- మైక్రోసాఫ్ట్ భాగస్వామ్యంతో ఏఐ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం
- హైదరాబాద్లో మైక్రోసాఫ్ట్ అతిపెద్ద డాటా హబ్ ను ప్రారంభించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
- ఏఐ హబ్ ద్వారా ఉత్తమ పరిశోధన పద్ధతులు అందుబాటులోకి రావడంపై హర్షం
(ముద్ర ప్రతినిధి, ఉమ్మడి రంగారెడ్డి) : తెలంగాణ ప్రభుత్వ భాగస్వామ్యంతో మైక్రోసాఫ్ట్ సంస్థ హైదరాబాద్ లో ఆర్టిఫిసియల్ ఇంటెలిజెన్స్(ఏ ఐ )సెంటర్ ఆఫ్ ఎక్సెలెన్స్ ను ఏర్పాటు చేయనుందని ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి వెల్లడించారు.అర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అభివృద్ధితో పాటు రాష్ట్రంలో హైపర్ స్కేల్ ఏఐ డేటా సెంటర్ల ఏర్పాటు ద్వారా మైక్రోసాఫ్ట్ రాబోయే రెండేళ్లలో అదనంగా రూ.15,000 కోట్ల పెట్టుబడులు పెట్టనుందని చెప్పారు.గురువారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబుతో కలిసి గచ్చిబౌలిలో మైక్రోసాఫ్ట్ కొత్త భవనాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ..ప్రపంచ దిగ్గజ ఐటీ సంస్థ మైక్రోసాఫ్ట్ కు అతిపెద్ద డేటా హబ్ గా హైదరాబాద్ అవతరించిందన్నారు.ఈమేరకు గచ్చిబౌలిలో ని తమ క్యాంపస్ ను 1.1 మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణంలో విస్తరించిందని తెలిపారు.అధునాతన ప్రమాణాలతో కొత్త భవనం నిర్మించిందని,ఇందులో 2,500 మంది ఉద్యోగులకు సరిపడే సదుపాయాలను కల్పించిందన్నారు.ఏఐ నాలెడ్జ్ హబ్‌తో పాటు ఏ ఐ అభివృద్ధికి క్లౌడ్-ఆధారిత మౌలిక సదుపాయాలు ఇందులో ఉంటాయని చెప్పారు.రాష్ట్రంలో వేలాది మంది ఉద్యోగులకు ఉపయోగపడేలా రీసేర్చీ,కేస్ స్టడీస్,ఉత్తమ పరిశోధన పద్ధతులను మైక్రోసాఫ్ట్ సంస్థ ఏఐ ఎక్స్ లెన్సీ సెంటర్లలో అందుబాటులో ఉంచుతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు.హైదరాబాద్ కేంద్రంగాఏఐ నాలెడ్జ్ హబ్, ఏఐ ఆధారిత డాటా సెంటర్ల ఏర్పాటుతో రాబోయే రెండు సంవత్సరాల్లో మైక్రోసాఫ్ట్ రూ.15,000 కోట్ల పెట్టుబడులు6 పెట్టనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.
ఏఐలో 3 ప్రోగ్రామ్స్ ద్వారా లక్ష మందికి మైక్రోసాఫ్ట్ శిక్షణ
తెలంగాణ ప్రభుత్వ భాగస్వామ్యంతో రాష్ట్రంలోని 1 లక్ష మందికి పైగా ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ శిక్షణను అందించేందుకు మైక్రోసాఫ్ట్ సంస్థ మూడు కొత్త ప్రోగ్రాంలను ప్రకటించింది.తెలంగాణ ప్రోగ్రాం పేరిట మైక్రోసాఫ్ట్ 500 ప్రభుత్వ పాఠశాలల్లో ఏఐ కోర్సును పరిచయం చేసేందుకు ఏ ఐ ఫౌండేషన్స్ అకాడమీని ప్రారంభిస్తోంది.దీంతో దాదాపు 50వేల మంది విద్యార్థులకు ప్రయోజనం చేకూరుతుంది.ఏఐ-ఇండస్ట్రీ ప్రో పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా 20,000 మంది పరిశ్రమల నిపుణులకు నైపుణ్యాలను నేర్పించడం జరుగుతుంది.ఏ ఐ-గవర్న్ ఇనీషియేటివ్ పేరుతో రాష్ట్రంలోని దాదాపు 50 వేల మంది ప్రభుత్వ అధికారులకు ఏఐ,సైబర్ సెక్యూరిటీ,డిజిటల్ ప్రొడక్టివిటీ వంటి కీలకమైన రంగాలలో మైక్రోసాఫ్ట్ సంస్థ నిపుణులు శిక్షణ ఇవ్వనున్నారు.ఈ ప్రణాళికలకు సంబంధించి మైక్రోసాఫ్ట్ కంపెనీ రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం చేసుకున్నాయి.ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి డి.శ్రీధర్ బాబు, మైక్రోసాఫ్ట్ మేనేజింగ్ డైరెక్టర్ రాజ్ కుమార్ సమక్షంలో ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు.ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మైక్రోసాఫ్ట్ ప్రతినిధులను అభినందించారు.ఈ కార్యక్రమంలో శేరిలింగంపల్లి శాసన సభ్యులు అరికె పూడి గాంధీ,ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్, మైక్రోసాఫ్ట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.