అడవిలో మోహరించిన గ్రేహౌండ్స్, సీఆర్‌పీఎఫ్, కోబ్రా బలగాలను వెనక్కి తీసుకోవాలి
ముద్ర, తెలంగాణ బ్యూరో :
కర్రెగుట్టలో కొనసాగుతోన్న కూంబింగ్‌ను వెంటనే నిలిపివేయాలని సీపీఐ(ఎం) రాష్ట కార్యదర్శి జాన్ వెస్లీ.. కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అడవిలో మోహరించిన గ్రేహౌండ్స్, సీఆర్‌పీఎఫ్, కోబ్రా బలగాలను తక్షణమే వెనక్కి తీసుకోవాలన్నారు. కేంద్ర హెూంశాఖ విధించిన 40 రోజుల డెడ్‌లైన్ పేరుతో కర్రెగుట్టల అటవీ ప్రాంతంలో గత రెండు రోజులుగా సాయుధ బలగాలు జరిపిన కాల్పుల్లో ఇప్పటికే ఐదుగురు మావోయిస్టులు మరణించినట్లు ప్రచారం జరుగుతోందన్నారు. ఇంకొంత మంది అగ్రనేతల ప్రాణాలకు హాని కలిగించేలా గాలింపు చర్యలు ఇంకా కొనసాగుతుండటం ఆందోళనకరమన్నారు. ఆపరేషన్ కాగర్-2 పేరుతో కర్రెగుట్ట అటవీ ప్రాంతాన్ని వేలాది మంది సాయుధ బలగాలు చుట్టుముట్టి, మావోయిస్టులను హతమార్చడాన్నిఖండిస్తున్నారన్నారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ప్రకటన విడుదల చేశారు. మావోయిస్టులు ఎలాంటి హింసాత్మక ఘటనలకు పాల్పడడం లేదన్న జాన్ వెస్లీ… ప్రభుత్వంతో చర్చలు జరిపేందుకు సిద్ధమని ప్రకటించిన విషయాన్ని గుర్తు చేశారు. ఇప్పటికైనా కేంద్రం హింసాత్మక చర్యలను నిలిపివేసి, సమస్య పరిష్కారానికి మావోయిస్టులు జనజీవన స్రవంతిలోకి వచ్చే విధంగా వారితో చర్చలు జరపాలన్నారు. ఈ విషయంలో దేశ వ్యాప్తంగా తమ పార్టీతో పాటు, వివిధ రాజకీయ పార్టీలు, మేధావులు, ప్రజాస్వామిక వాదులు కేంద్రానికి ఎన్ని విజ్ఞప్తులు చేసినా కేంద్రం ప్రభుత్వం బేఖాతరు చేస్తోందని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం మొండిగా హింసాత్మక మార్గాన్నే ఎంచుకోవడం సరైంది కాదన్నారు. తక్షణమే ఈ మారణకాండను నిలిపివేయాలని, అటవీ ప్రాంతంలో సాధారణ స్థితిని పునరుద్ధరించాలని, మావోయిస్టులతో చర్చలు జరపాలని డిమాండ్ చేశారు.