ్రప్రదేశ్-ఛత్తీస్‌గఢ్ సరిహద్దులోని అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి అడవుల్లో ఈ ఎన్‌కౌంటర్ జరిగింది. ఇటీవల మావోయిస్టు పార్టీలో కీలక నేతగా ఉన్న పాక హనుమంతు సైతం ఎన్‌కౌంటర్‌లో మరణించాడు. సుదీర్ఘ కాలం పాటు అండర్‌గ్రౌండ్‌లో ఉన్న బర్సే దేవా మరికొందరు కీలక మావోయిస్టులు కూడా హింసా మార్గాన్ని వీడి జనజీవన స్రవంతిలో కలిశారు. కొద్ది నెలల క్రితం 200 మందికి పైగా మావోయిస్టులు ఛత్తీస్‌గఢ్ సీఎం, హోం మంత్రి ముందు లొంగిపోయారు. వీరిలో 98 మంది మహిళా మావోయిస్టులు ఉన్నారు. కేంద్ర కమిటీ సభ్యుడు తక్కళ్లపల్లి వాసుదేవరావు అలియాస్ ఆశన్న మాడ్ డివిజన్ కార్యదర్శి రనిత కూడా లొంగిపోయారు. మహారాష్ట్ర సీఎం ఎదుట కూడా వందల సంఖ్యలో మావోయిస్టులు లొంగిపోయారు. ప్రస్తుతం మావోయిస్టు పార్టీలో వివిధ హోదాల్లో తెలంగాణకు చెందిన 15 మంది ఉన్నారు. వీరిలో కేంద్ర కమిటీలో ఇద్దరు, రాష్ట్ర కమిటీలో ఐదుగురు, డివిజన్ కమిటీలో ఆరుగురు, అండర్‌గ్రౌండ్‌లో ఒకరితో పాటు మరొకరు ఉద్యమంలో కొనసాగుతున్నట్లు ఇటీవల డీజీపీ వెల్లడించారు.
కర్రేగుట్టల్లో ఖతం
మావోయిస్టు పార్టీకి షెల్టర్ జోన్ అయిన కర్రె గుట్టల నుంచి చేపట్టిన ఆపరేషన్ విజయవంతం అయింది. కర్రెగుట్టల మీదుగా రోడ్డు నిర్మాణం జరగుతోంది. తెలంగాణలోని పామునూరు నుండి చత్తీస్ గడ్ లోని తడపాల వరకు రహదారి వేసే పనిలో నిమగ్నం అయ్యాయి బలగాలు. ఇందులో భాగంగానే వివిధ రంగాల్లో సుశిక్షుతులగా ఉన్న జవాన్లను కర్రె గుట్టలపై మోహరించినట్టుగా తెలుస్తోంది.
గత సంవత్సరం జనవరిలో మావోయిస్టులకు మెయిన్ షెల్టర్ జోన్ గా ఉన్న కర్రె గుట్టలపై భద్రతా దళాల దృష్టి పడింది. ఈ గుట్టలను స్వాధీనం చేసుకోవాలన్న లక్ష్యంగా ఏప్రిల్, మే నెలలో భారీ ఆపరేషన్ కు శ్రీకారం చుట్టారు. సహజ సిద్దంగా ఏర్పడిన వనరులతో పాటు సహజంగా ఏర్పడిన సొరంగాలు, వన సంపద విస్తరించి ఉన్న కర్రె గుట్టలను సునిశితంగా పరిశీలించిన ఉన్నతాధికారులు దానిపై స్పెషల్ ఆపరేషన్ చేపట్టారు. దీంతో కర్రె గుట్టలపై షెల్టర్ తీసుకునే మావోయిస్టులు అక్కడి నుండి వెళ్లిపోవడంతో బలగాలు అణువు అణువు తనిఖీలు చేపట్టాయి. మందుగుండు సామాగ్రిని గుర్తించిన బలగాలు వాటిని నిర్వీర్యం చేశాయి. ఈ క్రమంలోనే తెలంగాణలోని పామునూరు మీదుగా, చత్తీస్ గడ్ లోని తడపాల మీదుగా కేంద్ర రిజర్వూ బలగాలు కర్రె గుట్టలపై రోడ్డు నిర్మాణానికి శ్రీకారం చుట్టాయి. ఈ ఏడాది జనవరి 26న ఇరువైపులా ఏర్పాటు చేసిన క్యాంపుల్లో గణతంత్ర వేడుకలు కూడా నిర్వహించారు. అయితే ఇక్కడ శాశ్వత రోడ్డు నిర్మాణం జరపాలన్న లక్ష్యంతో బలగాలు ముందుకు సాగాయి. సాధారణ కూంబింగ్ జరిపే బలగాలతో పాటు క్విక్ రియాక్షన్ టీమ్స్ (QRT), రోడ్ సైడ్ కూంబింగ్ ఆపరేషన్ టీమ్స్ (RSCO), మైన్ డిఫ్యూజ్ పార్టీలు ఇలా ఆయా విభాగాల్లో నిష్ణాతులుగా ఉన్న బలగాలు అక్కడ పని చేస్తున్నాయి. ప్రధానంగా బాటిల్ బాంబ్స్, మందు పాతరలను పెద్ద ఎత్తున గుర్తిస్తున్న బలగాలు వాటిని నిర్వీర్యం చేస్తూ ముందుకు సాగుతున్నాయి. వేల సంఖ్యలో బాటిల్ బాంబ్స్, మందు పాతరలను మావోయిస్టులు అమర్చినట్టుగా బలగాలు గుర్తించడంతో వాటిని డిఫ్యూజ్ చేస్తూ తొలగిస్తున్నాయి. పేలుడు పదార్థాల నిర్వీర్యం ప్రక్రియ పూర్తి కాగానే శాశ్వత రోడ్డు నిర్మాణం జరిపనున్నట్టుగా సమాచారం.
ట్రైనింగ్ క్యాంప్…
మార్చి నెలలో ఈ ఆపరేషన్ పూర్తి చేసిన తరువాత కర్రె గుట్టలపై ప్రత్యేకంగా ట్రైనింగ్ క్యాంపు ఏర్పాటు చేసే యోచనలో ఉన్నతాధికారులు ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక్కడ శిక్షణా కేంద్రం ఏర్పాటు చేసినట్టయితే భవిష్యత్తులో నక్సల్స్ కార్యకలాపాలకు అస్కారం లేకుండా ఉంటుందని అంచనా వేస్తున్నారు. అంతేకాకుండా అత్యంత ఎత్తుగా ఉన్న ఈ గుట్టల మీదుగా పరిశీలించినట్టయితే మావోయిస్టుల ఉనికి కనిపించే అవకాశాలు ఉంటాయని కూడా గుర్తించారు. దీంతో పరిసర ప్రాంతాల్లో కూడా మావోయిస్టుల ఉనికికి ఏ మాత్రం అవకాశం లేదని అంచనా వేస్తున్నారు.
చర్చలే ప్రాణాలు తీశాయి..
