Take a fresh look at your lifestyle.

వనపర్తిని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తాం-మున్సిపల్ సమావేశంలో ఎమ్మెల్యే మెగారెడ్డి

అధికారులు సమన్వయంతో పనిచేయాలి
ముద్ర, వనపర్తి :
వనపర్తి మున్సిపాలిటీని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని అందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని వనపర్తి ఎమ్మెల్యే మెగా రెడ్డి అన్నారు.

మంగళవారం వనపర్తి సమావేశం మందిరంలో మున్సిపల్ కౌన్సిల్ సమావేశం చైర్మన్ మాధవి అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో 2026-27 ఆర్థిక సంవత్సరంలో వనపర్తి పురపాలికలో రూ. 55.31 కోట్ల ఆదాయం సమకూర నున్నట్లు, సవరించిన అంచనా బడ్జెట్ ను వనపర్తి పురపాలిక కౌన్సిల్ ఆమోదం తెలిపింది. ఇందులో మున్సిపాలిటీలో వివిధ మార్గాల ద్వారా వచ్చే ఆదాయంతో పాటు ప్లాన్, నాన్ ప్లాన్ గ్రాంట్స్ నిధులు ఉన్నాయని, 2025-26 సవరించిన బడ్జెట్, ఇప్పటి వరకు అయిన ఖర్చులు, 2026-27 ఆర్థిక సంవత్సరంలో అంచనా బడ్జెట్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు బడ్జెట్ వివరాలను సభముందు ఉంచారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో సవరించిన అంచనా బడ్జెట్ 53.85 కోట్లు ఉండగా 2026-27 కు 55.31 కోట్లు గా అంచనా వేశారు. ఇందులో 10 శాతం నిధులు మొక్కలు నాటడం, వాటి సంరక్షణకు గ్రీన్ బడ్జెట్ గా కేటాయించినట్లు చూపించారు. 1/3 వంతు బడ్జెట్ ను పురపాలక సంఘంలోని వెనుకబడిన ప్రాంతాలు, అభివృద్ధి చెందని ప్రాంతాలు, మైనారిటీ, బలహీన వర్గాలు నివసించే ప్రాంతాలు, మురికి వాడల అభివృద్ధికి వాడనున్నట్లు పేర్కొన్నారు. గత సంవత్సరం సవరించిన బడ్జెట్ అంచనాలలో 36.46 కోట్ల రూపాయలు ఆదాయంగా సమకూర్చుకోగా అందులో నుంచి 28.03 కోట్లు వివిధ అభివృద్ధి పనులకు ఖర్చు చేసినట్లు తెలిపారు. 8.43 కోట్ల రూపాయలు ఈ ఆర్థిక సంవత్సరంలో ఓపెనింగ్ బ్యాలెన్స్ గా చూపించడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్న స్థానిక శాసనసభ్యులు తుడి మేఘా రెడ్డి మాట్లాడుతూ వనపర్తి మున్సిపాలిటీ రాష్ట్రంలో చూస్తే చాలా వెనుకబడి ఉందని, మున్సిపాలిటీ అభివృద్ధికి ప్రజలు ఎంతో నమ్మకంతో కౌన్సిల్ సభ్యులను గెలిపించారని, అందువల్ల ప్రజా ప్రతినిధులు, మున్సిపల్ అధికారులు కలిసి కట్టుగా సమన్వయంతో పనిచేసి వనపర్తి మున్సిపాలిటీని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలని సూచించారు. త్వరలోనే ప్రత్యేక మున్సిపల్ సమావేశం ఏర్పాటు చేయడం జరుగుతుందని ఈ లోగా మున్సిపల్ ఇంజనీరింగ్ శాఖకు సంబంధించిన సిబ్బంది, శానిటేషన్ సిబ్బంది ఎంతమంది ఉన్నారు, వారు ఎక్కడెక్కడ విధులు నిర్వహిస్తున్నారు అనే వివరాలు సభ ముందు ఉంచాలన్నారు. అమృత్ 2.0 పనుల ప్రస్తుత స్థితిగతులు ఏంటి, విద్యుత్ స్తంభాలు ఎన్ని ఉన్నాయి, వాటి ప్రస్తుత పరిస్థితి ఎలా ఉంది, ఎన్నింటికీ వీధి దీపాలు ఉన్నాయి, ఇంకా ఎన్ని కావాలి, సి.సి. కెమెరాల పరిస్థితి ఏంటి, ఎన్ని పార్కులు ఉన్నాయి, వాటిలో ఉన్న మౌలిక సదుపాయాలు ఏంటి, మిషన్ భగీరథ పరిస్తితి ఏంటి అనే వివరాల పూర్తి నివేదిక సిద్ధం చేసుకొని ఇవ్వాలని ఆదేశించారు. ఇప్పటి వరకు ఎన్ని టెండర్లు పిలిచారు, ఎన్ని పనులు నడుస్తున్నాయి, మున్సిపాలిటీకి మంజూరు చేయించిన 18.7 కోట్ల నిధులతో చేపట్టిన పనులు ఏమిటి, పట్టణంలో శ్మశాన వాటికల పరిస్తితి ఏంటి ఇంకా అవసరమైన స్థలం, శ్మశాన వాటికలో బర్నింగ్ మిషన్ ఏర్పాటు, డంపింగ్ యార్డులో యంత్రాల ఏర్పాటు వంటి అంశాలపై నివేదిక సిద్ధం చేసుకొని ఇవ్వాలని ఆదేశించారు. మున్సిపల్ సిబ్బంది తమ పనితీరును మార్చుకోవాలని, మున్సిపాలిటీ అభివృద్ధికి చిత్త శుద్ధితో పనిచేయాలి లేని పక్షంలో సెలవు పై వెళ్ళిపోవాలని హెచ్చరించారు. రోడ్డు పైన చిరు వ్యాపారం చేసుకునే వారిని నచ్చచెప్పి సమీకృత మార్కెట్ కు పంపించాలని, ఇంతముందు ఉన్న దుకాణాల రేటును గణనీయంగా తగ్గించడం జరిగిందని తెలిపారు. సమావేశానికి అధ్యక్షత వహించిన మున్సిపల్ చైర్ పర్సన్ మాధవి మాట్లాడుతూ పార్టీలకతీతంగా మున్సిపాలిటీలోని అన్ని వార్డులకు సమాన నిధులు కేటాయించి అన్ని వార్డులలో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు కృషి చేస్తామని చెప్పారు. ముఖ్యంగా వెనుకబడిన వార్డులకు అధిక ప్రాధాన్యత ఇచ్చి మౌలిక సదుపాయాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని తెలియజేశారు. అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ ఎన్ ఖీమ్య నాయక్ మాట్లాడుతూ నిధులు సమకూర్చుకుంటేనే అభివృద్ధి సాధించవచ్చని సూచించారు. పురపాలికలో ప్రాపర్టీ ట్యాక్స్ వంద శాతం వసూలు చేసేందుకు కృషి చేయాలని, ప్రస్తుత సంవత్సరం ప్రాపర్టీ ట్యాక్స్ లక్ష్యం 5.50 కోట్లు ఉంటే ఇప్పటి వరకు వసూలు చేయాల్సిన బకాయిలే 7 కోట్లు ఉన్నాయని గుర్తు చేశారు. నిధులు సమకూర్చుకుంటే కేంద్ర నిధులు రావడం కష్టమని తెలిపారు. వనపర్తి మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు, వైస్ చైర్మన్ మధుసూదన్ గౌడ్, మున్సిపల్ కౌన్సిలర్లు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.