ముద్ర, తాండూర్.
ఆర్టీసీ జేఏసీ పిలుపుతో బుధవారం వికారాబాద్ జిల్లా తాండూర్ ఆర్టీసీ డిపోలో తమ డిమాండ్ల సాధన నిమిత్తం కార్మికులు సమ్మె సైరన్ మోగించారు. మంగళవారం అర్ధరాత్రి నుండి ఆర్టీసీబస్సులతో పాటు ప్రైవేట్ బస్సులు సైతం కదలక డిపోకే పరిమితమయ్యాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. తమ తమ గమ్యస్థానాలకు చేరేందుకు ప్రైవేట్ వాహనాల్లో బయలుదేరారు. ప్రయాణికులు లేక బస్ స్టేషన్ బోసిపోయింది. ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగడంతో బస్ స్టేషన్ తో పాటు పరిసర ప్రాంతాల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించారు. కార్మికులకు ప్రజా సంఘ నాయకులు సంఘీభావం తెలిపారు. కార్యక్రమంలో ఆర్టీసీ జేఏసీ గౌరవ అధ్యక్షులు సోమశేఖర్, జేఏసీ చైర్మన్ అంజిలయ్య, పిడిఎస్ యు వికారాబాద్ జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్, సిఐటియు జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
