పోలీసులకు లొంగిపోయిన 108 మంది స్పెషల్ జోనల్ కమిటీ సభ్యులు
ఐదుగురు డివిజనల్ కమిటీ సభ్యులు, ఇద్దరు సీవైపీసీ కమాండర్లు
రూ.3.61 కోట్ల లిక్విడ్ క్యాష్, కిలో బంగారం స్వాధీనం
ఫలితమిస్తోన్న ఛత్తీస్ గడ్ పూనా మార్గెమ్
26 నెలల్లో జనజీవనంలో కలిసిన 2,714 మంది మావోలు
ముద్ర, నేషనల్ డెస్క్ :
ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం, పోలీసు యంత్రాంగం చేపట్టిన ‘పూనా మార్గెమ్ – పునరావాసం నుంచి పునర్జీవనం’ అనే కార్యక్రమం బస్తర్ ప్రాంతంలో విప్లవాత్మక మార్పులు తీసుకువస్తోంది. ఇందులో భాగంగానే బుధవారం బస్తర్ సంభాగ్ ముఖ్య కేంద్రం జగదల్‌పూర్‌లోని ‘శౌర్య భవన్’ పోలీస్ కో-ఆర్డినేషన్ సెంటర్ వేదికగా భారీ ఎత్తున మావోయిస్టుల సరెండర్ అయ్యారు. దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీకి చెందిన 108 మంది మావోయిస్టు క్యాడర్లు హింసా మార్గాన్ని వీడి జనజీవన స్రవంతిలో కలిశారు. వీరిలో 44 మంది మహిళా మావోయిస్టులు ఉండటం గమనార్హం. లొంగిపోయిన మావోయిస్టులపై ప్రభుత్వం మొత్తం రూ.3.29 కోట్ల రివార్డును ప్రకటించింది. సరెండర్ అయిన వారిలో రాహుల్ తేలాం, పండ్రూ కోవాసి, జితురూ ఓయామ్ వంటి ఐదుగురు డివిజనల్ కమిటీ సభ్యులు, ఇద్దరు సీవైపీసీ కమాండర్లు, 15 మంది ప్లాటూన్ పార్టీ కమిటీ సభ్యులు ఉన్నారు. ఈ కార్యక్రమంలో ఛత్తీస్‌గఢ్ డీజీపీ అరుణ్ దేవ్ గౌతమ్, బస్తర్ రేంజ్ ఐజీ సుందర్‌రాజ్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. గత 26 నెలల్లో మొత్తం 2,714 మంది మావోయిస్టులు హింసను వీడి శాంతి మార్గంలోకి వచ్చారని ఐజీ సుందర్‌రాజ్ తెలిపారు. లొంగిపోయిన వారికి ప్రభుత్వం తరపున ఆర్థిక సాయం, నైపుణ్యాభివృద్ధి శిక్షణ, ఉపాధి కల్పిస్తామని భరోసానిచ్చారు. ఇంకా మిగిలి ఉన్న మావోయిస్టులు కూడా ఆయుధాలు వీడి జనజీవన స్రవంతిలో చేరాలని వారు విజ్ఞప్తి చేశారు.
భారీగా ఆయుధాలు స్వాధీనం..
సరెండర్ అయిన మావోయిస్టులు ఇచ్చిన సమాచారం మేరకు భద్రతా దళాలు వివిధ ప్రాంతాల్లోని డంపులపై దాడులు చేసి భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నాయి. అందులో 7 AK-47 రైఫిళ్లు, 10 ఇన్సాస్ (INSAS) రైఫిళ్లు, 4 ఎల్‌ఎమ్‌జీ, 11 బిజిఎల్ లాంచర్లు, 20 303-రైఫిళ్లు, 25 కంట్రీ మేడ్ 12 బోర్ రైఫిళ్లు ఉన్నాయి. లొంగుబాట్లలో భాగంగా చరిత్రలో ఎన్నడూ లేని తొలిసారిగా ఒకే చోట రూ.3.61 కోట్ల లిక్విడ్ క్యాష్, 1 కిలో బంగారం కూడా స్వాధీనం పోలీసులు చేసుకున్నారు. అత్యధికంగా నారాయణపూర్ జిల్లా నుంచి 49 ఆయుధాలు లభించగా, బస్తర్ (24), సుక్మా (12), బీజాపూర్ (09), దంతేవాడ (05), కాంకేర్ (02) జిల్లాల నుంచి మిగిలిన ఆయుధాలను భద్రతా దళాలు రికవరీ చేశాయి.