శాంతి చర్చల రూపంలో మావోయిస్టు పార్టీ దెబ్బతింటూనే ఉంది. కానీ, అభయ్ పేరిట విడుదల అయిన లేఖలో శాంతి చర్చల అంశాన్ని ప్రస్తావించారు. 2024లో చత్తీస్ గడ్ రాష్ట్రంలో శాంతి చర్చల అంశం తెరపైకి వచ్చింది. కాల్పుల విరమణ ఒప్పందంతో పాటు బేస్ క్యాంపుల ఏర్పాటును నిలిపివేయాలని, గాలింపు చర్యలను నిలిపివేయాలని అప్పుడు మాత్రమే తాము చర్చలకు ముందుకు వస్తామని మావోయిస్టు పార్టీ ఓ ప్రకటన విడుదల చేసింది. ఇదే సమయంలో చత్తీస్ గడ్ రాష్ట్రంలోని దండకారణ్య అటవీ ప్రాంతంలో మావోయిస్టు ఏరివేత ముమ్మరంగా సాగింది. ఆ తరువాత శాంతి చర్చల ప్రతిపాదన అంశం మరుగునపడిపోయింది. శాంతి చర్చలకు నక్సల్స్ ముందుకు వచ్చినప్పటికీ ఏరివేతే లక్ష్యంగా బలగాలు దండకారణ్యాన్ని జల్లెడ పట్టాయి. ఆ తరువాత చర్చల అంశం అంతగా చర్చకు రాకుండా పోయింది. అటు రాష్ట్రంలో పీపుల్స్ వార్ తో చర్చల సందర్భంగా ఆర్ కే, గాజర్ల రవి, జనశక్తి రియాజ్, అమర్, ప్రజా సంఘాలతో రాజశేఖరరెడ్డి ప్రభుత్వం చర్చలు చేసింది. కానీ, చర్చలు జరుపుతుండగానే.. కరీంనగర్, నిజామాబాద్ సరిహద్దులో మానాల ఎన్ కౌంటర్, ఇక్కడ జనశక్తి రియాజ్ హత్యతో చర్చలు ఆగిపోయాయి.
అతలాకుతలం చేసిన ఆపరేషన్ కగార్
మావోయిస్టు పార్టీని ఆపరేషన్ కగార్ అతలాకుతలం చేసింది. ఏకంగా కేంద్ర కమిటీ కార్యదర్శి నంబాల కేశవరావును ముట్టబెట్టింది. కేంద్ర పరిధిలోని సాయుధ బలగాలు దండకారణ్యాన్ని జల్లెడ పట్టాయి. కనిపించిన మావోయిస్టును చంపేశాయి. నిర్భంధం తీవ్రతరం చేశాయి. ఈ నిర్భంధం ఎంతలా అంటే.. అడవుల్లో అన్నలకు కనీసం తిండి కూడా దొరకని పరిస్థితులను తెచ్చి పెట్టింది. ఇలా తిండి కోసం బయటకు వచ్చిన మావోయిస్టు కేంద్ర నాయకత్వాన్ని టార్గెట్ చేసి ఏరిపారేశారు. నంబాల ఎన్ కౌంటర్ కు ముందు ఏకంగా 10 రోజుల పాటు ఆయన కేవలం ఓఆర్ ఎస్ ప్యాకెట్లతోనే ఆకలి తీర్చుకున్నాడని విప్లవ సంఘాలు ఆరోపించాయి. పది రోజుల తర్వాత ఆకలికి తట్టుకోలేక ఆహారం కోసం బయటకు వచ్చిన పార్టీ ప్రధాన కార్యదర్శిని కాల్చి పడేశాయి సాయుధ బలగాలు. ఇలా ఇటీవల ఎన్ కౌంటర్ లో హతమైన వారంతా ఇలా తిండి కోసమో.. అనారోగ్య సమస్యలతో బయటకు వచ్చినవారే.
25 ఏండ్లలో 4875 మంది ఎన్ కౌంటర్
2020 నుంచి మావోయిస్టు పార్టీ వరుసగా ఎదురుదెబ్బలతో సతమతమవుతున్నది. మావోల ఏరివేత కోసం కేంద్రం ఏకంగా 3,13,634 మందితో సీఆర్ పీఎఫ్ బలగాలను పెంచి పోషిస్తోంది. వీరితో పాటు ఆయా రాష్ట్రాల పోలీసు బలగాలు 12.89 లక్షల మంది అదనం. కేంద్రం లెక్కల ప్రకారం జిల్లా, రాష్ట్ర, కేంద్ర కేడర్ లో మావోయిస్టులు 2009 నుంచి 2013 వరకు 20 వేల మంది ఉంటే.. 2013 వరకు ఈ సంఖ్య 9,500కు చేరిందని వెల్లడించారు. కానీ, 2020 నుంచి 2025 వరకు లెక్కేస్తే.. తిరుగుబాటుదారులు కేవలం 600 మంది మాత్రమే అంటూ చెబుతున్నారు. ఈ 25 ఏండ్లలో సాయుధ బలగాల ఎన్ కౌంటర్ లో 4875 మంది మావోయిస్టులు హతమైతే.. 18,163 మంది లొంగిపోయారు. 16,984 మంది పట్టుబడినట్లు గణాంకాలు వెల్లడించాయి.
