కార్పొరేషన్లలో ఉపాధి అవకాశాలు మెరుగుపరుస్తాం 40 రోజుల్లోనే చేసి చూపిస్తాం రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్
ముద్ర, నిజామాబాద్ :
రానున్న 40 రోజుల్లో రాష్ట్రంలోని అన్ని కార్పొరేషన్లలో ఉపాధి అవకాశాలు మెరుగుపరుస్తామని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గా కూరగాయల ఉమారాణి ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తో కలిసి విచ్చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్ర మంత్రివర్గ సభ్యులందరం కలిసి 40 రోజుల్లో రాష్ట్రంలోని కార్పొరేషన్ల అభివృద్ధి కోసం, ఉపాధి అవకాశాలు మెరుగు పరిచేందుకు నిర్ణయం తీసుకుంటామన్నారు. స్థానిక సంస్థలు, గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఆదరించిన ప్రజలు, మున్సిపల్ ఎన్నికల్లో కూడా ఆదరించారన్నారు. ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తెలంగాణ విజన్ 2047 పేరుతో ముందుకు పోతోందన్నారు. 2014 లో రాజ్యసభలో తెలంగాణ బిల్లును పాస్ చేసుకున్న రోజు తెలంగాణ ప్రజల ఆకాంక్ష ఇదేనన్నారు. 29వ రాష్ట్రంగా ఏర్పడిన తెలంగాణ దేశంలోనే చిన్న రాష్ట్రంగా అవతరించిందన్నారు. కానీ, అభివృద్ధిలో ముందుకు పోతుందన్నారు. నీళ్లు నిధులు నియామకాలు పేరుతో ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం అదే లక్ష్యంతో ముందుకు పోతుందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఈ లక్ష్యసాధనలో కేంద్ర ప్రభుత్వం తెలంగాణ కు అన్ని రకాలుగా సహకరించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఇక్కడున్న కేంద్ర మంత్రులు ఎంపీలు అందరూ తెలంగాణ అభివృద్ధికి సహకరించాలని మంత్రి పొన్నం విజ్ఞప్తి చేశారు. బీజేపీ కేంద్ర ప్రభుత్వం, ప్రధాన నరేంద్ర మోదీ తెలంగాణ అభివృద్ధి కోసం నిధులు కేటాయించాలని ఈ సందర్భంగా మంత్రి కోరారు. తెలంగాణ ఏర్పాటై పన్నెండేళ్ల అయ్యిందని, బీజేపీ ప్రభుత్వం ఇప్పటికైనా తెలంగాణ పై శీతకన్ను వదిలిపెట్టాలని మంత్రి పొన్నం ప్రభాకర్ కేంద్రానికి చురకలంటించారు. సోనియాగాంధీ నాయకత్‌వంలో తెలంగాణ సాధించుకున్నామని, తెలంగాణ ఇచ్చినందుకు ఈ సందర్భంగా మంత్రి పొన్నం సోనియాకు ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ కోసం అసువులు బాసి అమరులు, ఉద్యమకారులకు 250 గజాల స్థలాన్ని ఇస్తామన్నారు. తెలంగాణ మేనిఫెస్టోలో ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తామన్నారు. తెలంగాణ ఉద్యమం కోసం జైల్లోకి వెళ్లినవారు, కేసులు ఎదుర్కొన్నవారు, ప్రాణాలర్పించిన వారందరికీ నివాళులర్పించారు. వారికిచ్చిన హామీలన్నీ నెరవేరుస్తామన్నారు. ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను అమలు చేయడానికి మంత్రివర్గంలో సబ్ కమిటీని ఏర్పాటు చేసి, అన్ని విధాలుగా వారిని ఆదుకుంటామన్నారు. ఎన్నికల సమయంలోనే రాజకీయాలు చేస్తామన్న టీపీసీసీ మహేష్ కుమార్ గౌడ్ ఇకపై పట్టణాలు అభివృద్ధికి ప్రత్యేకంగా నిధులు తెస్తామని, అభివృద్ధి చేస్తామని చెప్పారు. నగరంలో డ్రైనేజీలు, సీసీ రోడ్లను అభివృద్ధి చేస్తామన్నారు. పట్టణాల అభివృద్ధికి అన్ని పార్టీలు కలిసి రావాలని ఆయన పిలుపునిచ్చారు. ఎన్నికలు ముగిశాయని, ఇక అన్ని పార్టీలు కలిసి పార్టీలకతీతంగా నిజామాబాద్ అభివృద్ధికి తోడ్పడాలని మహేశ్ గౌడ్ కోరారు. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డి మాట్లాడుతూ.. ఎంపీ అర్వింద్ ధర్మపురి పై విమర్శలు చేశారు. మతాలు, కులాల పేరుతో మాట్లాడటం ఆపేయాలని ఎంపీ అర్వింద్ కు సూచించారు. నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో ఎక్కడా బీజేపీ కనబడడం లేదని రూరల్ ఎమ్మెల్యే వెటకారం చేశారు. ఇప్పుడైనా నిజామాబాద్ అభివృద్ధికి తోడ్పడాలని ఎమ్మెల్యే భూపతిరెడ్డి ఎంపీ అర్వింద్ ను కోరారు.