మేడ్చల్ రూరల్, ఏప్రిల్ 24 : జమ్మూ కాశ్మీర్ లో కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతున్న పర్యాటకులపై విచక్షణారహితంగా కాల్పులు జరిపి 28 మంది పర్యాటకులను పొట్టనబెట్టుకున్న తీవ్రవాదుల దుశ్చర్యను గౌడవల్లిలోని సాకేత్ ప్రణామం నిర్వాసితులైన సీనియర్ సిటిజన్స్ తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా వారు గురువారం సాయంత్రం నల్ల బ్యాడ్జీలతో క్యాండిల్ ర్యాలీ నిర్వహించి సమావేశమయ్యారు. అనంతరం రెండు నిముషాలు మౌనం పాటించారు. పహల్గాంలోని బైసరన్ ప్రాంతంలో జరిగిన ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వారికి సంతాపాన్ని తెలియజేశారు. అలాగే వారి కుటుంబాలకు సానుభూతి తెలిపారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
ఇంతటి దారుణానికి పాల్పడిన కిరాతకులను పట్టుకుని కఠినంగా శిక్షించాలంటూ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య వక్తగా పాల్గొన్న జనవిజ్ఞాన వేదిక నాయకుడు వరప్రసాదరావు మాట్లాడుతూ పహల్గాం దాడికి పాల్పడిన వారిని పట్టుకోవడానికి కేంద్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకోవాలని కోరారు. ఇటువంటి దారుణమైన నేరాలకు పాల్పడినవారు దేశానికి శత్రువులన్నారు. ఈ విషాద సమయంలో ఉగ్రవాద , ఛాందసవాద శక్తులకు వ్యతిరేకంగా ప్రతి ఒక్కరూ కాశ్మీర్ ప్రజలకు బాసటగా ఉండాలన్నారు. కార్యక్రమంలో అపార్ట్మెంట్ మాజీ అధ్యక్షుడు భక్తవత్సలరావు ,ఫ్రెండ్స్ అసోసియేషన్ కార్యదర్శి డా. వల్లభేంద్రరెడ్డి, కోపరేటివ్ సొసైటీ ట్రెజరర్ శేష సాయి, కుమారస్వామి , నిర్మల , చంద్రకాంతారావు తదితరులు పాల్గొన్నారు.