ఆయుధాలు అప్పగించారు
మొన్నటికి మొన్న నంబాల కేశవరావు, గాజర్ల రవి, సహదేవ్, రామచంద్రారెడ్డ, హనుమంతు వంటి కేంద్ర కమిటీ నేతలు ఎన్ కౌంటర్ లో ప్రాణాలు కోల్పోతే.. మావోయిస్టు పార్టీ ఆత్మ రక్షణలో పడినట్లు కేంద్రం ప్రకటించింది. నిజానికి, దండకారణ్యంలోకి కేంద్ర బలగాలు చొచ్చుకువెళ్లాయి. గిరిజన తండాల్లో మకాం వేశాయి. నిర్భంధాన్ని పెంచారు. ఫలితంగా మావోయిస్టులు అడుగు తీసి అడుగు వేయాలంటే భయపడుతున్నాయి. కానీ, ఇంకా ఏపీ, తెలంగాణ, ఒడిశా, చత్తీస్ ఘడ్, బస్తర్, దండకారణ్యంలో 38 జిల్లాల్లో మావోల ప్రభావం ఉందని బిహార్ పోలీసుల నివేదిక స్పష్టం చేస్తోంది. కానీ, ఇలాంటి సమయంలో ఆగస్టు 15న కేంద్రానికి.. మావోయిస్టు పార్టీ నుంచి రాసినట్లుగా ఒక లేఖ బయటకు వచ్చింది. ఆయుధాలు వీడి.. చర్చకు సిద్ధం అంటూ ఆ లేఖ సారాంశం. లేఖ రాసింది అభయ్ అలియాస్ వేణుగోపాల్ రావు. ఈ లేఖ చక్కర్లు కొడుతుండగానే.. ఒక ఆడియో బయటకు వచ్చింది. దాదాపు 8.35 నిమిషాల నిడివితో ఉన్న ఈ ఆడియోలో మాట్లాడింది వేణుగోపాల్ రావు అని మాజీ మావోయిస్టులు స్పష్టత ఇచ్చారు. దీని వెనకే మరో లేఖ..ఇలా మొదలైన వెనకడుగు ప్రస్థానం ఇప్పుడు ముగింపు దశకు చేరుకుంది.
అవసానదశలో గణపతి
ఇప్పుడు మావోయిస్టు పార్టీ కేంద్ర నాయకత్వం ఆయుధాలు అప్పగించి.. ఉద్యమానికి వీడ్కోలు పలికింది. ఇప్పుడు మావోయిస్టు లీడర్లు ఎవరైనా ఉన్నారా అంటే ఒక గణపతి.. ఇంకో దామోదర్ మాత్రమే అన్నట్లు ఉంది. కానీ, గణపతి దాదాపు 10 ఏండ్ల క్రితమే తీవ్ర అనారోగ్యంతో ఉన్నారు. ఆయన నడవలేని పరిస్థితుల్లో శ్రీలంకలో తలదాచుకున్నట్లు ఒక టాక్. ఇప్పుడు దామోదర్ ఒక్కడే మిగిలినా.. రేపో మాపో ఆయన కూడా లొంగిపోవాలి లేదా ఎన్ కౌంటర్లతో సహవాసం చేయాల్సిందే. ఎటు చూసినా.. ఏండ్ల తరబడి ప్రభుత్వాలను గడగడలాడించిన మావోయిస్టు ఉద్యమం ఇప్పుడు అరణ్యవాసం చేస్తున్నది. విప్లవ పోరాటాలకు ఇక లాల్ సలాం అన్నట్టు మారింది. మొత్తానికి అరణ్యం తలవంచింది. పాలకుల చేతి ఆయుధం విప్లవ పోరాటానికి అంతం చూపింది.