ముద్ర, వనపర్తి :
వనపర్తి, నాగర్ కర్నూలు జిల్లాల్లో లీడ్ బ్యాంకు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సేవలు ప్రశంసనీయం అని నాగర్ కర్నూల్ పార్లమెంట్ సభ్యులు మల్లు రవి ప్రశంసించారు.

బుధవారం గోపాల్పేట మండల పరిధిలోని గ్రామంలో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నూతన బ్రాంచ్ ను ఎంపీ మల్లు రవి, వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ జిల్లెల్ల చిన్నారెడ్డి తో కలిసి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. వీరితోపాటు అదనపు కలెక్టర్ రెవెన్యూ వినోద్ కుమార్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సిజిఎం రవీంద్రబాబు, మాజీ ఆర్ఎం సత్యనారాయణ, నూతన ఆర్ఎం వెంకటేశ్వర్లు ఉన్నారు. ప్రారంభోత్సవం అనంతరం ఎంపీ మల్లురవి మాట్లాడుతూ బుద్ధారం గ్రామంలో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 694వ బ్రాంచ్ ను ప్రారంభించడం అభినందనీయమని తెలిపారు. బ్యాంకులు రైతులకు, ఎంఎస్ఎమ్ఈలకు ప్రాధాన్యతగా రుణాలు ఇవ్వాలని తద్వారా ఎంతమందికి ఉపాధి లభిస్తుందని తెలిపారు. బ్యాంకులో నుంచి రుణాలు పొందిన వారు కూడా సకాలంలో వాటిని తిరిగి చెల్లించి బ్యాంకుల అభివృద్ధికి కూడా సహకరించాలని సూచించారు. ఇక వనపర్తి, నాగర్ కర్నూల్ గద్వాల్ జిల్లాలలో లీడ్ బ్యాంక్ అయిన యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చేస్తున్న సేవలు ఎంతో ప్రశంస నీయమని కొనియాడారు. సాంఘిక సంక్షేమ పాఠశాలల్లో మరుగుదొడ్ల నిర్మాణానికి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సి బిలిటీ కింద చర్యలు తీసుకుంటుందన్నారు. అదేవిధంగా యువతకు నైపుణ్య శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పించే విధంగా గ్రామీణ స్వయం ఉపాధి కేంద్రాలను కూడా అన్నారు. ఇన్ని సేవలు చేయడం అభినందనీయమని కొనియాడారు. నాగర్ కర్నూల్ రైల్వే లైన్ కోసం తాను పార్లమెంటులో ఎంతగానో కృషి చేస్తున్నానని ఈ సందర్భంగా ఎంపీ తెలియ జేశారు. ఎమ్మెల్యే మేఘారెడ్డి మాట్లాడుతూ బుద్ధారం గ్రామంలో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ ప్రారంభించడం ఆనందంగా ఉందని తెలిపారు. ప్రజలు బ్యాంకు సేవలను సద్వి నియోగం చేసుకోవాలని సూచించారు. ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు చిన్నారెడ్డి మాట్లాడుతూ గ్రామ అభివృద్ధికి నూతనంగా ఏర్పాటు చేసిన యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ ఉపయోగపడుతుందని తెలిపారు. ప్రజలు బ్యాంకు సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
గోపాల్పేటలో సైన్స్ ల్యాబ్ ప్రారంభం
గోపాల్పేట మండల కేంద్రంలోని ప్రభుత్వ జడ్పిహెచ్ఎస్ పాఠశాలలో పీఎం శ్రీ పథకం కింద రూ. 13.50 లక్షల వ్యయంతో నిర్మించిన నూతన సైన్స్ ల్యాబ్ ను ఎంపీ మల్లు రవి, వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ జిల్లెల్ల చిన్నారెడ్డి తో కలిసి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అదేవిధంగా గోపాల్పేట మండల కేంద్రంలో రూ. 4 లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన హైమాస్ట్ లైట్లను ప్రారంభించారు.
అంతకుముందు బుద్ధారం గ్రామ శివారులో ఏర్పాటు చేసిన వరి కొనుగోలు కేంద్రాన్ని ఎంపీ మల్లురవి ప్రారంభించారు. కార్యక్రమంలో మాజీ డిసిసిబి చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి, వనపర్తి వ్యవసాయ మార్కెట్ యార్డు చైర్మన్ శ్రీనివాస్ గౌడ్, లీడ్ బ్యాంకు మేనేజర్ శివకుమార్, స్థానికులు అచ్యుత రామారావు, బుద్ధారం సర్పంచ్ శేఖర్, ఇతర ప్రజాప్రతినిధులు అధికారులు తదితరులు పాల్గొన్నారు.